దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేరళ, తమిళనాడు సీఎంలు విజయన్, స్టాలిన్, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి కేంద్రం నిరంతర మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. రాష్ట్ర విభజన చట్టంలో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున అన్ని విధాలా కేంద్రం మద్దతు అవసరమని పేర్కొంది.
తిరువనంతపురంలో శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. విద్యుత్, అటవీ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో కూడిన అధికారుల బృందం పాల్గొంది. ఈ సమావేశంలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్నా, ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కానందున రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటి అమలు, పర్యవేక్షణ కోసం తగిన సాధికారతతో కూడిన ప్రభావవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రి బుగ్గన ప్రస్తావించిన అంశాలు ఇలా ఉన్నాయి.
ఉమ్మడి ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలి
విభజన నేపథ్యంలో ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి చట్టంలో, అప్పటి ప్రధాని పార్లమెంట్‌లో కీలక అంశాలపై హామీ ఇచ్చారు. దాదాపు దశాబ్ద కాలం గడుస్తున్నా అనేక కీలకమైన హామీలు అమలు కాలేదు. ఫలితంగా రాష్ట్రం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలి.
► రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని ఉమ్మడి మూడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఆ జిల్లాలకు ప్రత్యేకంగా అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వనున్నట్లు విభజన చట్టంలో పేర్కొనడమే కాకుండా పార్లమెంట్‌లో అప్పటి ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు. బుంధేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.24,350 కోట్లకు ప్రణాళికా సంఘం సవివరమైన ప్రాజెక్టు రిపోర్టును కేంద్రానికి సమర్పించింది. అయితే కేంద్ర ప్రభుత్వం రూ.2,100 కోట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం నీతి ఆయోగ్ దగ్గర పెండింగ్‌లో ఉంది. జానాభా, ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకుని బుంధేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ కింద ఏడు జిల్లాలకు రూ.25,000 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి.
► రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులకు.. పీఎంకేఎస్‌వై సవరించిన మార్గదర్శకాల కింద మద్దతు ఇవ్వాలి. ఈ రెండు పథకాల వల్ల కొత్త ప్రాంతానికి నీటి పారుదల సౌకర్యం, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరాకు అవకాశం కలుగుతుంది. తద్వారా ఈ ప్రాంతాలను పీడిస్తున్న కరువు, పేదరికం, నిరుద్యోగ సమస్య శాశ్వతంగా దూరం అవుతుంది.
పారిశ్రామిక రాయితీలు పొడిగించాలి
► విభజనతో ఏపీ హైదరాబాద్‌ను కోల్పోవడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు లేవు. అందువల్ల రాష్ట్రాభివృద్ధి అవకాశాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో విభజన చట్టంలోని సెక్షన్ 94 కింద (2) రాష్ట్రంలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల కాలానికి పారిశ్రామిక రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. అలా కాకుండా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల తరహాలో పారిశ్రామిక రాయితీలను పొడిగించాలి.
► విభజన చట్టంలోని షెడ్యూల్ 13లో విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రకటించింది. వీలైనంత త్వరగా రైల్వే జోన్ ఏర్పాటుకు దక్షిణాది రాష్ట్రాల మండలి చైర్మన్ హోదాలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం.
► విభజన చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం వివిధ సంస్థల ఆస్తుల విభజన కోసం ఉత్తర్వు జారీ చేసే అధికారం కేంద్రానికి ఉంది. విభజన జరిగి పదేళ్లు గడుస్తున్నా సంస్థల ఆస్తుల విభజన పూర్తి కాకపోవడంతో పరిపాలన పరమైన ఇబ్బందులను రాష్ట్రం ఎదుర్కొంటోంది. పౌర సేవలపైన ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తన అధికారాలను వినియోగించి త్వరగా ఆస్తుల పంపిణీ పూర్తికి ఆదేశాలు జారీ చేయాలి.
► విభజన చట్టంలోని సెక్షన్ 93 కింద షెడ్యూల్ 13లో జాతీయ స్థాయి ప్రాముఖ్యత గల వ్యవసాయ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రూ.135 కోట్ల సాయం అందించి రాష్ట్ర వ్యవసాయ యూనివర్శిటీనే జాతీయ స్థాయి యూనివర్సిటీగా పరిగణించాలని సూచించింది. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయినందున జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
► విభజన అనంతరం రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు రెవెన్యూ లోటు గ్రాంటును రాష్ట్రానికి ఇవ్వాలి. ఈ గ్రాంటు మంజూరులో జాప్యం వల్ల రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం పడుతోంది.
ఆస్తుల పంపిణీపై ఇద్దరు సీఎస్‌లతో భేటీ
విభజన చట్టంలోని షెడూŠయ్‌ల్స్‌లో గల ఇన్‌స్టిట్యూషన్స్ ఆస్తులు, అప్పుల పంపిణీలో జాప్యంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. హోం శాఖ కార్యదర్శికి సూచించారు. చట్టంలోని నిబంధనల మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో చర్చించి.. ఆస్తుల పంపిణీ అంశాన్ని పరిష్కరించాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment