కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ( ఫైల్ ఫోటో)
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప యూటర్న్ తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్ట నిరసన సందర్భంగాజరిగిన పోలీసుల కాల్పుల్లో మరణించిన వారి బంధువులకు ప్రకటించిన 10 లక్షల రూపాయల పరిహారం చెల్లింపు విషయంలో వెనక్కి తగ్గారు. బుధవారం మంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ, హింసాత్మక సంఘటనలపై దర్యాప్తు జరిపి, బాధితులు నిర్దోషులు అని తేలేవరకు పరిహారం చెల్లించలేమని సీఎం స్పష్టం చేశారు.
మంగళూరు నార్త్ (బందరు) హింస ముందస్తు కుట్రగా పేర్కొన్న ముఖ్యమంత్రి హింసకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సీఐడితో పాటు మెజిస్టీరియల్ విచారణ జరుగుతోందన్నారు. వాస్తవాల ఆధారంగా హింసకు ప్రత్యక్షంగా పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయమని పోలీసులను నిర్దేశిస్తానని, ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని యడ్యూరప్ప తెలిపారు.
కాగా పౌరసత్వం (సవరణ) చట్టం, ప్రతిపాదిత జాతీయ పౌరుల రిజిస్టర్‌కు వ్యతిరేకంగా గత వారం జరిగిన నిరసన పోలీసు కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో నౌసిన్ (23), జలీల్ కుద్రోలి (49) చనిపోయారు. అసలు ఈ ఇద్దరూ ఆందోళనలో పాల్గొనలేదని, వారి బంధువులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం వీరిని నిందితులుగా చేర్చారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ఇద్దరు బంధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment