
సాక్షి, న్యూ ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి హాజరై.. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగనున్న ఈ పార్లమెంట్ చివరి శీతాకాల సమావేశాల్లోనైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఈ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..
తిత్లీ బాధితులకు ప్రత్యేక సాయం అందించాలి
‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి కోరాం. జగన్‌పై హత్యాయత్నం కేసులో కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని కోరినా కేంద్ర ప్రభుత్వం స్పందిచకపోవడాన్ని ప్రశ్నించాం. తిత్లీ తుపానులో నష్టపోయిన ఉత్తరాంధ్రకు ప్రత్యేక సాయం చేయాలని విజ్ఞప్తి చేశాం. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో ఇచ్చిన హామీలైన చెన్నై, విశాఖ కారిడర్, దుగ్గరాజు పట్నం పోర్టు ఏర్పాటు, ఇతర హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశాం. పాకిస్తాన్ చెరలో ఉన్న 22 మంది జాలరులను విడిపించే ప్రయత్నం చేయాలని కోరాం. రాష్ట్రంలోని 11 కరువు జిల్లాలకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. రెండు వేరువేరు ప్రాంతాల్లో ఓటు వేయడాన్ని నేరంగా పరిగణించేలా చర్యలు తీసుకోవాలి, అవసరమైతే ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని సూచించాం.
మాది ఎప్పుడూ ప్రజల పక్షమే
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి రాజ్యాంగ సంస్థలను టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటున్నా కేంద్రం చూస్తూ కూర్చుంటోంది. సాగు భూములను సైతం సేకరించే విధంగా భూసేకరణ చట్టానికి ఏపీ ప్రభుత్వం సవరణలు తెచ్చింది దీనిపై కేంద్రం ఎందుకు స్పందిచటం లేదని అడిగాం. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగ వ్యవస్థను బ్రష్టుపట్టించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నా ఆయన పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించాం. ‘ఓటుకు నోటు కేసు’లో ఆడియో టేప్‌లో ఉన్నది చంద్రబాబు గొంతేనని కేంద్ర ప్రభుత్వ సంస్థ ధృవీకరించినా ఎందుకు చర్యలు తీసుకోవటంలేదని ప్రశ్నించాం. విపక్షాల మీటింగ్‌లో పాల్గొనాల్సిందిగా మాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. విపక్షంగా చంద్రబాబు ఇచ్చేగుర్తింపు మాకు అక్కర్లేదు. చంద్రబాబులా రంగులు మార్చే అవసరం మాకు లేదు. అధికారంలో నాలుగేళ్లు కొనసాగారు. ఇప్పుడు చంద్రబాబు రంగు మార్చి ప్రతిపక్షంలో ఉన్నానని చెప్పుకుంటున్నారు. మాది ఎప్పుడూ ప్రజల పక్షమే’ అంటూ విజయసాయిరెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment