
‘మాటకు కట్టుబడే మద్దతు’
పార్లమెంట్‌లో ఏం జరిగింది -4
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన ఫిబ్రవరి 18, 2014 మధ్యా హ్నం 3.00 గంటల వరకు ఏం జరిగిందో నిన్న మనం చూశాం. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
15.05: సుష్మాస్వరాజ్: అధ్యక్షా! హోంమంత్రిగారు, ఆంధ్రప్రదేశ్ పునర్వి భజన బిల్లుని ప్రవేశపెట్టారు. నేను మా పార్టీ తరఫున మద్దతు తెలపటానికై నిల బడ్డాను. ఈ బిల్లును సమర్థిస్తాం. బిల్లు పాసవ్వటానికి ఓటు కూడా వేస్తాం. ఎందుకంటే, ఈ విషయం మా పార్టీ విశ్వసనీయతతో ముడిపడి ఉంది. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టమని, మేము దానికి మద్దతిస్తామని, ఇప్పటికే అనేకసార్లు చెప్పాం. అంతేకాదు, ఈ ప్రభుత్వం బిల్లు తేలేకపోతే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని కూడా మాట ఇచ్చాం.
అధ్యక్షా! నేను ఇదే సభలో, మీరక్కడ అధ్యక్షస్థానంలో ఉన్న ప్పుడే, తెలంగాణ విషయమై మాట్లాడుతూ, ‘‘తెలంగాణ కోసం బలిదానాలు వద్దు. తెలంగాణ చూడటానికి బతకాలి బతకాలి’’ అని తెలుగు భాషలో ఆత్మహత్యలు ఆపమంటూ చెప్పిన మాటలకి స్వయంగా మీరే సాక్షి! ఇప్పుడు, వారి కలలు సాకారం చేయటానికి ఈ బిల్లు వచ్చినప్పుడు వ్యతిరేకించి, విశ్వాస ఘాతుకానికి ఎలా పాల్పడగలం! అందుకే, ప్రతిపక్షం మొత్తం ఈ బిల్లును వ్యతిరేకి స్తున్నా మేము మాత్రం ఈ బిల్లుకు మద్దతిస్తున్నాం - ఆ బిడ్డల కలల సాకారం కోసం... ఈ బిల్లు పాసవుతుందని చెప్తూనే, కొన్ని మాటలు ఈ సందర్భంగా ‘రికార్డు’ అవ్వాలని కోరుకుంటున్నాం. నా మొదటి ఆరోపణ కాంగ్రెస్ నాయకత్వం మీద. సోనియాగాంధీ గారికి నేను కనబడనుగాని, వారీ సభలోనే ఉన్నారు. నా మొదటి అభియోగం మీ మీదే సోనియాజీ, 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పారు. ఇది 2014. మొదటి పరిపాలనా కాలమంతా ఏమీ చెయ్య లేదు. రెండో టర్మ్ కూడా 15 రోజుల్లో అయిపోతున్న సమయానికి బిల్లు తెచ్చారు. 21వ తారీఖున, 15వ పార్లమెంట్ సమయం పూర్తవుతుంది. మూడ్రోజుల ముందు 18న ఈ బిల్లు పెట్టారు. విష యాన్ని లాగి లాగి ఇంతదాకా తీసుకొచ్చారు. మీ ఎంపీలు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రిని కూడా ఒప్పించలేకపోయారు.
అధ్యక్షా! ఇప్పటి వరకూ ఏ ఎంపీ కూడా ఈ దృశ్యం చూసి ఉం డడు. ప్రధాని కూర్చునే ఉన్నారు - మంత్రివర్గ సభ్యులు ‘వెల్’లో నిలబడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు కూర్చునే ఉన్నారు - కాంగ్రెస్ ఎంపీలే ఆవిడ్ని లెఖ్ఖ చెయ్యకుండా ‘వెల్’లో ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ధర్నా చేస్తున్నారు. ప్రధాన మంత్రి కేబినెట్‌లో బిల్లు పాస్ చేసి పంపిస్తారు. వారి ముఖ్యమంత్రే ఆ బిల్లును రద్దు చేసి తిప్పి పంపిస్తారు. ఆ దృశ్యాన్ని ఈ సభ చూస్తోంది. అద్వానీ గారు హోంమంత్రిగా ఉండగా మేము మూడు రాష్ట్రాలు విభజించాం. ఒక్క రక్తపు చుక్కగాని, పార్లమెంట్‌లో ఒక్క క్షణం అశాంతిగానీ లేవు. పూర్తిగా శాంతియుత వాతావరణంలో మూడు రాష్ట్రాలు నిర్మించాం. ఆ మూడూ ఇప్పుడు ప్రగతిపథంలో నడుస్తున్నాయి. అన్ని పార్టీల వారూ ఈ రోజు విడిపోయి ఉన్నారు. తెలంగాణ, సీమాంధ్రా వారు కలసి కూర్చోవటంలేదు. పాపం నామా నాగేశ్వర రావుగారు ఇక్కడున్నారు. నేనాయన్ని ‘శాండ్‌విచ్’ అంటాను. ఆయన తెలంగాణ కోరే వారితోనూ వస్తుంటారు - తెలంగాణ వ్యతిరేకించే వాళ్లతోనూ వస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీదీ ఇదే పరి స్థితి, జగన్ పార్టీదీ ఇదే పరిస్థితి... అన్ని పార్టీలూ ఇలాగే విడిపోయి ఉన్నాయి.
షానవాజ్ హుస్సేన్ (బీజేపీ): లోక్‌సభ టీవీ ప్రసారాలెందు కాపేశారు? ఎందుకు ఆపేశారు?
సుష్మాస్వరాజ్: ఈ సంక్షోభంలో కూడా, బీజేపీకి చెందిన తెలంగాణ, సీమాంధ్రా నాయకులు కలసి కూర్చుని సమస్యకు పరి ష్కారాన్ని వెతుకుతున్నారన్న విషయం - నేను గర్వంగా చెప్ప గలను. కేవలం తెలంగాణ ఏర్పడటమే కాదు, హైదరాబాద్ తెలం గాణకే చెందాలని ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్య కర్తలు మాత్రమే చెప్పారు. కానీ మాకు కూడా న్యాయం చెయ్యం డని అడుగుతున్నారు. 15 వేల కోట్ల ‘సర్‌ప్లస్’ ఆదాయమున్న హైదరాబాద్ వల్ల తెలంగాణ లోటు భర్తీ అవుతుంది గానీ, సీమాంధ్ర లోటు ఎవరు పూడుస్తారు. కేంద్ర ప్రభుత్వమే లోటు భర్తీ చెయ్యాలి. హోంమంత్రిగారు కేవలం మాట చెప్తే కాదు, ఆ మొత్తం కేటాయింపు జరపాలి.
రెండోమాట వారడిగేది ఏమిటంటే, హైదరాబాద్‌లో 148 సంస్థలున్నాయి. పదేళ్లు ఉమ్మడి రాజధాని. వారికి కూడా ఏవైతే సంస్థల నిర్మాణాలు జరుపుకోవాల్సి ఉందో, వాటికి ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ ఎఫ్రూవల్ మంజూరు చేసి ఎంతో కొంత సొమ్ము కూడా ఇన్‌టర్మ్ బడ్జెట్‌లో కేటాయించమని...
మూడో విషయం - పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు చేశారు. దానికి సంబంధించి ఏ మండలాలు ట్రాన్స్‌ఫర్ చెయ్యాలో మా నాయకుడు వెంకయ్యనాయుడుతో ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరినట్లు మా దగ్గర జైరాంరమేష్ ఉత్తరం కూడా ఉంది. కానీ కేబినెట్‌లో అది మారిపోయింది. మన మధ్య జరిగిన ఒప్పందాన్ని పూర్తిగా అమలు చెయ్యాలి.
అందుకే, అధ్యక్షా! తెలంగాణ ఏర్పడాలి... హైదరాబాద్ తెలంగాణలోనే ఉండాలి. సీమాంధ్రకూ న్యాయం జరగాలనేదే నేను చెప్పాలనుకుంటున్నా. ఇవన్నీ బిల్లులో రావాలి అనేదే నా కోరిక.
నాలుగో మాట: ఈ బిల్లులో చట్టపరమైన లోపముంది. రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్‌కి కొన్ని అధికారాలిస్తున్నారు. ఈ విధమైన పనిచెయ్యాలంటే రాజ్యాంగ సవరణ చెయ్యాలి. మేము ప్రభుత్వానికి చెప్పాం. మీరు మామూలు బిల్లు కాకుండా రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టండి, మేము పాస్ చేయిస్తా మని.. తప్పుడు బిల్లు వద్దు అసలైన బిల్లు ప్రవేశపెట్టండని చెప్పాం.
నేనింకో మాట మా తెలంగాణ సహచరులతో చెప్పదలచు కున్నా... ఈ బిల్లు పాసయ్యాక బైటకు వెళ్లి ఒకపాట పాడటం మొదలుపెడ్తారు ‘‘కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది’’ అని. ఆ గొంతుతో మీరు గొంతు కల పొద్దు.
ఒకవేళ సోనియమ్మను మరిచిపోకూడదనుకుంటే ఈ చిన్నమ్మను కూడా మరిచిపోవద్దు. మేము కీర్తి పొందాలని ఈ బిల్లును సమర్థిం చడం లేదు. మా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఇచ్చిన మాట మేరకు సమర్థిస్తున్నాం. మా అగ్రనేత అద్వానీ గారు జన చైతన్య యాత్రలో ఇచ్చిన మాట మేరకు తెలంగాణను సమర్థిస్తున్నాం. మా అధ్య క్షుడు, మా అద్వానీ గారిచ్చిన వాగ్దానాల అమలు కోసం, మా విశ్వ సనీయత నిరూపించుకోవటం కోసం ఈ బిల్లుకు మద్దతిస్తున్నాం. కానీ హోంమంత్రిగారు ఈ చర్చకు సమాధానమిచ్చే వేళ, సీమాం ధ్రకు న్యాయం కోసం నేను ప్రస్తావించిన విషయాలను ఈ బిల్లులో పొందుపర్చగలిగితే, సీమాంధ్ర వారు కూడా సంతోషిస్తారు. ఒకవేళ అలా జరగకపోతే నేనిక్కడ నిలబడి మీకు నమ్మకం కలిగేలా చెప్తున్నా రాబోయే ప్రభుత్వం మాది, మేము న్యాయం చేస్తాం, ‘‘సీమాంధ్ర ప్రజలారా ఆందోళన చెందకండి. మీ భద్రత గురించిన మీ గురించిన ఆలోచన మేము చేస్తాం’’ అని నమ్మబలుకుతూ, మేమీ బిల్లును సమర్థిస్తున్నాం. గెలిపిస్తున్నాం
- ధన్యవాదాలు.
ఉండవల్లి అరుణ్ కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు, a_vundavalli@yahoo.com