సర్కారీ కిక్కు.. చేస్తుందా మేజిక్కు? | Dateline Hyderabad | Sakshi
Sakshi News home page

సర్కారీ కిక్కు.. చేస్తుందా మేజిక్కు?

Published Tue, Apr 21 2015 11:56 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

సర్కారీ కిక్కు.. చేస్తుందా మేజిక్కు? - Sakshi

సర్కారీ కిక్కు.. చేస్తుందా మేజిక్కు?

డేట్‌లైన్ హైదరాబాద్
 
అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్‌లను పూర్తిగా తొలగించి, మద్యాన్ని నియంత్రిస్తామని టీడీపీ వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చాక ఒక ఉత్తరువు జారీ చేసి చేతులు దులుపుకుంది. అసలు బెల్ట్ షాపులు అధికారికంగా నడిచేవే కావు. వాటిని ఎత్తేస్తామని అధికారిక ఉత్తరువులు జారీ చెయ్యడం హాస్యాస్పదం. బెల్ట్ షాపులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శారీరకంగా, ఆర్థికంగా ఎంత ముప్పును కలిగిస్తున్నాయో తెలిసిందే. వాటిని నియంత్రించలేని ప్రభుత్వం మద్యం వ్యాపారంతో మద్యం మాఫియాల భరతం పట్టి, మద్యపానాన్ని నియంత్రించేస్తుందా?
 
రెండు తెలుగు రాష్ర్ట ప్రభుత్వాలకూ ఆదాయం దయ్యం పట్టింది అన్నాడొక రాజకీయ నాయకుడు ఇటీవల. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితికో లేదా తెలుగుదేశంకో చెందిన వ్యక్తి కాదని వేరే చెప్పనవసరం లేదు. దయ్యం పట్టడం ఏముంది? రెండు రాష్ట్రాలకూ ఇప్పుడు బోలెడన్ని నిధులు అవస రమే కదా? ఇటు తెలంగాణ ప్రభుత్వ రాష్ర్ట పునర్నిర్మాణ లక్ష్యాల సాధన కైనా, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానితో సహా అన్నీ కొత్తగా నిర్మించు కోవడం కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోడానికైనా డబ్బే కదా కావల సింది? ఎవరి పద్ధతుల్లో వారు ఆదాయ వనరులను మెరుగుపరుచుకోడానికి కృషి చేస్తే తప్పేంటి? దాన్ని దయ్యం పట్టిందనడం కువిమర్శనే అంటాయి రెండు ప్రభుత్వాలూ. నిజమే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పెద్దగా సహాయం అందించే స్థితిలో లేదు. అలాంటప్పుడు స్వయం సమృద్ధిని సాధించడం కోసం ఆదాయ వనరులను పెంచుకోడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు. పైగా ప్రతిష్టాత్మకమైన పనులెన్నిటినో రెండు ప్రభుత్వాలూ ప్రకటించి కూర్చున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రజా ప్రభు త్వాలు ఏర్పడి పది మాసాలు గడిచింది. కాబట్టి, ఇప్పుడే కదా మేం అధికా రంలోకి వచ్చింది, కాస్త కుదురుకోనివ్వండని మాటలు చెప్పే గడువు దాటి పోయింది . ప్రజలు ఇంకా ఎంతో కాలం ఊరుకోరు. మాటలుగాక ఇక చేతలు చూపాల్సిందేనని రెండు ప్రభుత్వాలూ గుర్తించాలి.
 
సర్కారీ మద్యంతో ఖజానాకు చికిత్స

రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు లోటు బడ్జెట్‌ను అప్ప చెప్పింది. ఆదాయ మార్గాలను అన్వేషించవలసిందే తప్పదు. అందుకు ఒక మార్గం మద్యం వ్యాపారం. మద్యం వ్యాపారం నుంచి రాష్ట్రానికి ప్రతి ఏటా బోలెడు ఆదాయం వస్తోంది. అది వేల కోట్ల రూపాయల్లో ఉంటుందనే విష యం అందరికీ తెలిసిందే . ఏ ఏటికాఏడు ఆదాయాన్ని మరింత పెంచడం కోసం ప్రభుత్వాలు పెట్టే టార్గెట్‌లూ, వాటిని పూరించడానికి ఆబ్కారీ శాఖ పడే అవస్థలూ తెలియనివి కావు. మద్యం వ్యాపారం  ప్రైవేటు వ్యక్తుల చేతుల మీదుగా సాగుతుంటేనే ఖజానాకు ఇంత ఆదాయం వస్తున్నప్పుడు మనమే ఆ వ్యాపారం ఎందుకు చెయ్యకూడదు? అనే ఆలోచన ఆంధ్రా సర్కార్ బుర్రలో మెరుపులా మెరిసింది. అంతే... ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన విద్య ప్రైవేటు పరం అయిపోతోంది,  వైద్యం ప్రైవేటు పరం అయిపోతున్నది, ఇంకా ప్రజోపయోగకర సర్వీసులు, కార్యక్రమాలు అనేకం ప్రైవేటు పరం అయిపోతున్నాయి, జవాబుదారీతనం లేకుండాపోతున్నది అని నెత్తీ నోరూ కొట్టుకుని మొత్తుకున్నా వినని ప్రభుత్వం... సమర్థత, నాణ్యతలు కొరవడ టాన్ని బూచిగా చూపి ఉచితానుచితాలు మరచి  అన్నింటిని ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వం... ఒక్క మద్యం వ్యాపారాన్ని మాత్రం తానే నిర్వహిస్తాన నడం మొదలుపెట్టింది. అందుకే అది మరింత వివాదాస్పదమైంది, పెద్ద చర్చనీయాంశం అయింది.

సర్కారీ ‘సీసా’ మన మంచికే

ప్రభుత్వ యోచనంతా ఆదాయం పెంచుకోడానికేనని అంటే అంగీకరించక పోవచ్చు. మద్యం వ్యాపారం పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఆ అల వాటును నియంత్రించే వీలుంటుంది, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడ టం వీలవుతుందని కూడా ప్రభుత్వం వాదించవచ్చు. అది కూడా ఒక విధంగా నిజమే. మన దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మద్యం వ్యాపారం ప్రభుత్వాల ఆధీనంలోనే ఉంది. కాబట్టి అలాంటి రాష్ట్రాల అనుభవాలను కూడా తెలుసుకుంటే  బాగుంటుంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మద్యం వ్యాపారం పూర్తిగా ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది. అందువల్ల ప్రయోజనాలు ఏమిటి?  అంటే... మద్యం ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అందరికీ అందుబాటులో ఉండదు, మద్యం కల్తీకి అవకాశాలు తక్కువ, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయాలు జరగడానికి వీలుంటుంది అంటూ ప్రయోజనాలను ఏకరువు పెట్టొచ్చు. కానీ ఆ రాష్ట్రాల్లో అలా మద్యపాన నియంత్రణ సాధ్యం అయ్యిందా? అంటే, అటువంటి దాఖలాలు ఏమీ లేవు. రాజకీయ సంకల్పం ఉండాలే గానీ రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం వ్యాపారంలోకి దిగకుండానే ఆ ప్రయోజనాలనన్నిటినీ సాధించవచ్చు. ప్రైవేటు రంగంలోని మద్యం అమ్మకా లకు లెసైన్స్‌లను ఇచ్చేది ప్రభుత్వాలే కాబట్టి అవి తలుచుకుంటే ఏమైనా సాధ్యమే. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో సాగుతున్న ‘‘డ్రంకెన్ డ్రైవ్’’  కార్యక్రమం ఒక మంచి ఉదాహరణ. ఈ విషయంలో పోలీసుశాఖ చూపుతున్న శ్రద్ధాసక్తులు ప్రశంసార్హమైనవి. మద్యం అమ్మకాల నియంత్ర ణలో ప్రభుత్వం కూడా ఆ సంకల్పశుద్ధిని చూపితే సత్ఫలితాలు సాధ్యమే. అంతేగానీ తాను చేయాల్సిన ప్రజోపయోగకరమైన పనులను ఎన్నిటినో వదిలేసి ప్రభుత్వమే మద్యం అమ్ముకోవాల్సిన అగత్యమేమీ లేదు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని స్వయంగా చేపట్టనున్న దని వార్తలు వెలువడ్డాయి. నిప్పు లేనిదే పొగ రాదు కదా. ఆ ఆలోచనయితే సర్కారు బుర్రను తొలుస్తున్నట్టు కనిపిస్తున్నది. అధికారిక నిర్ణయం ఇంకా జరగకపోయినా, ఆ దిశగా కసరత్తు జరిగిన మాట వాస్తవం. వచ్చే జూలై మాసం నుంచే ఏపీలో తమిళనాడు తరహా మద్యం విధానం ప్రవేశపెట్టబోతు న్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వమే స్వయంగా  రాష్ర్టమంతటా నాలుగు వేల దుకాణాలు తెరవాలని అనుకుంటున్నట్టు సమాచారం. ముందే చెప్పినట్టు కేరళ, తమిళనాడు, ఢిల్లీ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మద్యం వ్యాపారం చేస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం తమిళనాడు మద్యం విధానాన్నే ఎందుకు అనుసరించాలని అనుకుంటున్నట్టు?

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా?

ఆ విషయాన్ని అలా ఉంచి, అంతకన్నా ముందే మరో విషయం ఆలోచిం చాల్సి ఉంది. మద్యం వ్యాపారం చుట్టూ ఉన్న బలమైన, భయంకర మాఫి యాను కాదని, గట్టిగా వాటికి ఎదురు నిలిచి ప్రజలకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వాలు ఈ వ్యాపారాన్ని కొనసాగించగలవా? అన్నది జవాబు దొరకని ప్రశ్న. మద్య నిషేధం తెలుగుదేశం పార్టీ విధానం. 1994లో ఎన్టీ రామారావు ‘సంపూర్ణ మద్య నిషేధం’ నినాదంతోనే అత్యద్భుతమైన మెజారిటీ సాధించి, అధికారంలోకి వచ్చారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రత్యర్థులు ఆయన, లక్ష్మీ పార్వ తిని వివాహం చేసుకోవడాన్ని ఆయనకు వ్యతిరేకంగా ప్రచారాస్త్రాన్ని చేయడా నికి ఎంతగా ప్రయత్నించినా ‘సంపూర్ణ మద్య నిషేధం’ ఆ అంశాన్ని పక్కకు నెట్టేసిన విషయం తెలిసిందే. అది ఆచరణ సాధ్యం కాదని ఎంత చెప్పినా వినకుండా ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మద్య నిషేధం అమలు చేశారు కూడా. ఆయన అధికారంలో కొనసాగి ఉంటే ఎలా ఉండేదో కానీ, ఆయనను పదవి నుంచి తప్పించి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు మద్య నిషేధాన్ని ఎత్తేశారు. మద్య పానం విష యంలో నేటి టీడీపీ విధానం ఏమిటో స్పష్టంగా ఎప్పుడూ చెప్పలేదు. అయితే అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్‌లను పూర్తిగా తొలగించి, మద్యాన్ని నియంత్రిస్తామని ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక ఒక ప్రభుత్వ ఉత్తరువు జారీ చేసి చేతులు దులుపుకుంది. అసలు బెల్ట్ షాపులు అధికారికంగా నడిచేవి కావు. మద్యం అక్రమ విక్రయాలకు మరో పేరు బెల్ట్ షాపులు. వాటిని ఎత్తేస్తామని అధికారిక ఉత్తరువులు జారీ చెయ్యడం హాస్యాస్పదం. ‘‘డ్రంకెన్ డ్రైవ్’’వ్యవహారంలో చూపిన దృఢసం కల్పం, పట్టుదల, నిజాయితీ ఉంటే తప్ప బెల్ట్ షాపుల నిర్మూలన సాధ్యం కాదు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల శారీరక, ఆర్థిక ఆరోగ్యానికి బెల్ట్ షాపు లు ఎంత ముప్పు తెచ్చి పెడుతున్నాయో అందరికీ తెలుసు. వీటి నిర్మూలనకు తగిన యంత్రాంగమే లేదు. ఎందుకంటే ప్రభుత్వ ప్రాధాన్యాలు వేరు. బెల్ట్ షాపులను నియంత్రించలేని ప్రభుత్వం మద్యం వ్యాపారంతో మద్యం మాఫి యాల భరతం పట్టేసి, మద్యపానాన్ని నియంత్రించేస్తుందా?

పరిస్థితి ఇలా ఉండగా ఏపీ ప్రభుత్వం మద్యం వ్యాపారం స్వయంగా చెయ్యాలని, అదీ తమిళనాడు తరహాలో చెయ్యాలని యోచించడం ఎలా సముచితమో అర్థం కాదు. అధికార పార్టీకి చెందిన పది వేల మందికి ఉపా ధిని కల్పించే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వ మద్యం వ్యాపార నిర్ణయంలో భాగంగా ఉండబోతున్నదని వార్తలు వచ్చాయి. మద్యం కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు స్వీకరించి, ఆ ప్రత్యేక కంపెనీల బ్రాండ్ల మద్యాన్నే విక్రయించే పరిస్థితి ప్రభుత్వ విధానంలో కచ్చితంగా భాగమవుతుంది. ఎందుకంటే తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్నది అదే. ఏపీ ప్రభుత్వం మద్యం వ్యాపార యోచనకు స్వస్తి పలకకపోతే... వచ్చే జూలై మాసం తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతటా తెలుగుదేశం కార్యకర్తల నిర్వహణలో ‘‘ఎన్‌టీఆర్ వైన్స్,’’ ‘‘దేశం బార్ అండ్ రెస్టారెంట్’’ల బోర్డులు వెలిగిపోతుండటాన్ని చూడాల్సి వస్తుందేమో!

datelinehyderabad@gmail.com
దేవులపల్లి అమర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement