జడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా చాలదట!
అక్కడ ఒకే కుటుంబంలో ముగ్గురికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. అయినా అది సరిపోదని, తమకు మరింత భద్రత కావాలని అంటున్నారు. పంజాబ్‌లోని అకాలీదళ్ ప్రభుత్వం ఈ తరహా వింత కోరికలతో కేంద్ర ప్రభుత్వానికి సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే అక్కడ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కొడుకు, ఉప ముఖ్యమంత్రి అయిన సుఖ్‌బీర్ బాదల్, మంత్రివర్గంలో కీలక సభ్యుడు బిక్రమ్ సింగ్ మజీతియా.. ఈ ముగ్గురికీ ఇప్పటికే జడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉంది. వీళ్లలో మజీతియా.. ఉపముఖ్యమంత్రికి బావమరిది.
భద్రత పెంచాలంటూ గత వారమే అభ్యర్థన వచ్చిందని, అయితే.. దేశంలో అత్యున్నత స్థాయి భద్రత అయిన జడ్ ప్లస్ తర్వాత ఇంక ఏమివ్వాలో అర్థం కావడం లేదని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వర్గాలు చెబుతున్నాయి. 88 ఏళ్ల ముఖ్యమంత్రికి నేషనల్ సెక్యూరిటీ గార్డులు భద్రత ల్పిస్తారు. ఆయన కొడుకును, అతడి బావమరిదిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది రోజుకు 24 గంటలూ కంటికి రెప్పలా కాపాడుతుంటారు. జడ్ ప్లస్ భద్రత కింద దాదాపు 30-40 మంది కేంద్ర భద్రతా సిబ్బంది, రెండు ఎస్కార్ట్ వాహనాలు ఇస్తారు.
ముఖ్యమంత్రి కుటుంబీకులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని, అందులోనూ ఇటీవలే రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ నాయకుడి మీద దాడి జరిగిన నేపథ్యంలో భద్రతను పెంచాలని అకాలీదళ్ వర్గాలు అంటున్నాయి. పంజాబ్ ఆర్ఎస్ఎస్ డిప్యూటీ చీఫ్, రిటైర్డ్ బ్రిగెడియర్ జగదీష్ గగ్నేజాపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు.