
సాక్షి, హైదరాబాద్ : ప్రవాసీ భారతీయ దివాస్ తేదీ మార్పుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రవాసీ భారతీయ దివాస్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్ కుమార్, ఎన్నారై ప్రతినిధులు దేవేందర్ రెడ్డి, భీమ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం 2003 లోనే ప్రారంభమైందని అన్నారు. దివాస్‌ను అవమానపరచేలా మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జనవరి9న ప్రతిఏటా జరిగే ప్రవాసీ భారతీయ దివాస్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉందని తెలిపారు. ప్రవాసీయులు తమ సంపాదనలో కొంత దేశ ప్రయోజనాలకోసం ఉపయోగిస్తున్నారని చెప్పారు. కనీసం 3 కోట్ల మంది ఎన్నారైలు ఉన్నారని తెలిపారు. ఎన్నారైలు దేశానికి ఆర్థికంగా వెన్నెముకగా నిలబడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి ఎన్నారైలను అవమానపరచేలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు.
ప్రవాసీ భారతీయ దివాస్ నిర్వహణ తేదీ జనవరి 26 కు మార్చడం సరైనదికాదని అన్నారు. కేవలం బీజేపీ స్వార్ధప్రయోజనాల కోసమే దివాస్ తేదీని మార్చారని నిప్పులు చెరిగారు. ఈ ఏడాది నరేంద్ర మోదీ దివాస్ ను వారణాసిలో జనవరి 26న నిర్వహించాలని చూస్తున్నారని, మోదీ సర్కారు దివాస్‌ను జనవరి 9న యథావిధిగా ఢిల్లీలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ తరపున జనవరి 9న ఢిల్లీలో ఆమ్ ప్రవాసి దివాస్ పేరుతో తామే నిర్వహిస్తామన్నారు. ఎన్నారైల కోసం ప్రాక్సీ ఓటింగ్ విధానం ప్రవేశపెట్టాలని, ఏమిగ్రేషన్ బిల్లు కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment