
పట్నా: ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో అవమానాలు ఎదుర్కొన్న ఓ మహిళ ఏకంగా తన మామపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో మరుగుదొడ్డి కట్టిస్తానని మామతో బాండ్ పేపర్‌పై సంతకం చేయించి.. విజయం సాధించింది. ఈ ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా ఛగన్‌నౌరా గ్రామంలో చోటుచేసుకుంది. ఇంట్లో టాయ్‌లెట్ కట్టాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా తన మామ, బావ పట్టించుకోలేదని, దీనిపై తనకు న్యాయం చేయాలంటూ మహిళ సెప్టెంబర్ 25న ముజఫర్‌పూర్ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఇంట్లో టాయ్‌లెట్ లేకపోవడంతో ఎదురవుతున్న కష్టాలను తట్టుకోలేక.. ఆమె తన భర్త పని కోసం తమిళనాడు వెళ్లగానే.. పుట్టింటికి వెళ్లిపోయేది. మళ్లీ తన భర్త తిరిగొస్తే.. ఆమె అత్తింటికి వచ్చేది. అయినా, పరిస్థితిలో ఏమార్పు కనిపించకపోవడంతో మామ, బావకు వ్యతిరేకంగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు నిందితులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామని, ఇంట్లో మరుగుదొడ్డి కట్టిస్తానని హామీ ఇస్తూ మామ బాండ్ పేపర్ మీద సంతకం చేయడంతో ఈ కథ సుఖాంతం అయిందని మహిళా పోలీస్ స్టేషన్ అధికారి జ్యోతి తెలిపారు.