నీతిమంతులపై అగ్గిపిడుగు!
► నోట్లరద్దుతో 99 శాతం మందికి ఇబ్బందులు
► ఆ ఒక్క శాతం చేతుల్లోనే 60% దేశ సంపద: రాహుల్
పణజి: మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అవినీతిపై సర్జికల్ దాడి కాదని.. నిజాయితీపరులపై అగ్గిపిడుగని (ఫైర్‌బాంబింగ్) కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. పణజిలో శుక్రవారం జరిగిన ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘నవంబర్ 8న మోదీ నిద్రలేచారు. మీ జేబుల్లోని నోట్లను చిత్తుకాగితాల్లా మార్చేశారు. మోదీ నిర్ణయంతో 99 శాతం నీతిమంతులపైనే అగ్గిపిడుగులు పడుతున్నాయి. రెండో ప్రపంచయుద్ధంలో విమానాల ద్వారా బాంబులతో ఒకేసారి దాడిచేసి 25 నిమిషాల్లో అంతా నేలమట్టం చేశారు. ఇప్పుడు మోదీ నోట్ల రద్దు నిర్ణయమూ ఇలాంటిదే. సామాన్యులకు, నీతిమంతులకు తీవ్రంగా నష్టం చేస్తోంది. ఈ నిర్ణయం దేశమంతటినీ దహించేస్తోంది’ అని దుయ్యబట్టారు. ఈ రెండున్నరేళ్లలో 1% మందే 60% సంపదను అదుపులో పెట్టుకున్నారన్నారు. కేవలం 50 భారతీయ కుటుంబాల చేతుల్లోనే దేశ సంపద ఉందని ఆరోపించారు.
రైతు సమస్యలపై ప్రధానిని కలిసిన రాహుల్..శుక్రవారం ఉదయం రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం ప్రధాని మోదీని కలిసి రైతు సమస్యలపై మెమొరాండం సమర్పించింది. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి.. వారి రుణాలను మాఫీ చేయాలని కోరింది. రైతు ఆత్మహత్యలపై దృష్టిపెట్టాలని కోరినట్లు.. అనంతరం రాహుల్ తెలిపారు. ‘మేం చెప్పిన విషయాలను మోదీ సావధానంగా విన్నారు. రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అంగీకరించారు. అయితే రుణ మాఫీపై ఏమీ చెప్పలేదు’అని తెలిపారు. తనను తరచూ కలుస్తూ ఉండాలని రాహుల్‌ను మోదీ కోరినట్లు తెలిసింది.