
అగ్ని.. ఆజ్యం.. ఆజాం
ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజాం ఖాన్ అంటే వివాదాల పుట్ట...
ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజాం ఖాన్ అంటే వివాదాల పుట్ట. ఆయన పెంచుకునే పశువులు ఒకసారి ఎటో వెళ్లిపోతే పోలీసు సిబ్బందిని నియమించి వెతికించాడు. అవి దొరికాక పోలీసు వారే స్వయంగా తమ వాహనాలలో ఎక్కించి తెచ్చి మరీ గౌరవ మంత్రిగారికి అప్పగించారు.
ఇప్పుడు టిప్పు సుల్తాన్ గొడవతో కర్ణాటక మండిపోతోంది. టిప్పు ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా చేయడం బీజేపీ తదితర సంస్థలకు ఇష్టం లేదు. సరే, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. ఆజాంఖాన్ మోదీని ఓ కోరిక కోరారు. బ్రిటన్ మ్యూజియంలో టిప్పు ఉంగరం ఒకటి ఉందట. దానిని మోదీ వచ్చేటప్పుడు వెంటబెట్టుకు రావాలట.
ఎందుకంటే, దాని మీద ‘రామ్’ అన్న అక్షరాలు చెక్కి ఉంటాయట. మోదీ దానిని తెచ్చి తన పార్టీ కార్యకర్తలకు చూపాలని ఆజాం విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది గొడవ చల్లార్చడానికా; ఆజ్యం పోయడానికా? సరే, పనిలో పనిగా కోహినూరు వజ్రాన్ని కూడా వెంటబెట్టుకురమ్మని ఆజాం కోరారు.