సాక్షి, పట్నా : ఒక టాయిలెట్ నిర్మాణం నిధుల కోసం ప్రజలు చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులున్నాయి. అటువంటిది ఏకంగా 42 సార్లు టాయిలెట్ల నిర్మాణం పేరుతో నిధులు స్వాహా చేశాడో ప్రబుధ్దుడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది.
స్వచ్ఛభారత్ అభియాన్ ప్రాజెక్టులో భాగంగా మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. ఈ పథకాన్ని ఆసరాగా చేసుకుని.. బీహార్‌లోని హాజీపూర్ బ్లాక్ విష్ణుపురానికి చెందిన యోగేశ్వర్ చౌదరీ అనే వ్యక్తి భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు. కేవలం మరుగుదొడ్డి నిర్మాణం పేరుతో.. 2015 నుంచి 42 సార్లు నిధులు తెచ్చుకున్నాడు. అధికారిక అంచనాల మేరకు యోగేశ్వర్ చౌదరి.. 3,49,600 రూపాయలను ప్రభుత్వం నుంచి లబ్దిపొందాడు. ఇందుకోసం అతను ప్రతిసారి కొత్త గుర్తింపు కార్డులను, చిరునామా పత్రాలను, బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇందులో ఆశ్చర్యపోయే విషయమేమిటంటే.. ఆతను టాయిలెట్ల నిధులతో తన పాత ఇంటిని పూర్తిగా ఆధునీకరించుకున్నాడు. ఈ వ్యవహారం కాస్తా.. యోగేశ్వర్ అంటే గిట్టని కొందరు సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై స్పందించేందుకు యోగశ్వర్ నిరాకరించారు. ఇదిలావుండగా.. ఈ ఘటనపై వైశాలి డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ స్పందిస్తూ.. ఇది పాత వ్యవహరమని కొట్టి పారేశారు.
ఇదిలావుండగా.. యోగేశ్వర్‌ను ఆదర్శంగా తీసుకున్న విశ్వేశ్వర్ రామ్ మరో వ్యక్తి టాయిలెట్ నిర్మాణం పేరుతోనే.. 10 సార్లు అక్రమాలకు పాల్పడ్డాడు. ఇలా విశ్వేశ్వర్ రామ్.. 91 వేల రూపాయల నిధులను స్వాహా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment