కంగనాకు మహిళా కమిషన్ షాక్
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు.
సాక్షి, న్యూఢిల్లీః బాలీవుడ్ భామ కంగనా రనౌత్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు. హృతిక్ వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు తాను ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో మహిళా కమిషన్ తనకు వెన్నంటి నిలవలేదని ఆరోపణలు గుప్పించిన కంగనాకు ఊహించని పరిణామం ఎదురైంది. ముఖ్యంగా మహిళా కమిషన్‌కు చెందిన గుర్మీత్ చద్దా తనకు సాయం చేయలేదని, సరైన సమయంలో తనకు అండగా నిలవకపోవడం అన్యాయమని కంగనా పేర్కొంది. అయితే మహిళా కమిషన్‌లో గుర్మీత్ పేరుతో ఎవరూ లేరని మహారాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ విజయ రహత్కర్ స్పష్టం చేశారు. కంగనా రనౌత్ చేసిన ఆరోపణలన్నింటినీ ఆమె విస్పష్టంగా తోసిపుచ్చారు.
కంగనా ఎన్నడూ మహిళా కమిషన్‌ను ఆశ్రయించలేదని రహత్కర్ ట్వీట్ చేశారు. మహిళా కమిషన్‌పై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.ఆపదలో ఉన్న మహిళలకు మద్దతుగా నిలవడంలో మహారాష్ట్ర మహిళా కమిషన్ ముందుంటుందని స్పష్టం చేశారు. అయితే కంగనా సోదరి రంగోలి చందేల్ దీనిపై స్పందించారు. రహత్కర్ చాలా ఆలస్యంగా స్పందించారని, గుర్మీత్ మహిళా కాంగ్రెస ఉపాధ్యక్షురాలని, మహిళా కమిషన్‌తోనూ తనకు సంబంధం ఉందని ఆమె చెప్పారని చందేల్ ట్వీట్ చేశారు.