ఇరాక్‌లోని ఎర్బిల్ ప్రాంతం
సాక్షి, నెట్‌వర్క్:ఇరాక్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో వలస కార్మికుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాక్‌లోని పలు ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన సుమారు పది వేల మంది కార్మికులు ఉన్నట్లు అంచనా. వారంతా వివిధ రంగాల్లో పనులు చేస్తున్నారు. బాగ్దాద్ పట్టణానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళనచెందుతున్నారు. అయితే, తాము భద్రంగానే ఉన్నామంటూ పలువురు కార్మికులు తమ వారికి ఫోన్‌చేసి సమాచారమిస్తున్నారు. మాచారెడ్డి మండలానికి చెందిన గోపి ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము బాగ్దాద్‌కు కొంత దూరంలో ఉన్నామని, ఇటువైపు ఎలాంటి గొడవలు లేనప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన అయితే ఉందని తెలిపాడు. తాము జాగ్రత్తలు తీసుకుంటున్నామని పలువురు వలస కార్మికులు వివరించారు. ఇరాక్‌లో నెలకొన్న అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన విదేశాంగ శాఖ కూడా వలస కార్మికుల రక్షణకు పలు సూచనలు చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, క్యాంపుల్లోనే ఉండాలని విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు చెప్పినట్లు కార్మికులు వెల్లడించారు. అకామా(గుర్తింపుకార్డులు) లేని కార్మికులు స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉండగా.. శాంతియుత వాతావరణం నెలకొన్న తరువాతనే ఇరాక్ విడిచి ఇంటికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవాలని కూడా విదేశాంగ శాఖ సూచించింది.
బాంబు దాడులకు తోడువర్షం జోరు...
ఇరాక్‌లో బాంబుదాడులు కొనసాగుతుండటమే కాకుండా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కార్మికులు క్యాంపులను విడిచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల నుంచి ఇరాక్‌లో వర్షాలు కురుస్తున్నాయి. వర్క్ వీసా ఉన్నవారు మాత్రమే కష్టపడి తమ కంపెనీలకు వెళ్లి పనులు చేసుకుని క్యాంపులకు చేరుకుంటున్నారు.
ఎర్బిల్‌లో మన వారి సంఖ్య ఎక్కువ..
ఇరాక్‌లోని ఎర్బిల్‌లో మన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎర్బిల్ పర్యాటక ప్రాంతం కావడంతో ఇరాక్‌కు ఉపాధి కోసం వెళ్లిన వారు ఈ ప్రాంతంలోని హోటళ్లు, మాల్స్ ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు. సుమారు ఐదు వేల మంది తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులుఉంటారని స్వచ్చంద సంస్థల ద్వారా తెలుస్తోంది. ఇతర ప్రాంతాల్లో మన రాష్ట్రానికి చెందిన వారు తక్కువ సంఖ్యలో ఉన్నారు.
ఇరాక్‌కు వెళ్లడానికిమరోసారి నిషేధం..
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి ఇరాక్ కేంద్రబిందువు కావడంతో మన దేశస్తులు అక్కడకు వలస వెళ్లకుండా మన విదేశాంగ శాఖ మరోసారి నిషేధం విధించింది. ఇరాక్‌కు వలస వెళ్లే కార్మికుల ఎమిగ్రేషన్ క్లియరెన్స్‌ను నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొంది. 2014లో ఇరాక్‌లోని ఉగ్రమూకలు మన దేశానికి చెందిన 39 మంది వలసదారులను బందీలుగా చేసుకుని హతమార్చారు. దీంతో ఇరాక్‌కు వలస వెళ్లడాన్ని నిషేధిస్తూ 2014 జూలై 17న భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇరాక్‌లో శాంతియుత వాతావరణం నెలకొన్నట్లు గుర్తించిన మన ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ 2019 సెప్టెంబర్ 16న నిర్ణయం తీసుకుంది. ఇదే సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ఇరాక్‌లోని ఐదు ప్రాంతాలను మినహాయించి ఇతర పట్టణాల్లో ఉపాధి కోసం వలస వెళ్లడానికి ఎమిగ్రేషన్ అనుమతి ఇచ్చింది. నిన్‌వేహ్, సలాహుద్దీన్, దియాల, అంబర్, కిర్‌కుక్ ప్రాంతాలకు ఎమిగ్రేషన్ అనుమతి లేదు. ఈ ప్రాంతాలను మినహాయించి ఇతర పట్టణాలకు వెళ్లేందుకు ఎమిగ్రేషన్ అనుమతి ఉండగా.. ఇప్పుడు మొత్తంగా నిషేధం అమలులోకి వచ్చింది.
జాగ్రత్తగానే ఉంటున్నాం..
ఇరాక్‌లో ఉన్న వలస కార్మికులమంతా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తెలంగాణ గల్ఫ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు తగిన సూచనలు చేశాం. ఇక్కడ కొంత ఉద్రిక్తత ఉన్నా.. ప్రమాదం ఏమీలేదు. వలసదారుల కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శాంతియుత వాతావరణం నెలకొంటే బాగుంటుంది. బాంబుదాడులు, వర్షం వల్ల అనేక మంది కార్మికులు క్యాంపుల్లోనే ఉంటున్నారు. – రాయల్వర్ రాంచందర్, ఉపాధ్యక్షుడు, టీజీఈడబ్ల్యూఏ
అమ్మా.. బాగానే ఉన్నాం...
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికిచెందిన మెరుగు శ్రీను ఇరాక్‌లోని ఎర్బిల్ ప్రాంతంలోఉంటున్నాడు. తాను బాగానే ఉన్నానని, దాడులు తాముఉంటున్న ప్రాంతానికి చాలా దూరంలో జరుగుతున్నాయని, తమకు ఇబ్బంది ఏమీలేదని తన తల్లికి ఫోన్‌చేసి చెప్పాడు. తాను క్షేమంగానే ఉన్నానని, బెంగపెట్టుకోవద్దన్నాడు.
బాంబుల శబ్ధం వచ్చింది : కుర్మ శ్రీనివాస్
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికిచెందిన నేను ఇరాక్‌లోని అంకామ ప్రాంతంలో ఉంటున్నా. రాత్రిపూట ఒక్కసారిగా బాంబుల శబ్దం వచ్చింది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బాంబులు పడ్డట్లు ఇక్కడి వారు తెలిపారు. ఇరాన్ దేశం ఇక్కడి అమెరికా సైన్యంపై దాడులు చేసినట్లు చెబుతున్నారు. బాంబుల శబ్ధం విన్నాక అందరం గదిలోకి వెళ్లాం. భయంతో బయటకు రాలేదు. మాకు ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదు.
Comments
Please login to add a commentAdd a comment