
సీబీఐ కీలుబొమ్మగా మారుతోంది: మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ నియామకంలో సవరణ బిల్లుకు వైఎస్ఆర్ సీపీ మద్దతు ఇస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో స్పష్టం చేశారు. సీబీఐ డైరెక్టర్ నియాయకంలో సవరణలపై చర్చ సందర్బంగా ఆయన బుధవారం లోక్సభలో మాట్లాడుతూ అధికార పార్టీ చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారుతోందన్నారు.
రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడానికే సీబీఐని వాడుకుంటున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు. తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి విషయంలో కూడా సీబీఐని ఇలాగే ఉపయోగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అధికారిక హోదాలో లేకపోయినా వైఎస్ జగన్పై కేసులు మోపారని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
ఓవైపు సిబ్బంది లేరంటూనే...మరోవైపు వైఎస్ జగన్ విషయంలో 22 సీబీఐ బృందాలులు పని చేశాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే మరో కేసులో విచారణ చేపట్టేందుకు తమకు తగినంతగా సిబ్బంది లేరని సీబీఐ...న్యాయస్థానానికి చెప్పిందన్నారు. ఎలాంటి వివక్షకు తావివ్వకుండా సీబీఐ పనిచేయాలని... అందుకనే సీబీఐకి స్వతంత్రత ఉండాలని మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు.