టెక్సాస్‌లో కారు ప్రమాదం : ముగ్గురు తెలుగువారు మృతి | Three NRIS Killed In Road Accident At Texas | Sakshi
Sakshi News home page

టెక్సాస్‌లో కారు ప్రమాదం : ముగ్గురు తెలుగువారు మృతి

Published Tue, Feb 25 2020 12:54 AM | Last Updated on Tue, Feb 25 2020 8:16 PM

Three NRIS Killed In Road Accident At Texas - Sakshi

టెక్సాస్‌: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు దుర్మరణం పాలయ్యారు.  భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున డెల్ వెబ్ బోల్వార్డ్, ఇంటర్ సెక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు ఫ్రిస్కో పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారి వద్ద లభించిన ఆధారాల మేరకు చనిపోయిన వారు దివ్య ఆవుల (34), ఆమె భర్త రాజా గవిని (41) మరణించారు. వారితో పాటే ప్రయాణిస్తున్న వారి స్నేహితుడు ప్రేమనాథ్ రామనాథం (42) కూడా స్పాట్‌లోనే మృత్యువాతపడ్డారు.

దివ్య దంపతులు 8 ఏళ్ల తమ కుమార్తెను డ్యాన్స్ క్లాసు కోసం తీసుకెళ్లారు. అమ్మాయిని డ్యాన్స్‌ నేర్పుతున్న టీచర్‌ వద్ద దింపి అక్కడి నుంచి తిరిగి వారు ఫ్రిస్కోలోని ఫిలిప్ క్రీక్ రంచ్‌లో కొత్తగా కొనుగోలు చేసిన ఇంటికి చూడటానికి బయలుదేరారు. డెల్ వెబ్ బోల్వార్డ్ జంక్షన్ వద్దకు రాగానే ట్రాఫిక్ సిగ్నల్ చూసుకుంటూ కారును మలుపుతిప్పుతున్న దశలో ఎదురుగా వేగంగా వచ్చిన మరోకారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఫ్రిస్కో పోలీసులు వెల్లడించారు. అయితే ఎదురుగా వస్తున్న కారును మైనారిటీ కూడా తీరని బాలుడు డ్రైవ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఆ బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సనాంటానియోలో ఉంటున్న దివ్య కుటుంబం ఉద్యోగ రీత్యా ఏడాది కిందటే ఫ్రిస్కోకు మారారు. వీరు హైదరాబాద్ గాంధీనగర్ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్‌లోని వారి కుటుంబంలో తీవ్ర విశాదం నెలకొంది.

దివ్య, రాజాలతో పాటు కారులో ప్రయాణిస్తున్న ప్రేమ్‌నాథ్ (స్నేహితులంతా ప్రేమ్ అని పిలుస్తుంటారు) వారికి ఎప్పటి నుంచి పరిచయం, ఆ కారులో ఎందుకు వెళ్లారన్న వివరాలేవీ తెలియరాలేదు. ఇటీవలి కాలంలో కూడళ్ల వద్ద మరీ ముఖ్యంగా జంక్షన్ల వద్ద ప్రమాదాలు బాగా పెరిగినట్టు అక్కడి వివరాలను బట్టి తెలుస్తోంది. పైపెచ్చు మైనారిటీ తీరనివారు నిర్లక్ష్యపు డ్రైవింగ్ అనేక కుటుంబాలను బలితీసుకుంటుందని అక్కడ నివసిస్తున్న తెలుగువారు చెబుతున్నారు. ఇలావుండగా ప్రేమ్‌నాథ్ కోసం మిత్రులు గోఫండ్ మి ద్వారా కొంత డబ్బును సమీకరిస్తున్నారు. ఇకపోతే, దివ్య, రాజాల మరణంతో వారి పాప పరిస్థితి హృదయవిదారకంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement