
ముంబై : దేశీయ కార్పొరేట్ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్ యోగేశ్ చందర్ దేవేశ్వర్(72) శనివారం ఉదయం కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవేశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దేవేశ్వర్ మృతిపట్ల ఐటీసీ కంపెనీ ఉద్యోగులు సంతాపం ప్రకటించారు. భారతీయ కార్పొరేట్ చరిత్రలో సుదీర్ఘకాలం ఒక దిగ్గజ కంపెనీకి ఛైర్మన్‌గా కొనసాగిన అతికొద్ది మందిలో దేవేశ్వర్ ఒకరు.
1968లో ఐటీసీలో చేరిన దేవేశ్వర్ అంచెలంచెలుగా ఎదుగుతూ 1996లో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవిని అలంకరించారు. ఫిబ్రవరి 5, 2012న మరోసారి డైరెక్టర్‌గా, ఛైర్మన్‌గా దేవేశ్వర్ ఎన్నికై 2017 వరకు కొనసాగారు. 2017 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా దేవేశ్వర్ కొనసాగుతున్నారు. 2011లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.