ఆ బడుల్లోనే మీ పిల్లలూ..
మీ డ్రైవర్, మీ పని మనిషి పిల్లలు చదువుతున్న పాఠశాలకే మీ పిల్లలను కూడా పంపవలసిందని అధికారులకు హైకోర్టు చెప్పింది. కాబట్టి ప్రభుత్వ బడుల్లోని పిల్లల ఇబ్బందులను, కష్టాలను ఎలా తగ్గించాలి అని ఆలోచించండి.
ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఖజా నా నుంచి వేతనాలు తీసుకునే వారితో సహా ప్రభుత్వ ఉద్యోగులందరూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమ పిల్లల ను ప్రభుత్వ ప్రాథమిక పాఠ శాలల్లో మాత్రమే చేర్పించాలం టూ అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు అది గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. నిత్యం తాము యథావిధిగా వండి వార్చే పిండివంటనే విధాన నిర్ణేతలు, వాటిని అమలు చేసేవారు రుచి చూడాలని ఉన్నత న్యాయస్థానం కోరుకుంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పాదరక్షలను ధరించండి, అవి ఎంత ఇరుగ్గా ఉన్నాయో చూడండి.
అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయ మూర్తి సుధీర్ అగర్వాల్ ఇచ్చిన ఆదేశానికి వ్యతిరేకంగా అప్పీలుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఉన్నతాధికారులు తాము స్వయంగా నిర్దేశించిన కార్య క్రమాలలో ఎవరి జోక్యాన్ని ఇష్టపడరు. ఇతరులు బాధితు లుగా ఉంటున్నంత కాలం.. తాము చేస్తూ వచ్చినదంతా ఉత్తమమైనదేనని వీరి ప్రగాఢ విశ్వాసం. కోర్టు ఆదేశాలకు భిన్నంగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏవైనా ఉల్లంఘనలు జరిగితే ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా జరిమానాలు చెల్లించవలసి ఉంటుంది. ఇలా పోగుపడిన నిధితో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుప ర్చవచ్చు.
చెడు వ్యవస్థను ఇన్నాళ్లుగా అందిస్తూ వచ్చిన వారిని దాని దుష్ఫలితాలను తాము కూడా అనుభవించడం తప్పనిసరి చేసే సమానత్వ పాఠశాలలకు స్వాగతం పలక వలసిందే కానీ, హైకోర్టు ఆదేశం వివిధ వర్గాల పిల్లలను పరస్పరం మిళితం చేయవచ్చన్న దృష్టికోణానికి అంతగా ప్రాధాన్యత లేకపోవచ్చు. ప్రజాతంత్ర రిపబ్లిక్‌లో ఉంటు న్నప్పటికీ, మనది ఆర్ధిక, కుల, ఉప కుల ఆలోచనలతో వేరుపడిపోయిన సమాజం. పైగా దీన్ని ప్రభుత్వాలు, రాజకీయ నేతలూ వివిధ మార్గాల్లో పెంచి పోషిస్తూ వస్తు న్నాయి. అయితే అపసవ్య ధోరణితో నడుస్తున్న పాఠశాల వ్యవస్థ కారణంగా శాశ్వతంగా నష్టపోతున్న నిరుపేదలపై పడుతున్న ఒత్తిడి, వారెదుర్కొంటున్న అణచివేతే ఇంకా ఘోరమైనది.
సమాజం దీన్ని ఇంకెంతకాలమో భరించాలనుకో వట్లేదు. ఇందుకు సంబంధించి సంకేతాలు కూడా కనబ డుతున్నాయి. కేరళలోని మల్లపురంలో 11వ తరగతి విద్యార్థి 17 ఏళ్ల షహల్ కె. తను చదువుకుంటున్న పాఠశా లలో మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిందిగా కోరుతూ 3 రోజుల నిరాహారదీక్షకు పూనుకున్నాడు. దీంతో జిల్లా కలెక్టర్ దిగొచ్చి హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇలాంటి ఇతర ఉదాహరణలు కూడా వార్తలకెక్కుతున్నాయి. నది దాటి పాఠశాలకు వెళ్లేందుకు తమ తలలపై యూనిఫాంను పెట్టుకుని ఈదులాడుతూ వెళుతున్న పిల్లలు, తమ నాప్‌కి న్‌లను మార్చుకోవడానికి తగిన గోప్యత లేమితో పాఠశా లకు వె ళ్లడం మానేస్తున్న యుక్తవయస్సులోకి వచ్చిన బాలికలు.. వంటివి వీటిలో కొన్ని.
మన దేశంలో పేదలు తమ స్థితిగతులను మెరుగు పర్చుకోవాలనీ, తమ జీవన అవకాశాలను పెంచుకోవా లనీ కోరుకుంటున్నట్లు ఇలాంటి సందర్భాలు తెలుపుతు న్నాయి కానీ వ్యవస్థ వారిని రెండో తరగతి పౌరులుగా చూస్తోంది. మానవాభివృద్ధి సాధన స్థాయిలను నిర్ణయిం చే మూడు ప్రధాన అంశాలలో విద్య లేదా విజ్ఞానం ఒకటి. ఆరోగ్యం, ఆదాయం అనేవి ఇతర రెండు అంశాలు. భారత్‌లో మానవాభివృద్ధి సూచిక ఎంత పేలవంగా ఉం టోందో దీన్ని బట్టి తెలుస్తుంది. సరికొత్త ధోరణిలో వ్యవస్థ పనిచేయాలని, ఫలితాలను అందించాలని కోర డం ద్వారా ప్రజల స్థితిగతులను మెరుగుపర్చవలసిందిగా మనం పట్టు బిగిస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు ఇది పత్రికల్లో పతాక శీర్షిక అయ్యేలా మలుస్తుంది.
తమ శ్రేయస్సుకు హామీ లభించినంత కాలం పేదలను సర్వనాశనం చేసే విధానాలను అమలు చేసుకుంటూపోవడానికి వెనుకాడని ఉన్నత వర్గాల ఆలోచనా సరళిపైనే దాడి చేస్తున్నట్లుగా అలహాబాద్ హైకోర్టు తీర్పు కనిపిస్తోంది. ఉన్నత వర్గాల వైఖరి ఇలా లేనట్లయితే, గోధుమ, బియ్యం బ్లాక్ మార్కెట్‌లోకి తరలిపోయే రేషన్ షాపులు మీకు ఉండేవి కావు. ఉపాధి హామీ పథకం కింది రోజు కూలీ మొత్తాన్ని ఇవ్వడంలో జాప్యం చేయటం లేదా దాన్ని పూర్తిగా మింగేయడమో కూడా జరిగేది కాదు. ఇది నిజంగానే ఒక పశుప్రాయమైన, మతిహీనమైన వ్యవస్థ. దీన్ని తుత్తునియలు చేయడానికి న్యాయమూర్తి ఒక మార్గా న్ని కనుగొన్నారు.
ఈ ఉన్నతవర్గమే ప్రభుత్వ సహాయంతో నడిచే పాఠశాలలను ఏర్పర్చడం, నిర్వహించడం తలనొప్పి వ్యవహారమన్న భావనకు వచ్చేసింది. వీటి ప్రమాణాలను కొనసాగించవలసి వస్తుందని కాదు.. పాఠశాలల ఇన్‌స్పెక్టరే ఉపద్రవమట. ఈ దేశాన్ని లాభాలు పోగు చేసుకునే విద్యా సంస్థలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ వంటి వాటితో కూడిన కొత్త వర్గంతో వీరు నింపేశారు. రాజకీయనేతలే ఎక్కువగా ప్రైవేట్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పర్చారు. పలు విశ్వవిద్యాలయాలే వీరి స్వాధీనంలో ఉన్నాయి. అంగట్లో సబ్బు లేదా శీతల పానీ యాలను అమ్ముతున్నట్లుగా వీటిని టెలివిజన్ యాడ్‌లతో ప్రోత్సహిస్తున్నారు.
ఉన్నత వర్గాలు చేజిక్కించుకున్న ఈ సౌకర్యానికి మంగళం పలకాలని, సగటు మనిషితో కలసి ఉండ మని ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ప్రతి ఒక్కరికీ విద్యను అందించే విద్యా హక్కుకు ఆడంబ రంగా చట్ట రూపం ఇవ్వడంలో ఉన్న సాపేక్షిక వెసులు బాటును కూడా మన ముందు ప్రదర్శిస్తూ వచ్చారు. కానీ దాన్ని అమలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక్క టంటే ఒక్క శ్రేష్టమైన సందర్భం కూడా మనం చూడ లేదు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలల ప్రతిఘటన, వాటిని కొన సాగించడంలో ప్రదర్శించే ఉపేక్ష సర్వసాధారణమై పోయాయి. పేదలు, సంప న్నులు ఎప్పటికీ ఒక వరలో ఇమడలేరు. అది అంతటి ప్రమాదమన్నమాట. గణాంకాల్లో ఒక భాగంగా మా త్రమే పేదలకు గుర్తింపు ఉన్నట్లు కనిపిస్తోంది. వారు మనుషులు కాదన్నమాట. ఒక సేవను మీకు అందిస్తామంటూ వాగ్దానం చేయ డం వంటి శాసనాల తయారీ ద్వారానే తమది సుపరి పాలన అనిపించుకోదని అర్థం చేసుకోవలసి ఉంది.
సరైన విధంగా గుర్తించిన లక్షిత వర్గాలకు సేవలందించే సమ ర్థత ద్వారానే దాన్ని లెక్కించాలి. మనదగ్గర లేనిదల్లా ఇదే. ఉద్దేశించిన ఫలితాలతో పనిలేకుండా, పెట్టిన వ్యయం తోనే ఉద్దేశాలను నిర్ణయిస్తున్నారు. ఇన్నాళ్ల అస్తవ్యస్త పాలన ఫలితమే పేదలు. మీ డ్రైవర్, మీ పని మనిషి పిల్లలు చదువుతున్న పాఠశాలకే మీ పిల్లలను కూడా పంపవలసిందని ఉన్నత న్యాయస్థానం ఇప్పుడు చెప్పింది. కాబట్టి వారి చెప్పులను మీరు ధరించండి, ఇబ్బందులను, కష్టాలను ఎలా తగ్గించాలి అని ఆలోచించండి.
(వ్యాసకర్త: మహేశ్ విజా పుర్కార్, సీనియర్ పాత్రికేయులు)