
పరిపూర్ణ స్వీయచరిత్రలో ఒక పేజీ
నేను పోతే పిల్లల గతేంటి? వాళ్లని కనీసం దగ్గరికి తియ్యని ఈ తండ్రి ఎలా రక్షిస్తాడు? తల్లిని అయిన నేను నిర్దయగా వాళ్లని వదిలి వెళ్లడం ఏం న్యాయం? నిజానికి పిల్లలు తమకు తాముగా వచ్చారా ఈ లోకంలోకి? పెద్దలమేగా తీసుకొచ్చింది? అలాంటప్పుడు వాళ్లను దిక్కుమాలిన వాళ్లను చేసి వెళ్లిపోవడం ఎంత దుర్మార్గం?
మా కామ్రేడ్(దాసరి నాగభూషణరావు) బాగా మితభాషి. ఇంట్లో వున్నప్పుడూ, ఇంటి సంబంధ విషయాల్లోనూ ఈ రీతి మరికొంత అధికంగా వుండేది. వారాల పర్యటనల తరువాత ఇంటికి చేరినా అనునయ పలకరింపులు శూన్యం! అయితే ఇంటికైనా, ఆఫీసుకైనా వస్తుండే వారితో సంభాషణలు ధారాళంగా సాగుతుండేవి. భార్యకూ, బిడ్డలకూ చనువు బొత్తిగా ఇవ్వని ఈయనగారి ఈ రీతి అతని భూస్వామ్య లక్షణంగా అనిపించేది నాకు. ఆ ఇళ్లల్లో స్త్రీలకు తగు స్థానం ఉండదు, గౌరవం ఉండదు. మగాళ్లకు వీలైనంత దూరంగా వుంచడం రివాజే. అయితే అన్నింటా సమత్వాన్ని కాంక్షించే ఆదర్శ కమ్యూనిస్టు నేతకు అవే రీతులు, అవే నీతులా?
నన్ను మిక్కిలిగా బాధిస్తుండిన సంగతి ఈయన పిల్లల్ని దగ్గరికి రానివ్వకపోవడం! వాళ్లనసలు పలకరించకపోవడం! ఆ తండ్రి ఇంటికొచ్చినప్పుడు, ఇంట్లో వున్నప్పుడు పిల్లలు భయంతో బిక్కుబిక్కుమనడమేమిటి? ఇంట్లోని ముందరి గది తనకు ప్రత్యేకించుకుని, తాళం వేసుకుని బయటకు వెళ్లడం, పిల్లలను అందులో కాలుబెట్టనివ్వకపోవడం ఏ బాంధవ్యానికి చిహ్న?
ఈ అంటీ ముట్టని స్థితి ఒక ఘటన సందర్భంలో అంత్యస్థితికి చేరింది. ఇంట్లో ఒక మూలగదిలో ఇంటివాళ్ల తాలూకు ‘గడమంచి’ ఒకటుండేది. మా నాలుగేళ్ల (దాసరి) అమరేంద్ర అదొక ఆటగా దాని మీద నించి కిందకి దూకినప్పుడు కిందపడి, మోచేతి కీలు తొలిగింది. పొరుగింటి సుబ్బమ్మ సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లి, చేతికి కట్టు కట్టించి తీసుకొచ్చాను. అప్పుడీయన ఇంట్లోనే వున్నా, బిడ్డను కనీసం పలకరించలేదు, ఓదార్చలేదు. చెయ్యి బాగా వాచి, కదల్చలేక బాగా ఏడ్చేవాడు. తండ్రిగారు తన గదినించి అసలు బయటికొచ్చి, పిల్లాణ్ణి చూస్తేనా?
నాకప్పుడు ఏమనిపించిందంటే మేము తన సాటికులం వాళ్లమయి వుంటే బిడ్డ మీద ప్రేమ కనబరచి, ముద్దు చేసి ఉండేవాడేమోనని. నన్ను కోరి చేసుకుంటేనేం? తనలో పసితనం నించీ జీర్ణించిన కులాధిక్యత, ఇటు నా హీనకుల దీనస్థితి నాకు పుట్టిన బిడ్డల్ని చులకనగా, నిర్లక్ష్యంగా చూచేట్టు చేస్తున్నాయేమో అని అనుకుంటుండేదాన్ని. ఇంతలో సరిగ్గా వేసవి సెలవుల ముందు సెలవు కాలంలో జీతమివ్వవలసి వస్తుందని నన్నూ, మరో ఇద్దరు టీచర్లనూ ఉద్యోగాల్నించి తొలగించారు మేనేజిమెంటు వాళ్లు. సంసారానికి తోడ్పడుతున్న ఆ నా కొంచెం సంపాదనా ఆగిపోయింది. రానురాను ఇల్లు గడవడం కష్టమవసాగింది. ఇల్లు నిప్పచ్చరంగా మారింది.
పార్టీ పనుల్లో, పర్యటనల్లో యథారీతిని నిమగ్నమై వుంటున్న దాసరిగారికి ఇంటి పరిస్థితిని గురించిన స్పృహే వుండేది కాదు. క్రమక్రమంగా బ్రతుకు ఏ రోజుకారోజు గడవడం గగనంగా వుండసాగింది. పిల్లలకు దొరుకుతున్నది అరకొర తిండి, విడవా మడవా రెండు జతల బట్టలు. అవైనా బాగా పాతబడ్డవి. అరుదుగానే అయినప్పటికీ ఆర్థిక సమస్యలు మా ఇద్దరి మధ్య కలహాలు రేపుతుండేవి. ఒక సందర్భంలో నా మూలంగా పోగొట్టుకున్న వేల కట్నాల ప్రస్తావన ఆయన నోటి వెంట వచ్చింది. తన పెండ్లి మరోవిధంగా అయివుంటే కనీసం ఏభై వేలు కట్నంగా వచ్చి వుండేవనీ, తన విలువను నేను గుర్తించడం లేదనీ అంగలార్చడం మొదలుపెట్టాడు. మరికొన్ని కఠినమైన, అవమానకరమైన మాటలతో విపరీతంగా నన్ను గాయపరిచిన దినమది. కామ్రేడ్ దాసరి ఆంతర్యం వెలుగు జూచిన దినమది.
ఆ రాత్రి నేనూ పిల్లలూ పడుకున్న మా వేరు గదిలో నిద్రపోతున్న ముగ్గుర్నీ(దాసరి శిరీష, అమరేంద్ర, శైలేంద్ర) తడిమి చూస్తూ దుఃఖించసాగాను. వాళ్లనలా వదిలేసి, పక్కింటివారి బావిలో ఎలా పడిపోవాలా అనుకుంటూ, ఎన్నడూ కలగని పిరికితనంతో, దైన్యంతో ఒకటే దుఃఖం! బాల్యంనించీ పార్టీ అందిస్తున్న స్ఫూర్తితో ధైర్యానికీ పట్టుదలకూ మారుపేరుగా వుండిన నాకు ఎందుకింత నిస్పృహ! ఎందుకింత పిరికితనం! నేను పోతే పిల్లల గతేంటి? వాళ్లని కనీసం దగ్గరికి తియ్యని ఈ తండ్రి ఎలా రక్షిస్తాడు? తల్లిని అయిన నేను నిర్దయగా వాళ్లని వదిలి వెళ్లడం ఏం న్యాయం?.
నిజానికి పిల్లలు తమకు తాముగా వచ్చారా ఈ లోకంలోకి? పెద్దలమేగా తీసుకొచ్చింది? అలాంటప్పుడు వాళ్లను దిక్కుమాలినవాళ్లను చేసి వెళ్లిపోవడం ఎంత దుర్మార్గం? పైగా వాళ్లని కడుపారా కన్న కన్నతల్లులు ఇలా చెయ్యతగునా? దయ, కరుణ అన్న స్పందనలు మగవాళ్లకు వుండకపోవచ్చు– తల్లి హృదయం స్పందించకుండా వుండగలదా? మధ్య రాత్రి వరకూ ఈ విధమైన ఆలోచనలు, సంవేదనలతో కల్లోలపడిన మనసు, క్రమంగా స్థిరత్వం పొంది, నన్ను బావి దగ్గరకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంది.