విశ్లేషణ: బ్యాంకులు వ్యవసాయానికి ఇచ్చే రుణాలు రైతాంగానికి చేరుతున్నాయా అంటే చేరటం లేదనే చెప్పవచ్చు. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. రైతాంగం అనే మాటకు అర్థం చిన్న, సన్నకారు రైతాంగం అని గుర్తుంచుకోవాలి. వాళ్లకే బ్యాంకు రుణాలు ఇచ్చి ఉంటే లక్షల మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? ప్రభుత్వ గణాంకాల ప్రకారమే రైతాంగంలో 40 శాతం మంది మాకు ఈ వ్యవసాయం వద్దు బాబోయ్ అని ఎందుకు అంటారు?
వర్షాలు పడితే పంట, పడక పోతే రైతు కడుపు మంట. స్వతంత్రం వచ్చిన కొత్తలో మన స్థూల దేశీయ ఆదాయంలో వ్యవసాయం వాటా 1947లో 51 శాతం ఉండేది. అది 2010- 11లో 15.5 శాతానికి పడిపో యింది. కాని వ్యవసాయం మీద ఆధారపడే గ్రామీణ రైతాంగం, వ్యవసాయ కూలీల సంఖ్య 70 శాతం అలాగే ఉండిపో యింది. వ్యవసాయం ఇలా సాగిలపడి పోవడానికి కార ణం ఏమిటి? రానురాను, ముఖ్యంగా 1991 తర్వాత వ్యవసాయరంగం మీద పెట్టుబడులు అవరోహరణ, పారిశ్రామిక రంగంలో అధిరోహణ జరిగింది. ఆవుకు మేత వేస్తేనే పాలిస్తుంది కదా. పోనీ, బ్యాంకులేమైనా రుణాలిస్తాయా అంటే, ఇస్తున్నాయి. కానీ ఆ ఇవ్వటం పాలకుల మాటల్లో మాత్రమే గాని చేతల్లో కాదు. బ్యాంకులు వ్యవసాయానికి ఇచ్చే రుణాలు రైతాంగానికి చేరుతున్నాయా అంటే చేరటం లేదనే చెప్పవచ్చు. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. రైతాంగం అనే మాటకు అర్థం చిన్న, సన్నకారు రైతాంగం అని గుర్తుంచుకోవాలి. వాళ్లకే బ్యాంకు రుణాలు ఇచ్చి ఉంటే లక్షల మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుం టారు? ప్రభుత్వ గణాంకాల ప్రకారమే రైతాంగంలో 40 శాతం మంది మాకు ఈ వ్యవసాయం వద్దు బాబోయ్ అని ఎందుకు అంటారు? కాగా, ఈ వ్యాసం రైతులు, బ్యాంకు రుణాలకే పరిమితమని గుర్తుంచుకోవాలి.
మాటలు ఘనం...
బ్యాంకులిచ్చే మొత్తం రుణాల్లో 40 శాతం ప్రాధాన్యతా రంగాలు- అంటే వ్యవసాయం, చిన్న పరిశ్రమలకు ఇవ్వా లని ప్రభుత్వం జాతీయ బ్యాంకులను ఆదేశించింది. ఆ 40 శాతంలో 18 శాతం వ్యవసాయరంగానికి కేటాయిం చాలి. కాని ఈ శాతం 10, 12 వద్దనే ఆగిపోతోంది. కాని సంవత్సరం ఆఖరున ప్రకటనలు ఇచ్చేటప్పుడు కొన్ని బ్యాంకులు రైతులు ఇవ్వాల్సిన పాత బాకీలేమైనా ఉంటే, ఆ మొత్తాన్ని కూడా కలుపుకొని 18 శాతం ఇచ్చేశామని ఘనంగా చెప్పుకుంటాయి! బ్యాంకులను జాతీయం చేసి నప్పుడు, రుణాలు ప్రధానంగా వ్యవసాయానికే అని ఇందిరాగాంధీ ఘనంగా చెప్పుకుంది. ఇటు బ్యాంకులు, అటు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చూస్తే, లక్షలు, కోట్లు వ్యవసాయానికి ఇచ్చినట్లు కనిపిస్తుంది.
కాని కాస్త లోతుకు పోయిచేస్తే అసలు రంగు బయట పడుతుంది. వ్యవసాయదారులు బ్యాంకుల్లో జమచేసిన మొత్తంకన్నా, తక్కువగానే వారికి రుణాలు లభిస్తున్నాయి. వ్యవసాయానికి ఇచ్చినట్లు చెబుతున్న రుణంలో రైతులు ఇవ్వాల్సిన వడ్డీ, గత ఏడాది బాకీలు అన్నీ కలుపుకొని బ్యాంకులు గణాంకాలు విడుదల చేస్తాయి. ఆ గణాంకాలు చూస్తే అబ్బో బ్యాంకులు వ్యవసాయానికి ఇతోధికంగా రుణాలు ఇస్తున్నాయని ప్రజలు అనుకోవాలి. కాని వ్యవ సాయ రుణాలు రానురాను కుదించుకుపోతున్నాయని పత్రికలు ఘోషిస్తున్నాయి. అసలు విషయమేమిటని చూడబోతే ప్రభుత్వ నిజస్వరూపం బయటపడుతుంది. అంతకుముందు తెలుసుకోవాల్సిన విషయమేమంటే వ్యవసాయ రుణాలు నేరుగా పంట పండించడాని ఇచ్చే చూస్తే రుణాలు ప్రత్యక్ష రుణాలు, మిగతావి పరోక్ష రుణా లని అంటారు. రెండూ కలిపి మొత్తం వ్యవసాయానికి ఇచ్చిన రుణాలని అంటారు. అసలు వ్యవసాయానికి ఇచ్చి న రుణాలంటే దాని నిర్వచనమేమిటి? పంట పండించ డానికి రైతులకు (వారిలో చిన్నా చితకా రైతుల నుంచి పెద్ద పెద్ద భూకామందులున్నారు) ఇచ్చిన రుణం అని మన మందరం అనుకుంటాం.
తల్లకిందులైన నిర్వచనం
ప్రభుత్వం ఈ నిర్వచనాన్ని తలకిందులు చేసి ప్రత్యక్ష, పరోక్ష రుణాలు రెండింటినీ కలిపివేసి, లేదా వాటి నిర్వ చనాలను మార్చేసి, వ్యవసాయానికి ఇచ్చిన రుణాలు ఎలా ఎక్కువెక్కువగా ఇస్తున్నాయో చూడండి అంటూ ప్రభుత్వం రైతుల, ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెట్టేసింది. వ్యవసాయరంగానికి ప్రత్యక్ష, పరోక్ష రంగాలలో ఎవరె వరికి ఇస్తున్నారో చూడండి.
టీ, కాఫీ, రబ్బర్, సుగంధ ద్రవ్యాల లాంటి తోటలకు ఇచ్చిన స్వల్పకాలిక రుణాలు.
వ్యవసాయ ఉత్పత్తులను తాకట్టుపెట్టుకొని ఇచ్చే రుణాలు.
వ్యవసాయం చేస్తున్నారనే పేరుతో (ఉదా: ద్రాక్ష, ఇతర వ్యాపార పంటలు) కార్పొరేట్, తత్సమాన మైన సంస్థలు ఇచ్చే రుణాలు.
పంటలు పండించడానికి అవసరమైన ఎరువులు, పురుగుమందులు, యంత్రాలు, పశుదాణా, కోళ్ల దాణాల్లో వ్యాపారం చేసే వారికి ఇచ్చే రుణాలు.
వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ లైన్ల నిర్మా ణానికి ఇచ్చే రుణాలు.
విద్యుత్ పంపిణీ కార్పొరేషన్లు, కంపెనీలకు ఇచ్చే రుణాలు.
బిందు సేద్యం, తుంపర సేద్య వ్యవస్థలను ఏర్పాటు చేసే డీలర్లకు ఇచ్చే రుణాలు (ఈ డీలర్లు పట్టణాల్లో ఉన్నా సరే).
అగ్రిక్లినిక్, అగ్రిబిజినెస్ చేసే సంస్థలు.
వ్యవసాయానికి రుణాలు ఇచ్చే బ్యాంకేతర సంస్థలకు ఇచ్చే రుణాలు.
వ్యవసాయోత్పత్తులను నిల్వ చేసే గోదాముల, శీతల గిడ్డంగుల నిర్మాణానికి ఇచ్చే రుణాలు.
తేనెటీగలు, పందులు, కోళ్లు, చేపలు, పాలడైరీలకు ఇచ్చే రుణాలు.
వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు (గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నా సరే).
ఈ అంశాలను చూస్తే వ్యవసాయ రుణాల పేరుతో ఎవరెవరికి నిధులు ఎందుకు వెళుతున్నాయో తేటతెల్లమ వుతుంది. బడా రైతులు, వ్యాపారులు, కార్పొరేట్లకు రుణా లిచ్చిన తర్వాత, చిన్న, సన్నకారు రైతులకు ఇవ్వడానికి ఎంత వ్యవసాయ రుణం అందుబాటులో ఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ రుణాల వ్యవహారంలో రెండు లక్షల రూపాయలలోపు రుణం పొందే వారికన్నా, భారీ మొత్తాలు తీసుకునే వారి సంఖ్య, అలాగే పట్టణాలకు ఇచ్చే రుణాలు అత్యధికం (రుణం రూపేనా, వ్యక్తుల రేపేణా).
నగరవాసులకు రుణాలు
నిర్వచనం మార్పువల్ల వాస్తవంగా పంటలు పండించే వారు వడ్డీ వ్యాపారస్తుల ఉచ్చులో పడి, అప్పు తిరిగి చెల్లిం చలేక, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే అందుకు బాధ్యత ప్రభుత్వానిదే. ఈ ధోరణి చూస్తే, ప్రభుత్వరంగ బ్యాంకులే ప్రైవేట్ రంగ బ్యాంకులుగా మారిపోతున్నా యని అనిపిస్తుంది. సరిగ్గా ఈ మార్పునే ప్రపంచ బ్యాంకు కోరుతోంది. అంటే, అమెరికా కోరిక కూడా ఇదే. బ్యాం కుల కథ ఇంకా కంచికి వెళ్లలేదు. 1990-2008 మధ్య బ్యాంకులు గ్రామీణ శాఖల ద్వారా మొత్తం వ్యవసాయ రుణాల్లో పైన ఉదహరించిన కాలంలో 55.5 శాతం నుంచి 38.4 శాతానికి తగ్గగా, నగరాలు, మహానగరాల ద్వారా 14.9 శాతం నుంచి 34 శాతానికి పెరిగాయి. (వ్యవసాయ రుణాలేమిటి పట్టణాలు నగరాలకేమిటని అడక్కండి). కేవలం మహానగరాలకే (అంటే ఢిల్లీ, కలకత్తా, మద్రాసు లాంటివి) ఇచ్చిన వ్యవసాయ రుణాలు 4 నుంచి 20 శాతా నికి పెరిగాయి. ప్రత్యక్ష రుణాలు తగ్గాయి, పరోక్ష రుణాలు పెరిగాయి. 1990-2011 మధ్య కాలంలో గ్రామీణ, పట్ట ణ, నగర ప్రాంతాల్లో వ్యవసాయ రుణాల వాటా గ్రామా ల్లో 85.1 శాతం నుంచి 66.9 శాతానికి తగ్గగా పట్టణాల శాతం 14.9 శాతం నుంచి 33.1 శాతానికి పెరిగాయంటే దాని అర్థమేమిటో వేరే చెప్పాల్సిన పనిలేదు.
ప్రభుత్వ వైఫల్యం కాదా?
పైన పేర్కొన్న వివరాలన్నీ విహంగ వీక్షణం మాత్రమే. ఈ ధోరణులకు సంబంధించిన గణాంక వివరాలు, పట్టికలు అన్నీ రిజర్వు బ్యాంకు, ప్రభుత్వంలో ఉన్న బ్యాంకింగ్ శాఖ ఇచ్చినవే. ఇది కేవలం విశ్లేషణ. వ్యవసాయ రుణం నిర్వచనం ఇంత విస్తారంగా మార్పు చేసినా ప్రభుత్వమే నిర్వచించిన 18 శాతం రుణాలు ఈ రంగానికి అందలే దంటే, ప్రభుత్వ వైఫల్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ దేశానికి సంబంధించిన గణాంకాలే. పెద్ద చేనలు, చిన్న చేపలను మింగేస్తాయంటారు. అలాగే కార్పొరేట్లు, బడా వ్యాపార సంస్థలు సింహభాగం మింగేసిన తర్వాత, 70 శాతంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మిగిలింది వదిలేసిన ఎంగిలి మెతుకులే.