చికాగో : చికాగో ఆంధ్రా అసోసియేషన్(సీఏఏ) ఆధ్వర్యంలో వేసవి వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. రుచికరమైన తెలుగు వంటకాలతో ఆట పాటలతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి మేలిసి ఈ వనభోజన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చికాగోలో శాంబర్గ్ లోని బస్సే పార్క్‌లో ఉదయం 11 గంటల నుంచి, సాయంత్రం 6 వరకు జరిగిన ఈ వనభోజనాల్లో తెలుగు వారందరు ఆత్మీయంగా కలుసుకొని విందు భోజనాలని ఆరగించారు. డా. ఉమ కటికి అధ్యక్షతన చికాగో ఆంధ్రా సంఘం వారు, వారి సాంప్రదాయాన్ని కొనసాగిస్తు, ఈ ఏడాది కూడా అరిటాకులలో వడ్డించడం అందరిని ఆకట్టుకుంది.
చికాగోలోని తమ పిల్లలతో గడపాలని ఆంధ్ర నుంచి వచ్చిన తల్లిదండ్రులు సీఏఏ వారి ఆత్మీయతకి అబ్బురపడ్డారు. ఆంధ్రాలోనే బఫెట్ పద్ధతికి అలవాటు పడుతున్న రోజుల్లో అగ్ర రాజ్యంలో సీఏఏ వారి కృషి అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.ఆంధ్రా రుచులైన పులిహోరతో పాటు ఊరగాయ, ముక్కల పులుసు, బెండకాయ వేపుడు, పెరుగువడలు వడ్డించారు. రుచికరమైన పెరుగువడ కోసం ఆంధ్ర అయినా వెళ్లాలి లేదా చికాగో ఆంధ్ర సంఘం వన భోజనాలకి రావాలి అని ఫుడ్ కమిటీ చైర్ సాయి రవి సూరిభోట్ల అనడంతో నవ్వుల పూయించింది.
500 మందికిపైగా అతిథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎలా చేయాలి అన్న అంశంపై సీఏఏ కార్యదర్శి డా. భార్గవి నెట్టం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పిల్లలకి పెద్దలకి ఆటలని నిర్వహించారు. తండ్రులతో కలిసి పిల్లలు ఆడిన మూడు కాళ్ల పరుగు అందరిని ఆకట్టుకుంది. ఫాధర్స్ డేను పురస్కరించుకొని చివర్లో కేక్ కట్ చెయ్యడంతో పాటు వేసవి తాకిడిని ఎదుర్కోడానికి రోజంతా మజ్జిగ, పుచ్చకాయ ముక్కల్ని అందుబాటులో ఉంచారు.
ఈ కార్యక్రమంలో సీఏఏ అధ్యక్షురాలు డా. ఉమ కటికి, ఉపాధ్యక్షులు పద్మారావు అప్పలనేని, కార్యదర్శి భార్గవి నెట్టం, ఫౌండర్స్ ఛైర్మన్ దినకర్ కారుమురితో పాటు గత ఫౌండర్స్ సభ్యులు సుందర్ దిట్టకవి, శ్రీనివాస్ పెదమల్లు, రాఘవ జట్ల, రమేష్ గారపాటి సహా బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరిలో అధ్యక్షురాలు ఉమ కటికి మాట్లాడుతూ ఈ వనభోజనాలని జయప్రదం చేసిన అతిథులు, బోర్డు సభ్యులు, వాలంటీర్లకి ధన్యవాదాలు తెలిపారు. చికాగో వాసులని అలరించటానికి ఈ సంవత్సరం సీఏఏ ఇలాంటి మరెన్నో కార్యక్రమలని నిర్వహించబోతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment