ఇటు అంతరాయాలు, అటు సస్పెన్షన్లు | andhra pradesh reorganisation bill | Sakshi
Sakshi News home page

ఇటు అంతరాయాలు, అటు సస్పెన్షన్లు

Published Wed, Nov 4 2015 10:39 AM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM

ఇటు అంతరాయాలు, అటు సస్పెన్షన్లు - Sakshi

ఇటు అంతరాయాలు, అటు సస్పెన్షన్లు


 పార్లమెంట్‌లో ఏం జరిగింది -3

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 18-02- 2014న లోక్‌సభలోని కార్యకలాపాలు ఎలా ఉన్నాయో, ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాం!
 11.00కు సభ ప్రారంభమై 12.00 వరకూ వాయిదా పడింది.
 12.00కు మళ్లీ ప్రారంభమై 16 నిమిషాలు నడిచింది. ఈ సమయంలోనే జీవీ హర్షకుమార్ (అవిశ్వాస తీర్మానం ఇచ్చిన 13 మందిలో ఒకరు. పెప్పర్ స్ప్రే ఘటన రోజున సస్పెండ్ కాలేదు.) అవిశ్వాస తీర్మానాన్ని సభలో గందర గోళం వల్ల సభ ముందు ఉంచలేకపోతున్నానని స్పీకర్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ సభ్యుడు అందచేసిన నోటీసు సక్రమమైన పద్ధతిలో ఉందని స్పీకర్ భావించిన తర్వాత, సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తవ్వ గానే, స్పీకర్, ‘అనుమతించే సభ్యులందరూ తమ తమ స్థానాల్లో లేచి నిలబడమని’ కోరాలి. అలా నిలబడిన సభ్యులు 50 మందికి తక్కువ కాకుండా ఉంటే, అవిశ్వాస తీర్మానం చర్చించడానికి అనుమతినివ్వాలి. (రూల్ 198-కౌల్ అండ్ షక్దర్ పేజీ 689) 9-12-2013 నుండి లోక్‌సభ జరిగిన ప్రతిరోజూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబ డటం, స్పీకర్ చదవటం, సభ ‘ఆర్డర్’లో లేదు కాబట్టి 50 మంది ఉన్నారో లేదో లెక్క పెట్టలేకపోతున్నామని ప్రకటించటం.... యథావిధిగా జరుగుతూనే వచ్చింది. రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టబడిన 13-2-2014న మాత్రం ప్రశ్నోత్తరాల సమయం వాయిదా పడి, 12 గంటలకు సమావేశం ప్రారంభమవ్వగానే అవిశ్వాస తీర్మానం చదవవలసిన స్పీకర్, షిండేగారిని పిలిచి విభజన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చారు.

కౌల్ అండ్ షక్దర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ప్రకారం, అవి శ్వాస తీర్మానం ఉన్నప్పుడు మరే అంశాన్ని చేపట్టక ముందే సభాపతి అవిశ్వాస తీర్మా నాన్ని చదివి సభ అభిప్రాయం తెలుసుకోవాలి. ఆ రోజు మాత్రం షిండేగారు బిల్లు ప్రవేశపెట్టానని, లేదని సుష్మా స్వరాజ్‌గారు సభలో తన్నులాట, లగడపాటి పెప్పర్ స్ప్రే... సభ వాయిదా పడిపోయింది. మళ్లీ 2.00 గంటలకి సభ ప్రారంభమవ్వగానే , రూల్ 374(ఎ) కింద స్పీకర్ విస్తృతాధికారాలను ఉపయోగించి 16 మంది ఆంధ్రప్రదేశ్ సభ్యులను 5 రోజులు సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయబడిన వారిలో ఆరోజు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన కాంగ్రెస్‌కు చెందిన సాయిప్రతాప్, తెలు గుదేశం మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా ఉన్నారు.

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వారిని సభ నుంచి సస్పెండ్ చేసి తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని చదవటం విడ్డూరం. బహుశా ఎప్పుడూ ఎక్కడా గతంలో ఇలా జరిగి ఉండదు. సస్పెన్షన్ ప్రకటన చేసి ఆ తర్వాత  అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టారు. 50 మంది నిలబడండి అని కోరారు. సభ ‘ఆర్డర్’లో లేదంటూ మళ్లీ వాయిదా వేసేశారు. విచిత్రమేమిటంటే, ప్రతిరోజూ అవిశ్వాస తీర్మానానికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో లెక్క పెట్టడానికి అడ్డం వచ్చిన ‘‘సభ ఆర్డర్‌లో లేకపోవడం’’ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు విషయంలో మాత్రం అడ్డురాలేదు.


 12.14: హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే: ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే అంశమూ తత్సంబంధిత అంశాలున్న బిల్లును పరిగణనలోకి తీసుకోవల సిందిగా మనవి.
 ... అంతరాయం ...
 స్పీకర్: యస్, మంత్రిగారూ.
 షిండే: బిల్లు పాస్ చెయ్యవల్సిందిగా కోరుతున్నాను.
 స్పీకర్: సభలో కొంచెం ‘ఆర్డర్’ రానివ్వండి.
 ... అంతరాయం ...
 స్పీకర్: గౌరవ సభ్యులారా... సభ ఆర్డర్‌లోకి రావాలి.
 ... అంతరాయం ...
 స్పీకర్: మనముందు ఒక చట్టం (ఏపీ ఆఫ్ లెజిస్లేషన్) చేయవల్సినది ఉంది. సభ ఆర్డర్‌లో లేకపోతే నేను ముందుకెలా వెళ్లగలను. దయచేసి సభను ఆర్డర్‌లోకి తీసుకు రండి.
 ... అంతరాయం ...
 స్పీకర్: ‘శాంతి’గా ఉండండి. హోంమంత్రి మాట్లాడాలనుకుంటున్నారు.
 హోంమంత్రి గారూ.
 షిండే: ఆమోదించమని కోరుతూ బిల్లు ప్రవేశపెట్టాను. ఆమోదించి పాస్ చెయ్యాలి.
 12.16 స్పీకర్: సభ 12.45 వరకూ వాయిదా పడింది.
 12.45: స్పీకర్: హోం మినిస్టర్ సుశీల్‌కుమార్ షిండే.
 12.45 1/2: (కె.బాపిరాజు, ఎ.సంపత్, కె.శివకుమార్ మరికొందరు సభ్యులు స్పీకర్ ‘వెల్’లో ఉన్నారు.)
 షిండే: ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సుదీర్ఘమైన చరిత్ర కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైన ఈ ప్రాంతం ఒక ప్రత్యేక రాజకీయ సాంస్కృతిక ప్రతిపత్తి కలిగి ఉంది.
 స్పీకర్: సభలో ‘ఆర్డర్’ కావాలి.
 ... అంతరాయం ...
 షిండే: 1960-70లలో ప్రత్యేక రాష్ట్రం కోరుతూ తెలంగాణ, అలాగే మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన ఆందోళనలు నడిచాయి. తాత్కాలిక చర్యలు సంప్రదిం పులతో అవి సద్దుమణిగాయి.
 ... అంతరాయం ...
 షిండే: గత పది సంవత్సరాలుగా, ఈ ప్రాంత సాంఘిక, ఆర్థిక, రాజకీయ ఆకాంక్షల ఫలితంగా..
 ... అంతరాయం ...
 12.47 స్పీకర్: ‘ఆర్డర్’ తీసుకురావాలి.
 ... అంతరాయం ...
 సభను 3.00 వరకూ వాయిదా వేస్తున్నాను.
 15.00 మళ్లీ సభ ప్రారంభమైంది.
 (లోక్‌సభ టీవీ చానల్ ప్రత్యక్ష ప్రసారం ఆగిపోయింది. ప్రసారమే కాదు... ఆ గంటన్నర లోక్‌సభలో జరిగిన ప్రహసనాన్ని రికార్డే చేయలేదు. 18-4-1994 నుంచి, లోక్‌సభలో జరిగిన అన్ని ప్రొసీడింగ్స్ రికార్డు చేయబడ్డాయి. యుమాటిక్ / బీటా కామ్/ వీహెచ్‌ఎస్ క్యాసెట్స్/ వీడియో సీడీ రూపాల్లో ఆడియో విజువల్ లైబ్రరీలో రికార్డు మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. 18-2-2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు సభ ముందుకొచ్చిన 15.00 గంటల నుంచి 16.26 నిమిషాలకు సభ వాయిదా పడే వరకూ మాత్రం... రికార్డింగ్ జరగలేదు.)
 15.01 (మంత్రులు కేఎస్ రావు, చిరంజీవి, కనుమూరి బాపిరాజు, రామచంద్ర డోమ్ (సీపీఎం), శైలేంద్ర కుమార్ (సమాజ్‌వాదీ పార్టీ), కళ్యాణ్ బెనర్జీ (తృణమూల్), పి.కరుణాకరన్ (సీపీఎం), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన సంసుమ కునగ్గర్ విష్ణుసభాతియార్, జయప్రద మొదలైన వారు స్పీకర్ ‘వెల్’లో టేబుల్ దగ్గర నిలబడ్డారు.)
 స్పీకర్: షిండేగారూ మీరు కొనసాగించండి.
షిండే: మేడమ్, తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడానికై ఈ బిల్లు ఉద్దేశించబడింది. ఈ విభజన వల్ల ఏర్పడబోయే ప్రభావం అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా పూర్తి కృషి చేశామని సభకు మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో నలుమూలల నుండి అందిన ప్రతి సలహాను, సూచనను పరిశీలించి బిల్లులో తగు విధంగా పొందుపరచడం జరిగిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా తయారు చేసిన డ్రాఫ్టు బిల్లును రాష్ట్రపతి గారు జనవరి 23లోగా అభిప్రాయం చెప్పమని అసెంబ్లీకి పంపారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అభిప్రాయం చెప్పే గడువును జనవరి 30 వరకు పొడిగించారు. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం తెలియజేసిన తరువాత కూడా అనేక సూచనలు వచ్చాయి. ఈ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని పరిశీలించాం.

ఆ విధంగా సవరణలు చేసి, ఆ సవరణలను కూడా సభ ముందు ఉంచుతున్నాం. పార్లమెంటు అసెంబ్లీ ప్రాతి నిధ్యం, రెవెన్యూ పంపకం, ఆస్తులు అప్పుల పంపకం, నీటివనరుల యాజమాన్యం, విద్యుత్, సహజవనరుల పంపకం, శాంతిభద్రతల పరిరక్షణ, వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ఈ బిల్లులో ప్రతిపాదనలు. ఆర్థిక లా అండ్ జస్టిస్, విద్యుత్, జలవనరులు, విమానయానం, నౌకాయానం, రోడ్ రవాణా, మానవ వనరులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, బొగ్గు, సహజవాయువు, సాంఘిక సంక్షేమం, గిరిజన, రైల్వే, ట్రైనింగ్, ప్లానింగ్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ మొదలైన అన్ని మంత్రిత్వ శాఖలతోనూ సంప్ర దింపుల తర్వాతే పొందుపరిచాం. ఈ మాటలతో 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు సభ ముందుంచుతూ ఆమోదించి పాస్ చేయవలసిందిగా కోరుతున్నాను.
 
 -ఉండవల్లి అరుణ్‌కుమార్
 వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు, a_vundavalli@yahoo.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement