వ్యవసాయ ఉద్దీపనతోనే భవిష్యత్తు | Devinder Sharma Article On Agricultural Stimulation | Sakshi
Sakshi News home page

వ్యవసాయ ఉద్దీపనతోనే భవిష్యత్తు

Published Sat, Sep 12 2020 1:47 AM | Last Updated on Sat, Sep 12 2020 1:47 AM

Devinder Sharma Article On Agricultural Stimulation - Sakshi

ఆర్థిక వ్యవస్థను మహమ్మారి కరోనా కుదేలు చేసిపడేసిన సమయంలోనూ వ్యవసాయమే అతిపెద్ద ఉద్యోగ కల్పనా శక్తిగా నిరూపితమైంది. ఈ తరుణంలో కోవిడ్‌–19 అనంతరం గ్రామీణ జీవితాలను బలోపేతం చేయడమే ప్రాధాన్యాంశంగా ఉండాలి, రైతాంగం చేతుల్లోకి మరింత నగదును తీసుకువచ్చే విధానాలను అమలు చేయాలి. వ్యవసాయంపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించేయాలంటూ ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్దేశించిన ఆర్థిక చింతన వల్లే వ్యవసాయం వాస్తవంగా బలైపోయింది. ఆ విధానాల వల్లే వ్యవసాయ రాబడులను ఉద్దేశపూర్వంగా తగ్గించివేస్తూ వచ్చారు. అందుకే దేశంలో సాహసోపేతమైన సంస్కరణల కోసం నిజంగా పరితపిస్తున్నది వ్యవసాయరంగమేనని చెప్పాల్సి ఉంటుంది.

ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ లెక్కలు కుప్పకూలిపోవడం ద్వారా ఆర్థిక మాంద్యం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో వ్యవసాయం ఒక్కటే మనకు మిగిలిన ఆశాకిరణంలా కనిపిస్తోంది. రబీ సీజన్‌లో సమృద్ధిగా పంటలు పండినందున వ్యవసాయమే దేశాన్ని నిజంగా రక్షించే ఉత్పత్తి రంగంగా నిరూపితమైంది. ఇప్పుడు ఖరీఫ్‌ సీజన్‌లో కూడా 8 శాతం ఎక్కువగా నాట్లు వేయడం, ఇంతవరకు వర్షపాతం కూడా సాధారణ స్థాయికి ఎగువనే ఉండటంతో భారతదేశం మరోసారి పంటల్లో రికార్డు సృష్టించేవైపుగా ముందుకెళుతోంది. ఈ సంక్షోభ సమయంలో, వ్యవసాయం ఒక్కటే దేశానికి ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఉత్పత్తి ఖర్చులు, ముడిసరుకుల వ్యయం కంటే విలువ ఆధారిత సరుకులు, సేవల స్థూల విలువ తక్కువగా నమోదైన సమయంలోనే వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలు 3.4 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.

లాక్‌డౌన్‌ అమలైన తొలి రెండు నెలల కాలంలో దేశంలోని అనేక పారిశ్రామిక సంస్థలు మూతపడటంతో ఆర్థిక కార్యాచరణ తీవ్రంగా దెబ్బతింది. అందుచేత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మైనస్‌ 23.9 శాతానికి పడిపోయింది. ఇది ప్రపంచంలోని 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలోనే అతి తక్కువ వృద్ధి శాతం అన్నమాట. 1996లో త్రైమాసిక జీడీపీ వివరాలను గణించడం మొదలుపెట్టాక భారత ఆర్థిక వ్యవస్థలో నమోదైన అతిపెద్ద ఆర్థిక పతనంగా దీన్ని భావించవచ్చు. దీనికి ఉద్యోగాల కోత అదనంగా తోడయింది. పైగా సగటు పౌరుడిపై ఆర్థికంగా పడిన దెబ్బ అసామాన్య స్థాయిలో ఉంటోంది. ఇక దేశంలో వ్యక్తిగత వినియోగం అత్యవసర వస్తువుల కొనుగోలుకు మాత్రమే పరిమితమైంది. దీనికి అదనంగా వేతనాల్లో కోతలు, జీతం ఇవ్వకుండా సెలవులు ఇవ్వడం వంటివి ప్రజల కష్టాలను రెట్టింపు చేశాయి. ఇవి చాలవన్నట్లుగా సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎకానమీ అంచనా ప్రకారం దాదాపు రెండు కోట్లమంది వేతన జీవులు, మరొక 70 లక్షల మంది రోజుకూలీలు గత ఏప్రిల్‌ నెల నుంచి తమ ఉద్యోగాలను కోల్పోయారని తెలుస్తోంది. 

ఈ అంచనాలకు అదనంగా దాదాపుగా 3 కోట్ల మంది వలస కార్మికులు (రాష్ట్రాల మధ్య జరిగిన వలసను కూడా లెక్కించినట్లయితే 8 కోట్లమంది వలస కార్మికులు ఈ జాబితాలో చేరతారు) వందల, వేల కిలోమీటర్ల దూరం తమ పిల్లలను భుజాలపై మోసుకుంటూ కాలినడక ద్వారా తమ ఇళ్లకు చేరుకున్నారు. స్వాతంత్య్రం తర్వాత దేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద వలసగా దీన్ని పేర్కొనాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా వ్యవసాయాన్ని గిట్టుబాటు కాకుండా చేసిన మన ఆర్థిక విధానాల సంపూర్ణ వైఫల్యాన్నే మరోసారి ఇది గుర్తు చేసినట్లయింది. 

ఉత్పత్తి ఖర్చులు పెరుగుతుండగా, పంటల ధరలు మాత్రం స్తబ్దంగా ఉండిపోవడం లేక మరింత పతనం కావడంతో వ్యవసాయంలో వాణిజ్య విధానాలు తొలినుంచీ ప్రతికూల ధోరణితోనే కొనసాగుతున్నాయి. అందుచేత, గ్రామాలకు తరలిపోయిన కోట్లాది వలస కార్మికులను మళ్లీ నగరాలకు తీసుకురావడానికి బదులుగా, గ్రామీణ ప్రాంతాలనుంచి ప్రజ లను బయటకు నెట్టివేయడం అనే ఆర్థిక నమూనాను మార్చివేయడం వైపుగా ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం కుటుంబాలు వ్యవసాయపనుల్లో నిమగ్నం కావడాన్ని చూస్తే, వ్యవసాయాన్ని పునరుజ్జీవింప జేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాల్సి ఉంటుంది. వ్యవసాయాన్ని ఆర్థిక వృద్ధికి సంబంధించి బలీయమైన శక్తిగా మార్చాల్సిన అవసరం వచ్చిపడింది. కరోనా మహమ్మారి మన ఆర్థిక వ్యవస్థలోని తప్పుడు విధానాలను నిర్దిష్టంగానే ఎత్తి చూపినందున, ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకుపోతూ, ఉద్యోగాల కల్పనకు వీలిచ్చేటటువంటి కొత్త ఆర్థిక ఎజెండా రూపకల్పన కోసం కొత్త ఆలోచనలతో ముందుకు రావల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించాల్సి ఉంది. పరిశ్రమల కోసం వ్యవసాయాన్ని త్యాగం చేయడం అనే పాత ఆర్థిక వృద్ధినే అనుసరించడానికి కాలం చెల్లిపోయిందని, లాక్‌డౌన్‌ కాలంలో జరిగిన రివర్స్‌ వలస తిరుగులేని సాక్షీభూతంగా నిలుస్తోంది.

ఆర్థిక వ్యవస్థను మహమ్మారి కరోనా కుదేలు చేసిపడేసిన సమయంలోనూ వ్యవసాయమే అతిపెద్ద ఉద్యోగ కల్పనా శక్తిగా నిరూపితమైంది. ఈ తరుణంలో కోవిడ్‌–19 అనంతరం గ్రామీణ జీవితాలను బలోపేతం చేయడమే ప్రాధాన్యాంశంగా ఉండాలి, రైతాంగం చేతుల్లోకి మరింత నగదును తీసుకువచ్చే విధానాలు అమలు చేయాలి. ప్రధాని నరేంద్రమోదీ ప్రవచిస్తున్న సబ్‌కా సాత్‌ సబ్‌గా వికాస్‌ స్వప్నాన్ని సాకారం చేయగల శక్తి దీనికి మాత్రమే ఉందని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) డైరెక్టర్‌ జనరల్‌ క్యూ డాంగ్యూ స్పష్టంగా చెప్పారు. ‘‘బలమైన ఆర్థిక వ్యవస్థల హితకరమైన ప్రభావాల కారణంగా గతంలో అబివృద్ధి కొనసాగింది. కానీ ఇది ఎల్ల ప్పటికీ అలాగే ఉండదు. ఇప్పుడు సామాజిక వాస్తవాలు మారాయి. కాబట్టి మన ఆలోచనలు కూడా తప్పకుండా మారాలి’’.

మన వ్యవసాయ దుస్థితి దశాబ్దాలుగా కొనసాగడానికి కారణం దేవుడి చర్య కానే కాదని చెప్పాలి. వ్యవసాయంపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించేయాలంటూ ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్దేశించిన ఆర్థిక చింతన వల్లే వ్యవసాయం వాస్తవంగా బలైపోయింది. ఆ విధానాల వల్లే దశాబ్దాలుగా వ్యవసాయ రాబడులను ఉద్దేశపూర్వంగా తగ్గించివేస్తూ వచ్చారు. అభివృద్ధి అని తాము చెబుతున్న నమూనాను కొనసాగించేందుకు అవసరమైన సూక్ష్మ ఆర్థిక స్థిరత్వం కోసం వ్యవసాయాన్ని అధోగతి పాలుచేశారు. ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 4 శాతంలోపు ఉంచేలా చేయడం కోసం వినియోగదారీ ధరల సూచీ (సీపీఐ) గణనలో ఆహార పదార్థాలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చినందున ఇన్నాళ్లుగా తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఖరీఫ్‌ పంటల సీజన్‌ కోసం వరిధాన్యం సేకరణ ధరను ఉదాహరణగా తీసుకుందాం. కనీస మద్దతు ధరను 2.9 శాతం మేరకు పెంచారు కానీ, వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు, ధరల కమిషన్‌ (సీఏసీపీ) చెబుతున్న దాని ప్రకారం వరిపంట ఉత్పత్తికోసం అయ్యే దిగుబడి ఖర్చులకు సంబంధించిన ధరలు అమాంతంగా 5.1 శాతం పెరిగిపోయాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ధాన్యసేకరణ ధరలను స్థిరీకరించడమే సీఏసీపీ వ్యవసాయ ధరల విధానం లక్ష్యాల్లో ఒకటిగా ఉంటూ వచ్చింది.

లాక్‌డౌన్‌ సమయంలో కూడా వ్యవసాయం చక్కటి పనితీరును ప్రదర్శించినప్పటికీ, వ్యవసాయ ఆదాయాల వృద్ధి కంటే వ్యవసాయ కార్మికుల వాస్తవ ద్రవ్యోల్బణాన్ని అధికంగా చూపిస్తూ వస్తున్నారు. దీంతో వాస్తవంగా రైతులు రాబడిపరంగా దెబ్బతింటున్నారు. దేశం లోని మెజారిటీ రైతులు కనీస మద్దతు ధరకు సరిసమానమైన వాస్తవ రాబడి ధరలను తమ ఉత్పత్తులకు సంబంధించి అందుకోవడం లేదని గోవన్‌ కనెక్షన్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ (సీసీడీఎస్‌) సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. గత కొన్నేళ్లుగా కొనసాగిన పలు ఇతర అధ్యయనాల బట్టి వ్యవసాయ ధరలు దశాబ్దాలుగా స్తబ్దంగా ఉండిపోయాయని, ఘనీభవించిపోయాయని తెలుస్తోంది. అందుకే మన దేశ రైతులు పంటలను కాదు.. నష్టాలను పండిస్తున్నారని నేను చాలాసార్లు చెబుతూ వచ్చాను. 

దేశంలో సాహసోపేతమైన సంస్కరణల కోసం నిజంగా పరితపిస్తున్నది వ్యవసాయరంగమేనని చెప్పాల్సి ఉంటుంది. దాని ప్రస్తుత రూపంలో వ్యవసాయరంగం వృద్ధి చోదక శక్తిగా ఆవిర్భవించలేదంటే అంగీకరించాల్సిందే. కానీ మనం ఒక విషయం మర్చిపోవద్దు. ఆరోగ్యకరమైన వ్యవసాయానికి సౌభాగ్యవంతమైన వ్యవసాయ సామాజిక బృందం మనగలగాలి. రైతులకు నెలవారీ ఆదాయం కల్పించేలా వ్యవసాయ విధానం మార్పు చెందినప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఇది జరగాలంటే వ్యవసాయరంగంలో, ఆరోగ్య విద్యారంగాల్లో ప్రభుత్వ రంగ మదుపులను తీవ్రంగా పెంచాల్సి ఉంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జాతీయ స్రవంతి ఆర్థిక చింతనలో మార్పులు చేసినప్పుడు ఇది తప్పకుండా సాధ్యపడుతుంది. 

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కాలంలో వ్యవసాయం దేశానికే ప్రాణాధారంగా నిలిచి పనిచేసింది. ఇప్పుడు దేశం ముందున్న సమస్య ఏమిటంటే, వ్యవసాయరంగం ఇకపై వెనుకబాటుతనంలో ఉండిపోకుండా, వృద్ధి క్రమంలో ఒక సమాన భాగస్వామిగా ఎదగాల్సి ఉంటుంది. భారతదేశం తన విధానపరమైన దిశను మార్చుకోవలసిన పంథా ఇదే మరి.

వ్యాసకర్త: దేవీందర్‌ శర్మ,  వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : : hunger55@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement