చేనుకు చేవే, భవితకు తోవ!
చేనుకు చేవే, భవితకు తోవ!
Published Thu, Feb 6 2014 2:39 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
1970-1980 దశకాల్లో సాగు కార్యకలాపాన్ని ఉధృతం చేసుకుని గ్రామీణ కూలీల ఆవశ్యకతను గుర్తించి, రోజువారీ కూలీని పెంచుకోవడంతోపాటు ఆహారధాన్యాల ధరలను, పేదరికాన్ని కొంతమేరకయినా తగ్గించుకోగలిగాం. కానీ ఈ పట్టుదల నిబద్ధతతో కొనసాగలేదు. 1990, 2000 దశకాల్లో వ్యవసాయ అభివృద్ధి తగ్గిపోయింది.
భారత ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక, సేవారంగాల్లో జరిగిన అభివృద్ధితో 2012-13 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం వాటా క్రమంగా 13.7 శాతానికి పడిపోయింది. ఇది మంచి పరి ణామం కాదు. ఎలాగంటే మూడో వంతు భారతీయ కుటుం బాలు గ్రామీణ ఆదాయం మీదనే ఆధారపడి ఉన్నాయి. మొత్తం జనాభాలో 800 మిలియన్ల పేదలు సుమారుగా 70 శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు.దేశంలో వృద్ధి చెందుతున్న ఆదాయాలతో పాటుగా పెరుగుతున్న జనాభా డిమాండ్లను తీర్చడం, వారి ఆహార భద్రత వంటి కీలకాం శాలన్నీ ధాన్యంతో పాటుగా పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల పెరుగుదల మీదనే ఆధారపడి ఉన్నాయి. కనుకనే ఉత్పాదకత, పోటీ, వైవిధ్యంతో పాటుగా సుస్థిర వ్యవసాయ రంగం వేగంగా ఆవిర్భవించవలసిన అవసరం ఉంది. వ్యవ సాయంలో భారతదేశం అనేక విధాలుగా అగ్రగామిగా ఉంది.
పాలు, అపరాలు, మసాలా దినుసులు ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే పేరుగాంచింది. అత్యధిక పశుసంపదతో పాటుగా అత్యధిక భూమి గోధుమ, వరి, పత్తి పంటల కింద సాగులో ఉన్నది కూడా ఇక్కడే. భారతదేశం వరి, గోధుమ, పత్తి, చెరకు, చేపలు, గొర్రెలు, గొర్రె మాంసం, పండ్లు, కూరగాయలు, తేయాకు ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్నది. మన దేశంలో సాగులో ఉన్న సుమారు 195 మిలియన్ హెక్టార్లలో 63 శాతం వర్షాధారంగా ఉండగా 37 శాతం భూములు నీటి పారుదల సదుపాయం కలిగి ఉన్నాయి. అదనంగా సుమారు 65 మిలియన్ హెక్టార్ల భూమి అడవులతో విరాజిల్లుతూ ఉంది. భారతదేశ సమగ్రాభివృద్ధికి, గ్రామీణ పేదల సంక్షేమానికి వ్యవసాయ రంగం ఎదుర్కోవలసిన కొన్ని సవాళ్లు ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి.
ఆహార భద్రతకు అనుగుణంగా....
ఆహారధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన అభివృద్ధి సాధించి, 1970 దశకంలో హరిత విప్లవంతో స్వయం సమృద్ధిని సాధించుకున్నాం. కరువు కాటకాల నుంచి బయటపడ్డాం. 1970-1980 దశకాల్లో సాగు కార్యకలాపాన్ని ఉధృతం చేసుకుని గ్రామీణ కూలీల ఆవశ్యకతను గుర్తించి, రోజువారీ కూలీని పెంచుకోవడంతో పాటు ఆహారధాన్యాల ధరలను, పేదరికాన్ని కొంతమేరకయినా తగ్గించుకోగలి గాం. కానీ ఈ పట్టుదలలో నిబద్ధత కరువైంది. 1990, 2000 దశకాల్లో వ్యవ సాయ అభివృద్ధి తగ్గిపోయింది. సగటున వృద్ధి 3.5 శాతం మాత్రమే నమోదు కాగా, ధాన్యం ఉత్పత్తుల్లో పెరుగుదల 1.4 శాతం మాత్రమే. ఈ తగ్గుదల ఆందోళన కలిగించేదే. భారతదేశ వరి ఉత్పత్తులు చైనాతో పోలిస్తే మూడు వంతుల్లో ఒకటిగాను, వియత్నాం, ఇండోనేసియాతో పోల్చుకుంటే సగంగాను ఉన్నాయి. ఈ విధమైన పోలికలతో అనేక వ్యవసాయ ఉత్పత్తుల్లో మనం వెనుక బడి ఉన్నాం. విధాన రూపకర్తలు రాబోయే రోజులకు అనుగుణంగా, అధిక కాలం ఉపయోగపడేలా విధాన నిర్ణయాలు చేయవలసి ఉంది. ఉత్పాదకత, అంతర్జాతీయ పోటీకి దీటుగా, వైవిధ్యంతో ఉండేలా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దాలి.
పెరగవలసిన ఉత్పాదకత
మన వ్యవసాయంలో నిజమైన అభివృద్ధి సాధించడానికి దేశంలో సాగులో ఉన్న ప్రతి ఎకరానికి ఉన్న ఉత్పాదకతను గణనీయంగా పెంచాలి. ఉత్పాదకత పెరగా లంటే నీటి లభ్యత ముఖ్యం. పట్టణాభివృద్ధి, పెరుగుతున్న పరిశ్రమల అవస రాలు వంటి వాస్తవికాంశాలను దృష్టిలో ఉంచుకుని నీటికి పోటీపడవలసిన ఆవశ్యకతను గుర్తించాలి. అలాగే వృథాను నివారిస్తూ లక్ష్యసాధన కోసం నడుం బిగించాలి. నీటి వనరులలో సేద్యానికి సింహ భాగం అవసరం. అయితే పరిశ్రమలు, పట్టణావసరాలు నీటికి పోటీపడటం ఇటీవల పెరుగుతున్నది. ముందు ముందు నీటితో ప్రజావసరాలు మరింత విస్తరించే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. అలాంటి పరిస్థితులు ఎదురైతే వ్యవసాయానికి గడ్డు పరిస్థితులు తప్పవు.
అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి వినియోగం ద్వారా అధిక ఫలసాయాన్ని పొందే విధానాలను అభివృద్ధి పరచి, అమలు పరచవలసిన అవసరాన్ని ఇప్పటి నుండే గమనించాలి. భూగర్భ జలాల దుర్వినియోగాన్ని అరికట్టడం ఇకనైనా ఒక ఉద్యమంలా సాగించాలి. జలాల దుర్వినియోగంతో రాబోయే రోజుల్లో తలెత్తే సమస్యలు, పర్యావరణ సంబంధిత విపత్తుల వంటి అంశాల మీద రైతులకు, ఇతర వినియోగదారులకు సరైన అవగాహన కలిగిం చాలి. నీటి పారుదలను ఆధునీకరణ, మురుగునీటి పారుదల సదుపాయాలు, పెట్టిన ఖర్చుకు సార్థకత, కచ్చితంగా, వేగంగా ఫలితాలను ఇవ్వగలిగే పద్ధతులకు మద్దతు, పెట్టుబడుల్లో సుస్థిరత సాధించే దిశగా అమల్లో ఉన్న ప్రక్రియలు, వాటి కొనసాగింపునకు తగినన్ని వనరులు కేటాయించుకోవడం వంటివి జల వినియోగంలో తక్షణమే ఆలోచించవలసిన ఇతర కీలక విధానాలు.
జల రక్షణకు కొత్త దృష్టి
భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధిక మోతాదులో దుర్వినియోగపరచడంతో వాటి స్థాయి ప్రమాదకరంగా పడిపోతున్నది. నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో సరైన మురుగు నీటి ఉపసంహ రణ లేనందున సాగు భూములు ఉప్పు నేలలుగా మారిపోతున్నాయి. అత్యధిక ప్రాంతాల ప్రజలకు జీవనాధారమైన వర్షాధారిత ప్రాంతాల్లో సాగు భూమి కోతకు గురికాకుండా చూడాలి. మితంగా కురిసే వర్షపు నీరు వృథా కాకుండా, నేల పీల్చుకునేలా వ్యవసాయ పద్ధతులను ఇంకొన్నిచోట్ల అన్నదాతలకు అందించగలగాలి. సమగ్ర వాటర్ షెడ్ నిర్వహణా కార్యక్ర మాల వంటి వాటి అమలు ద్వారా కమ్యూనిటీలు భూవినియోగ ప్రణా ళికలు రూపొందించేటట్టు రైతులను సంసిద్ధులను చేయాలి. మారుతున్న పర్యావరణ పరిస్థితులు, దానితో శీతోష్ణస్థితిలో వస్తున్న మార్పులు, అధికంగా ఏర్పడుతున్న వరదలు, కరువు, అకాల వర్షాలు మున్ముందు పెరిగిపోగలిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వాటర్ షెడ్ నిర్వహణా కార్యక్రమాలతో పాటుగా ఆటుపోట్లకు తట్టుకునే వంగడాలను, వ్యవసాయ పద్ధతులను, ప్రణాళికలను అభివృద్ధి పరచుకోవాలి.
అందని రుణాలు
రైతులకు గ్రామీణ రుణాలు అందని పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇది మారాలి! విద్యుత్తు, నీటి పారుదల వంటి వాటితో పాటు ఇతర ఆహార సరఫరాల మీద సబ్సిడీలు తొలగించాలని యోచిస్తున్నారు. కానీ అంత కంటె ముందు రైతుకు తన పంటకు ధరలు నిర్ణయించడంలో తగినంత ప్రాధాన్యం ఇవ్వాలన్న సంగతి చూడాలి. ఈ అంశం గురించి పట్టించుకోనంత కాలం రైతుకు ఇస్తున్న అన్ని రకాల సబ్సిడీలను కొనసాగించడం అవసరమే. లేకపోతే ఆహార ఉత్పత్తులే సందిగ్ధంలో పడిపోతాయి. వ్యాపారస్తుడు ఎలాగైతే తన లాభాలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయాలు చేస్తున్నాడో, సేద్యగాడు కూడా ఖర్చులన్నీ పరిగణనలోకి తీసుకుని వ్యవసాయోత్పత్తుల మీద లాభసాటిగా ధరలను నిర్ణయించుకునే స్థాయికి చేరుకోవాలి. పంటల ధరల నిర్ణయంలో రైతు పాత్రను నిర్లక్ష్యం చేయడానికి వీలులేని పరిస్థితులు నెలకొనాలి. మార్కెట్లపై నిరోధాలు కొనసాగుతున్నాయి. విత్తనాలు, రసాయనిక ఎరువుల వంటి కొన్ని ఉత్పాదకాల మీద నిరోధాలు తొలగిపోయాయి.
దీనితో రైతులు గిట్టుబాటు ధరలు పొందలేక అనేక విపరీత పరిణామాలను ఎదుర్కొంటు న్నారు. ఆధునికంగా తీర్చిదిద్దిన శాస్త్రీయ మార్కెట్లకు దళారుల ప్రమేయం లేకుండా అన్నదాతకు ప్రవేశం కల్పించాలి. అది చూసి దశాబ్దాలుగా రైతును మోసాలకు గురిచేస్తున్న దళారులకు కనువిప్పు కలిగించే విధంగా ఇదంతా జరగాలి. ముఖ్యంగా రైతన్నను విద్యాధికుడిని చేయాలి. అప్పుడు మాత్రమే రైతన్న విషయావగాహన ద్వారా మోసాలను పసిగట్టగలడు. తన కష్టాలు కడతేరడానికి, ఆదాయం పెంచుకోవడానికి స్వయంగా లేక సంఘటితంగా పరిష్కార మార్గాలను కనుగొని ఫలితాలను పొందగలడు.
- డా॥బలిజేపల్లి శరత్‌బాబు
Advertisement