యోగాను ప్రజా ఉద్యమంగా మార్చేందుకు నడుంబిగించాలని ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులకు, అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులకు సూచించారు.
కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన
న్యూఢిల్లీ: యోగాను ప్రజా ఉద్యమంగా మార్చేందుకు నడుంబిగించాలని ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులకు, అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులకు సూచించారు. ప్రజా ఉద్యమంగా మలచడం ద్వారా ప్రజల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు యోగా దోహదం చేస్తుందన్నారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాను ప్రజా ఉద్యమంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కేబినెట్ మంత్రులందరికీ లేఖలు రాశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక కార్యక్రమం కాదని, యోగాను మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా చేసేందుకు యోగా దినోత్సవం ఒక మార్గమని పేర్కొన్నారు. ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా సామాజిక వర్గాలకు అతీతంగా, వివిధ వయసుల వారికి అనువుగా యోగాకు ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 21న చండీగఢ్‌లో దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.