
అట్లాంటా : అట్లాంటా తెలుగు సంఘం 'తామా' ఆధ్వర్యంలో భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిడిల్ స్కూల్లో నిర్వహించిన ఈ వేడుకలకు సుమారు 300 మంది బాలబాలికలు, 200 మంది పెద్దలు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా తామా అధ్యక్షులు వెంకీ గద్దె స్వాగతోపన్యాసం చేస్తూ గణతంత్ర దినోత్సవ ప్రాశస్త్యం గురించి వివరించారు. సిలికానాంధ్ర మనబడి ప్రతినిధి విజయ్ రావిళ్ల, తామా చైర్మన్ వినయ్ మద్దినేనిలు ఉపాధ్యాయులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ వంటి దేశభక్తి గీతాలను శ్రద్ధగా ఆలపించారు. తదనంతరం విజయ్ రావిళ్ల జెండా వందనం చేయగా, అందరూ జాతీయగీతం ఆలపించి భారతావనిపై తమకున్న గౌరవాన్ని తెలియజెప్పారు.
వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం కంటే అత్యధికంగా 500 మందికి పైగా పాల్గొనడం విశేషం అంటూ అక్కడికి విచ్చేసిన అందరూ తామా కార్యవర్గాన్ని కొనియాడారు. ఇంతమంది తెలుగు వారు ఇలా మన జాతీయ పండుగను చేసుకోవటం హర్షణీయం అని ప్రశంసించారు. ఈ కార్యక్రమం భారత దేశంలో చిన్నప్పుడు తమ స్కూళ్లలో జరిగినట్లు ఉందని, ఆ రోజులను తామా వారు తమకు గుర్తుచేసినందుకు, తమ పిల్లలు ఇందులో భాగం కావటం పట్ల చాలా మంది పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పిల్లలకు గుడీ బ్యాగ్స్, పెద్దలకు స్నాక్స్ అందించారు. చివరిగా స్నాక్స్ స్పాన్సర్ చేసిన అట్లాంటా ఫుడ్ డిస్ట్రిబ్యూటర్స్, వేడుకల నిర్వహణలో సహకరించిన తోటి తామా కార్యవర్గ సభ్యులు, బోర్డు సభ్యులు, మనబడి సమన్వయకర్తలు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరికీ తామా అధ్యక్షులు వెంకీ గద్దె కృతజ్ఞతలు తెలిపారు.



Comments
Please login to add a commentAdd a comment