బౌన్ నిఘంటువులోబ్రౌన్ కృషి ఎంత?
పండితులను పునర్‌దర్శించడం, పెద్దలు చేసిన కృషిని పునర్‌మూల్యాంకనం చేయడం జిజ్ఞాసువులు తరచూ చేసే పని. ఇప్పుడు ఇద్దరి దృష్టి సి.పి. బ్రౌన్ (1798 - 1884) వైపు మళ్లింది. బ్రౌన్‌కు మనం ఇవ్వవలసిన గౌరవం కంటే ఎక్కువ ఇస్తున్నామా ఈ ఆరాధన వెనుక వలసవాద (బానిస) ధోరణి ఉన్నదా చూడమంటున్నారు.
బౌన్ వచ్చే నాటికి తెలుగులో ఆకారాది నిఘంటువులు లేవు. అప్పటికి ఉన్న ఆంధ్రనామ సంగ్రహము, ఆంధ్ర నామశేషము... వీటిలోని మాటలు వర్గాలుగా విభజించబడ్డాయి. అంటే ఏదైనా తెలియని మాట వస్తే వెంటనే ఆ పుస్తకాలు చూసి ఆ మాటకి అర్థం తెలుసుకోవడానికి ఈ నిఘంటువులు ఉపయోగపడవు. అమరకోశంలాగే ఈ నిఘంటువులను బట్టీయం వేయాలి. తెలుగు నేర్చుకుంటున్న ఇంగ్లిష్ ఉద్యోగులకు ఇది కష్టం కనుక నిఘంటు నిర్మాణంలో పాశ్చాత్య పద్ధతిని (ఆకారాది నిఘంటు పద్ధతిని) తెలుగులోకి పట్టుకురావడం తప్పనిసరైంది. వాళ్ల అవసరం కోసం బ్రౌన్ మొదలుపెట్టిన నిఘంటువు కేవలం అతని పట్టుదల వల్ల, క్రమశిక్షణ వల్ల, అంతకన్నా ముఖ్యంగా అనేకమంది పండితుల సహాయం వల్ల చెప్పుకోదగ్గ పెద్ద నిఘంటువుగా తయారయ్యింది.
అయితే ఈ పనిలో అతనికి ఎంతమంది పండితులు, ఎంతమంది వ్యవహర్తలు తోడ్పడ్డారో మనం స్థూలంగా గ్రహించవలసిందే కాని నిక్కచ్చిగా మనకి తెలియదు. వాళ్ల పేర్లని నిఘంటు వులో రాసి వాళ్లకు పేరుపేరుగా కృతజ్ఞత చెప్పే అవసరం బ్రౌన్‌కి కలగలేదు (బ్రౌన్ తను పరిష్కరించిన ప్రతి పుస్తకంలోనూ ఠఛ్ఛీట ఝడ జఠజీఛ్ఛీఛ్ఛి అని రాయించే వాడు. ఆ సంగతి మనం గుర్తు పెట్టుకో వాలి). ఆయా మాటలకి అర్థ నిర్ణయ విషయంలో సహాయకుల బుద్ధి ఎంత పని చేసిందో బ్రౌన్ అవగాహన ఎంత తోడ్పడిందో మనం స్పష్టంగా చెప్పడానికి అవకాశాలు లేవు. మాటకి ఇంగ్లిష్‌లో అనువాదం మాత్రం బ్రౌన్‌దే. అయితే అనువాదం మాటకి ఉన్న అర్థ సూక్ష్మతని నిశితంగా పట్టుకుందా అన్న సంగతి ఇప్పటికీ ఎవ్వరూ విచారించలేదు. ఈ నిఘంటువు గురించి గిడుగు రామమూర్తి పంతులుగారి దగ్గర నుంచి దీపాల పిచ్చయ్య శాస్త్రిగారి వరకు తెలుగువాళ్లు రకరకాల అభిప్రాయాలు చెప్పారు. ఉదాహరణకి గిడుగుగారు ‘బ్రౌణ్య నిఘంటువు రచించిన పండితులు ప్రఖ్యాతులైన జూలూరు అప్పయ్య పండితులు మొదలయినవారు’ అన్నారంటే బ్రౌన్ నిఘంటువులో పండితుల ప్రమేయం చాలా ఎక్కువగా ఉందని మనకి బోధపడుతుంది. బ్రౌన్ పట్ల ఉన్న ఆరాధనా భావాన్ని పక్కనపెట్టి ఈ నిఘంటువు ఒక పెద్ద సమిష్టి కార్యమని దీనికి బ్రౌన్ పేరు పెట్టడం కేవలం వ్యవహార సౌలభ్యం కోసమని మనం గమనించాలి. కానీ ఈ నిఘంటు నిర్మాణంలో ప్రధాన దృక్పథం భాషా వ్యవహార సౌలభ్యమే అని గుర్తించి దానిని అమలు పెట్టిన గౌరవం మాత్రం ఒక్క బ్రౌన్‌కే ఇవ్వాలి.
- పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు
(మనకు తెలియని బ్రౌన్‌దొర - ఈమాట వెబ్ మేగజీన్ తాజా సంచికలో వచ్చిన ప్రధాన వ్యాసం నుంచి స్వల్పభాగం)
వ్యాసంలోని కొన్ని వ్యాఖ్యలు
{బౌన్‌కి వచ్చిన తెలుగు లండన్‌లోగాని కలకత్తా ఫోర్ట్ విలియమ్ కాలేజీలో సంస్కృతం నేర్చుకుంటున్న పండితులకుగాని ముఖ్యమైనదిగా కనిపించలేదు. అక్కడి వాళ్లు బ్రౌన్‌ని ఇండియాలో తెలుగు నేర్పే చిన్న వ్యక్తిగానే చూశారు తప్ప భారతీయ భాషల్లో ఒక స్కాలర్‌గా గుర్తించలేదు. అప్పుడే ఆ గుర్తింపు పొందాలనే తపన బ్రౌన్‌లో మొదలయ్యింది. అది 1837 నుంచి 1855 వరకు గడిపిన బ్రౌన్ జీవితంలో ముఖ్య ఆశయం.
{బౌన్ తెలుగు దేశానికి అధికారిగా, దొరగా వచ్చాడు. తన కింద పని చేసే పండితులను సేవకులుగానే చూశాడు. వాళ్లందరూ బ్రౌన్‌ను మహారాజుగానే చూశారు. బ్రౌన్ గొప్ప పరిపాలనా దక్షుడు. తన కింద ఉన్నవాళ్లను ఎక్కడ ఉంచాలో చూసుకొని చవకగా జీతాలు ఇస్తూ ఎక్కువ పనిని రాబట్టుకోవడం బ్రౌన్‌కు బాగా తెలుసు.
మనలో పాతుకుపోయిన వలసవాదపు సాహిత్య భావాలకి ఆద్యుడు బ్రౌన్. ఆ భావాలని అంత అనాలోచితంగా మనం అందిపుచ్చుకోవడానికి కారణం మనలోని సాంస్కృతిక దైన్యం. ఆ దైన్యాన్ని యథాశక్తి పోషించి అదే విజ్ఞానంగా ప్రచారం చేసిన మహానుభావులు కట్టమంచి రామలింగారెడ్డిగారు, వీరేశలింగం పంతులుగారు. ఈనాడు వీళ్ల పాండిత్యపు పునాదుల్ని మనం సగౌరవంగా ఒప్పేసుకోవడానికి బ్రౌన్‌ని మనం ఈవేళ పొగడడానికి ప్రత్యక్ష సంబంధం ఉంది.