కన్నీరే మిగిలింది
పోలవరం ప్రాజెక్టును నేడు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా అంగీకరించడం, ఆర్డినెన్స్ ద్వారా కార్యాచరణకు పునాదులు వేయడం తెలుగుజాతి సంతోషించదగ్గ పరిణామం. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయింది. ఈ విభజన తెచ్చిన సవాళ్ల గురించి సమీక్షించుకోవాల్సిన తరుణమిది. రెండు మూడు రాష్ట్రాల రాజధానులను ఇముడ్చుకోగలిగిన హైదరాబాద్‌ను వదులుకుని నాలుగైదు లక్షల కోట్లు వెచ్చించి కొత్త రాజధానిని నిర్మించుకోవాల్సి రావడం పెద్ద విషాదం. ఇప్పుడు రాజధానిని నిర్మించుకుని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, విద్యుత్ ప్రాజెక్టులను, పారిశ్రామికాభివృద్ధినీ, గ్రామీణాభివృద్ధినీ రైతాంగ ప్రయోజనాలను కాపాడగలిగే విధానంతో ప్రణాళికలను రూపొందించుకోవాలి.
కృష్ణా, గోదావరి జలాలను అత్యధికంగా విని యోగించుకోగల సానుకూల అంశం మన రాష్ట్రానికి ఉన్నది. పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు దిగువన ఉన్నందున కరువులు, వరదలు, సంభవించినప్పుడు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారంగా ఎక్కువ నీటిని మన రాష్ట్రానికి బచావత్ కమిషన్ కేటాయించింది. ఈ నదులపై ఆధారపడి తెలంగాణ, సీమాంధ్రలలో అనేక ప్రాజెక్టులు చేపట్టారు. ఇందులో రాష్ట్రానికి తప్పనిసరిగా లభించే మిగులు జలాల ఆధారంగా నిరంతరం కరువులకు గురయ్యే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలూ, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రాజెక్టులు రూపకల్పన చేశారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, కోయిల్‌సాగర్, భీమ ప్రాజెక్టులు ఇందులో ప్రధానమైనవి.
పోలవరం ప్రాజెక్టును నేడు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా అంగీకరించడం, ఆర్డినెన్స్ ద్వారా కార్యాచరణకు పునాదులు వేయడం తెలుగుజాతి సంతోషించదగ్గ పరిణామం. ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్! హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ అన్న భావన తెలుగుజాతిలో ఏర్పడింది. లక్షల కోట్లు సీమాంధ్రులు పెట్టుబడిగా పెట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో భాగస్వాములయ్యారు. కానీ కొందరు తెలంగాణ ప్రాంత నాయకులు సీమాంధ్రులను దోపిడీదారులని, తమ హక్కుల్ని హరించి నాగరికతను ధ్వంసం చేశారని, తమ ఉద్యోగాలను లాక్కున్నారని నిరంతరం ప్రచారం చేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడిపోయాక కర్నూలుకు ఒక మారు, కర్నూలు నుండి హైదరాబాద్‌కు ఒక మారు రాజధానులు మారాయి. నేడు మరో రాజధానిని సీమాంధ్ర ప్రజలు ఎంచుకోవలసి రావడం భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఏ జాతికి జరగనంతటి అవమానం. నేడు రాజధాని కోసం కేంద్రానికి విజ్ఞప్తులు చేసుకోవడం దురదృష్టకరం. సీమాంధ్రను ఆదుకోవాలనీ, పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలనీ విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలనీ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిరావడం దారుణం. సమైక్యాంధ్రలో లభించే ఆదాయ వనరులతో తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధిని సాధించడమే ధ్యేయంగా 2004-09 మధ్య ైవె ఎస్ సాగించిన పాలనకు నేటికి ఎంత తేడా ఉందో చూస్తున్నప్పుడు తెలుగోడి ఆత్మగౌరవం చిన్నబోతోంది. సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన దీక్షలు, పోరాటాలు, పర్యటనలు, సభలు, సమావేశాలు ఒక సమరాన్నే తలపించనప్పటికి రాష్ట్ర విభజన జరిగిపోయింది. తెలంగాణ , సీమాంధ్రగా విడిపోయినప్పటికి ఇరురాష్ట్రాలలో తెలుగు ప్రజల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు పాటుపడతామని వైఎస్సార్‌సీపీ పేర్కొనడం అభినందనీయం.
రాష్ట్రంలో అభివృద్ధి ఒక ప్రాంతానికి పరిమితం కారాదు. అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వరంగ పరిశ్రమలు, విద్యాలయాలు, విమానయాన సౌకర్యాలు, ఓడరేవులు, పరిశ్రమల ఏర్పాటు చేపట్టాలి. స్మార్ట్ సిటీలు పది ప్రాంతాల్లో విస్తరిస్తాయని చెప్పడం శుభసూచకం. రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇతరులపై దుమ్మెత్తిపోయడమే ఒక విధానంగా చేపట్టే నాయకులు ఇక నుంచైనా నిర్మాణాత్మాక కార్యక్రమాలకు, విలువలతో కూడిన రాజకీయాలకు చోటుయిచ్చి ప్రజలలో భవిష్యత్ పట్ల ఆశను, ఆసక్తిని కల్పించాలి.
(వ్యాసకర్త కదిలిక సంపాదకుడు)