ఇరాక్‌లో అకామా కష్టాలు | Telangana Workers Suffering in Iraq | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో అకామా కష్టాలు

Published Fri, Dec 27 2019 12:20 PM | Last Updated on Fri, Dec 27 2019 12:20 PM

Telangana Workers Suffering in Iraq  - Sakshi

ఇరాక్‌లో అకామా రెన్యూవల్‌కు నోచుకోని కార్మికులు

ఎన్‌.చంద్రశేఖర్, మోర్తాడ్‌(నిజామాబాద్‌ జిల్లా) డాలర్ల రూపంలో వచ్చే వేతనాలతో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవచ్చనే ఆశతో ఇరాక్‌ బాట పట్టిన వలస కార్మికులకు నిరాశే మిగిలింది. ఇరాక్‌లోని వివిధ ప్రాంతాల్లో పనిచేసుకోవడానికి వలస కార్మికులకు గతంలో జారీచేసిన రెసిడెన్స్‌ కార్డు(అకామా)లను అక్కడి ప్రభుత్వం కొన్ని రోజులుగా రెన్యూవల్‌ చేయడం లేదు. అకామా గడువు తీరిన వారికి తిరిగి కొత్తవి ఇవ్వడం లేదు. అకామా లేకపోవడంతో కంపెనీలు కూడా పనులలో పెట్టుకోవడం లేదు. అకామా లేకుండా ఆ దేశంలో నివసిస్తే అక్కడి చట్టం ప్రకారం జైలుశిక్ష పడుతుంది. అంతేకాక భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పనిచేయడానికి అవకాశం లేక.. ఇంటికి వెళ్లడానికి మార్గం లేక కార్మికులు దయనీయ స్థితిలో ఉన్నారు.

కుంభకోణం జరిగిందని..
ఇరాక్‌కు విజిట్‌ వీసాలపై వచ్చిన వారు పనిచేసుకోవడానికి అక్కడి ప్రభుత్వంఅకామాలను పెద్ద ఎత్తున జారీచేసింది. ఒక ఏడాది పాటు పనిచేయడానికి అకామాలను జారీచేసిన ఇరాక్‌ ప్రభుత్వం.. అకామా గడువు ముగిసిన తరువాత రెన్యూవల్‌ చేసుకోవాలని సూచించింది. రెన్యూవల్‌కు 400 డాలర్లనుంచి 500 డాలర్లు అంటే.. మన కరెన్సీలో రూ.30వేల వరకు చెల్లించాలి. అయితే, అకామా రెన్యూవల్‌ విషయంలో కుంభకోణం జరిగినట్లు ఇరాక్‌ ప్రభుత్వం గుర్తించింది. ఏజెన్సీలు ప్రభుత్వాన్ని మోసగించి భారీ మొత్తంలో నిధులను పక్కదారి పట్టించినట్లు వెల్లడైంది. కొన్ని ఏజెన్సీలు నకిలీ అకామాలను సృష్టించినట్లు వెలుగుచూడడంతో అక్కడి ప్రభుత్వం వ్యక్తిగత అకామాల రెన్యూవల్‌ నిలిపివేసింది. 

తెలంగాణ కార్మికులు 10వేల మందిఇరాక్‌లోని ఎర్బిల్, సులేమినియా,కిర్‌కుక్‌ తదితర పట్టణాల్లోని టూరిజంప్రాంతాలు, హోటల్స్, షాపింగ్‌ మాల్స్, పరిశ్రమల్లో పనిచేయడానికి మన రాష్ట్రానికిచెందిన కార్మికులు వలస వెళ్లారు. ఆ దేశంలో తెలంగాణ కార్మికులు ప్రస్తుతం సుమారు 10వేల మంది ఉన్నట్టు అంచనా. ఇందులో కేవలం 20 శాతం మంది కార్మికులకే వర్క్‌ పర్మిట్, పర్మినెంట్‌ అకామాలు ఉన్నాయి.
తాత్కాలిక, వ్యక్తిగత అకామాల రెన్యూవల్‌ను ఇరాక్‌ ప్రభుత్వం నిలిపివేయడంతో 80 శాతం మంది కార్మికులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. స్వదేశానికి రావాలనుకునే కార్మికులు అక్కడి ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అకామా లేకుండా  చట్టవిరుద్ధంగా ఉన్నందుకు రోజుకు 20 డాలర్ల చొప్పున జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. అకామా రెన్యూవల్‌ నిలిచిపోయిన నాటి నుంచి ఎన్ని రోజులు ఆ దేశంలో ఉంటే అన్ని రోజులకు జరిమానా చెల్లించాలి. ఉపాధి కోసం వెళ్లిన తాము పనిలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితిలో భారీ మొత్తంలో జరిమానా ఎలా చెల్లించాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారత కాన్సులేట్‌లో దరఖాస్తు
అకామాలు లేకపోవడంతో కార్మికులు రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం 15 మంది తెలంగాణ కార్మికులు ఇంటికి రావడానికి సహకారం అందించాలని ఎర్బిల్‌లోని భారత కాన్సులేట్‌లో దరఖాస్తు పెట్టుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన బట్టు గంగాధర్‌ (సాహెబ్‌పేట్‌), భూమేష్‌ సాకలి (రెంజర్ల), ప్రేమ్‌చంద్‌ (వేల్పూర్‌), ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సత్తయ్య అంకతి (వెంకట్రావ్‌పేట్‌), గోపాల్‌ దురూరి (ఉదుంపూర్‌), చిన్న నర్సయ్య చిట్యాల (బట్టాపూర్‌), జగిత్యాల జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ పల్లేరియా (ధర్మాజిపేట్‌), ప్రశాంత్‌ మామిడిపెల్లి (లింగంపేట్‌), వెంకటేష్‌ సిరికొండ( లింగంపేట్‌), రమేష్‌ రేగుల (చెందోలి), అనిల్‌ ఉప్పరి (సర్వాపూర్‌), శ్రీనివాస్‌ కల్లా (లొత్నూర్‌), శ్రీనివాస్‌ భైరవేణి (లొత్నూర్‌), మంచిర్యాల జిల్లాకు చెందిన చంద్రయ్య దుర్గం (ధర్మారం), దివాన్‌ పసి (గోరక్‌పూర్‌ శివపూర్‌) వీరంతా నాలుగైదేళ్ల కింద ఇరాక్‌కు ఉపాధి కోసం వలస వెళ్లారు. అక్కడ అకామా రెన్యూవల్‌ కాకపోవడంతో ఇంటికి చేరడానికి మన విదేశాంగ శాఖ సహాయాన్ని అభ్యర్థిస్తున్నారు. అయితే, విదేశాంగ శాఖ అధికారుల నుంచి స్పందన లేదనే కార్మికులు అంటున్నారు.  

ఆ ఐదు ప్రాంతాలు మినహా.. ఇరాక్‌లోని మిగతా పట్టణాలకు వెళ్లవచ్చుఇరాక్‌లో ఉపాధి కోసం కార్మికులు వలస వెళ్లడానికి మొదట్లో మనదేశం ఎమిగ్రేషన్‌ సౌకర్యం కల్పించింది. అయితే, 2014లోఇరాక్‌లో టెర్రరిస్టులు మన దేశానికి చెందిన 39 మంది కార్మికులను హతమార్చారు.దీంతో భద్రతా కారణాల రీత్యా  భారతీయులు ఇరాక్‌ వెళ్లడాన్ని (ఎమిగ్రేషన్‌) నిషేధిస్తూ   2014 జులై 17న కేంద్ర ప్రభుత్వం
ఉత్తర్వులు జారీచేసింది. ఇరాక్‌లో పరిస్థితులు  అదుపులోకి  వచ్చాయని  అందిన  సమాచారం మేరకు తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు ప్రాంతాలు నిన్‌వేహ్‌ (మొసుల్‌), సలాహుద్దీన్‌ (టిక్రిత్‌), దియాల (బఖూబా), అంబర్‌ (రమాది), కిర్‌కుక్‌ లను మినహాయించి  మిగతా ప్రాంతాలకు ఎమిగ్రేషన్‌ అనుమతినిస్తూ భారత ప్రభుత్వం 2019 అక్టోబర్‌ 1న ఉత్తర్వులను జారీచేసింది.

ఇరాక్‌ నుంచి రప్పించాలి..
నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం సాహేబ్‌పేట్‌కు చెందిన బట్టు గంగాధర్‌ నాలుగేళ్ల కింద ఇరాక్‌కు వెళ్లాడని ఆయన తల్లి రుక్మాబాయి, భార్య సుజాత చెప్పారు. అకామా రెన్యూవల్‌ కాకపోడంతో గంగాధర్‌ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నట్లు వారు వివరించారు. తమతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని, కొన్ని నెలల నుంచి పనిలేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వా లేదని ఆవేదన వ్యక్తం చేశాడని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని గంగాధర్‌తో పాటు ఇతర కార్మికులను స్వదేశానికి రప్పించాలని వారు కోరుతున్నారు.

వర్క్‌ వీసా ద్వారానే వెళ్లాలి..
ఇరాక్‌కు వర్క్‌ వీసాపైనే వెళ్లాలి. విజిట్‌ వీసాపై అక్రమ మార్గంలో వెళ్లిన వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా ఐదేళ్ల పాటు ఇరాక్‌లో పనిచేశాను. అప్పట్లో విజిట్‌ వీసాపై వెళ్లినా కంపెనీ అకామా పొందడం వల్ల నాకు ఇబ్బంది కలగలేదు. కానీ, ఇప్పుడు వెళ్లే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విజిట్‌ వీసాపై వెళ్లవద్దు. అలాగే ఇరాక్‌లో ఉండిపోయిన కార్మికులను మన ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఇంటికి రప్పించాలి.  – మాటేటి కొమురయ్య,గల్ఫ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement