
స్త్రీకి చీరే సురక్షితం
మహిళకి చీరే సురక్షితం అన్న ఈ మాట అన్నది మాములు నటి కాదు...ఇంకా చెప్పాలంటే, భారతీయ నారీయే కాదు.
మహిళకి చీరే సురక్షితం అన్న ఈ మాట అన్నది మాములు నటి కాదు...ఇంకా చెప్పాలంటే, భారతీయ నారీయే కాదు. ఆ బ్యూటీ యూకేకు చెందిన ఇంగ్లీషు భామ ఎమిజాక్సన్. అక్కడ మోడలింగ్ చేసుకుంటున్న ఈ అమ్మడు దర్శకుడు విజయ్ తెచ్చిన నటి. మదరాసు పట్నం చిత్రంలో ఇంగ్లీషు అమ్మాయిగా నటించిన ఈ విదేశీ భామకు కోలీవుడ్ ఆదరణ తొలి చిత్రంతోనే లభించింది.
ఆ తర్వాత ఐ వంటి భారీ చిత్రం ఏకంగా అందలం ఎక్కించేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌లోనే మకాం పెట్టిన ఎమిజాక్సన్ త్వరలో చెన్నైలో సెటిల్ అవుతానంటోంది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో ధనుష్‌తో జతకట్టనున్నారు. ఇప్పటికి తమిళ భాషను అర్థం చేసుకునే స్థాయికి తనను తయారు చేసుకున్న ఎమిజాక్సన్ మాట్లాడడం మాత్రం ఆంగ్లంలోనే. అయితే, ప్రత్యేకంగా ట్యూటర్‌ను నియమించుకుని తమిళం మీద పట్టు సాధించే పనిలో పడింది. త్వరలోనే తమిళభాషను మాట్లాడేస్తానన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నది.
ఎమి చాలా జాలీ టైప్ అని ఎవరు చెప్పారో తెలియదు గానీ, మగవాళ్లు ఎవ్వరు ఎదురైనా అన్న అని చిరునవ్వుతో పలకరించేస్తున్నది. ఈ సందర్భంగా ఈ ఇంగ్లీషు బ్యూటీ చెప్పే ఆసక్తికర విషయాలు ఆమె మాటల్లోనే. .. శంకర్ దర్శకత్వంలో ఐ చిత్రంలో నటించేటప్పుడు తమిళ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటించే అవకాశం వస్తుంది. అందువల్ల ఇకపై నా అభిమానులు, పాత్రికేయ మిత్రులను మోసం చేయడానికి మనసు అంగీకరించడం లేదు. త్వరలోనే తమిళ భాషలో మాట్లాడుతాను.
విదేశీ యువతినైనా...: ఎంత పాశ్చాత్య పోకడ కలిగిన యువతి అయినా, తమిళనాడులో సంప్రదాయ చీరలు ధరించి ఆలయాలకు వెళ్లే మహిళలను విస్మయంగా చూస్తు ఉంటాను. అంతే కాదు, అలా తాను పట్టు చీర ధరించాలని కోరిక ఉంది. ప్రస్తుతం ఉదయ నిధి సరసన నటిస్తున్న చిత్రంలో మడికట్టు చీర ధరించి నటించే అవకాశం వచ్చిందన్నారు. దీంతో నా కోరిక నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. దీంతో స్త్రీలకు చీరలే సురక్షితం అన్న భావన కలుగుతోంది.
మోడ్రన్ పాత్రలకే: నన్ను ప్రత్యక్షంగా చూసిన వారు ఎమి జాక్సన్ మోడ్రన్ పాత్రలకే పరిమితం అన్నట్టు అనుకుంటారు. అలాంటి వారి అభిప్రాయాలను తప్పు అని ఒక్కో చిత్రంలో నిరూపించుకుంటూ వస్తున్నాను. నటి అన్న తర్వాత అన్ని రకా ల పాత్రలు ధరించి, నటనా ప్రతిభను చాటుకోవాలని ఆశిస్తున్నాను. మదరాసు పట్నం, తాండవం, ఐ చిత్రాల్లో నా నటన వైవిధ్యంగా ఉంటుంది. అందువల్లే ఇంత తక్కువ కాలంలోనే కోలీవుడ్‌లో నాకంటూ అభిమానుల్ని సంపాదించుకోగలిగాను.
బాలీవుడ్ ఆశ ఫలించ లేదు : హిందీలో ఏక్ దీవానాత చిత్రంలో నటించాను. అది తమిళంలో మంచి విజయం సాధించిన విన్నైతాండి వరువాయా చిత్రానికి రీమేక్. ఈ చిత్రంతో బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశ పడ్డాను. అయితే, చిత్రం ప్లాప్ కావడంతో నా ఆశలు అడియాశలయ్యాయి. తెలుగులో ఎవడు చిత్రంలో నటించడం మంచి అనుభవం. ఇకపై తమిళ చిత్రాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాను. భవిష్యత్తులో చెన్నైలో సెటిల్ అవుతాను. అయితే, వెంటనే తమిళనాడు కోడలు అవుతారా? అని అడగకండి. ఎవరి తల రాత ఎలా రాసి ఉంటుందో, ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాలం నిర్ణయించిన బాటలోనే పయనించాలని అనుకుంటున్నాను. విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది. ముగిసిన ప్రేమ వ్యవహారాన్ని గుర్తు చేసుకోదలచుకోలేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా నటన మీదే. ప్రేమ కథా పాత్రల్లోనే కాకుండా యాక్షన్ హీరోయిన్‌గా కూడా నటించాలని కోరుకుంటున్నాను. అలాంటి మంచి పాత్రతో ఎవరు ముందుకు వస్తే ఆ చిత్రానికి నా పారితోషికం విషయంలో కొంత తగ్గింపు ఉంటుందని ఈ భామ అంటోంది.