ఆత్మవంచన ఎంతకాలం? | How many days to wait for changes of Toilet construction | Sakshi
Sakshi News home page

ఆత్మవంచన ఎంతకాలం?

Published Sun, Jul 12 2015 1:20 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

How many days to wait for changes of Toilet construction

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని మొత్తం స్కూళ్లలో సగానికి సగం స్కూళ్లలో ఈ  రోజుకు కూడా టాయిలెట్ వసతిలేదు. విద్యార్థినులు ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడో, తొమ్మిదిలోకి అడు గుపెట్టిన తర్వాతనో చదువుకు స్వస్తి చెబుతున్నారు. ఇందుకు ముఖ్యమైన కారణాలలో టాయిలెట్లు లేకపోవడం ఒకటి. విద్యార్థులకే కాదు మహిళా టీచర్లకూ మరుగుదొడ్డి సౌకర్యం లేని పాఠశాలలే ఎక్కువ.  
 
ఒక రోజు భీకర ప్రతిజ్ఞ. సరికొత్త దిశానిర్దేశం. సమున్నత లక్ష్య నిర్ధారణ.  అంతలోనే విస్మరణ. మరుసటి రోజు మరో ప్రతిజ్ఞ, వ్చురో ప్రమాణం, మరో లక్ష్యం. మధ్యలో రాజకీయ పుటెత్తుగడలు. వ్యూహప్రతివ్యూహాలు. ప్రత్యర్థుల నుంచి అనూహ్యమైన దాడులు. ఆత్మరక్షణ కోసం ఎదురుదాడులు. నిప్పులు చెరుగుతూ ఉపన్యాసాలు. ఆవేశంతో ఊగిపోతూ విన్యాసాలు. తమ పార్టీలనూ, ప్రాబల్యాన్నీ విస్తరించుకోవాలి. తమ అనుయాయులకు ఆర్థికంగా లబ్ధి చేకూ ర్చాలి. వైరిపక్షాన్ని బలహీనపరచాలి. అటువారిని ఇటు లాక్కోవాలి. ఆ శిబిరం ఖాళీ చేయాలి. వారిపైన నిఘా పెట్టాలి.
 
 అందుకు అవసరమైన పరికరాలు కొను గోలు చేయాలి. కోట్లు ఖర్చయినా సరే ప్రత్యర్థుల రణతంత్రం తెలుసుకోవ డానికి వారిపైన నిఘా పెట్టేందుకు విదేశీ సంస్థలకు ఎంత మొత్తమైనా చెల్లిం చాలి. రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ఏమి చేసినా తప్పులేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించైనా సరే, చట్టాలను తుంగలో తొక్కైనా సరే, అడ్డదా రుల తొక్కయినా సరే ఎదుటివారిపైన ఆధిక్యం సంపాదించాలి. ఎవరు అడ్డువ చ్చినా సరే అనుకున్నది సాధించాలి. ఇట్లా రోజులు గడిచిపోతున్నాయి. నెలలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఎన్నికలు జరిగి, రాష్ట్ర విభజన జరిగి సంవత్స రం దాటింది.  రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కొత్త ప్రభుత్వాలు సామరస్య ధోర ణిలో కాకుండా సంఘర్షణాత్మకంగానే ముందుకు పోతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రజలలో ఆవేశం రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ రంధిలో ప్రజల కనీ సావసరాలను తీర్చడానికి తగిన చర్యలు తీసుకోలేకపోతున్నాయి. ఇది అంతు లేని ఆత్మవంచన.
 
 గ్రహణం పట్టిన విద్య, ఆరోగ్యం
 విద్యకూ, ఆరోగ్యానికీ సంబంధించి అతి ముఖ్యమైన, అత్యంత ప్రాథమికమైన అంశం పాఠశాలల్లో మరుగుదొడ్లు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి బహిర్భూ మికి వె ళ్లవలసిన దుస్థితి అవమానకరమనీ, అమానవీయమనీ ప్రధాని నరేంద్ర మోదీ తన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనే స్పష్టంగా చెప్పారు. జాతి సిగ్గుతో తలవంచుకోవలసిన విషయాన్ని ఎర్రకోట ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించడమే కాకుండా మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసే ఉత్తర్వుపైన మొదటి సంతకం చేశారు. స్వచ్ఛభారత్ అభి యాన్ అంటూ నినాదం ఇచ్చారు. వాస్తవికతను ఒప్పుకున్నందుకు, అనాగరిక మైన ఆచారాలను అంతం చేయాలని సంకల్పించినందుకు మోదీని మనసారా అభినందించని భారతీయులు ఉండరు. ఫొటోల కోసం చీపురు పట్టుకొని కసువు ఊడ్చిన ముఖ్యమంత్రులూ, మంత్రులూ, రాజకీయ నేతలూ అసలు సమస్యను పట్టించుకోలేదు. రాజకీయ నేతలతో తాము సైతం అంటూ అధికా రులూ యథాశక్తి నటించారు కానీ సమస్య పరిష్కారం పట్ల శ్రద్ధ చూపలేదు. ఎక్కడ వేసిన గొంగ డి అక్కడే ఉంది. ఇందుకు కారణం ఏమిటి?
 
 మన జాతికి నిజాయితీ బొత్తిగా లేకపోవడం. మాటలకూ, చేతలకూ ఏ మాత్రం పొంతన లేకపోవడం. నిప్పులాంటివాళ్ళమంటూ బోరవిరుచుకొని ప్రకటించుకుంటూ అవినీతి పనులు అడ్డగోలుగా చేయడం. తాము చట్టాలను ఉల్లంఘిస్తూనే, రాజ్యాంగాన్ని కాలరాస్తూనే ప్రత్యర్థులను తప్పు చేస్తున్నారం టూ పరుష పదజాలంతో దూషించడం. నోటికి వచ్చిన ఆరోపణలు చేయడం. మీడియాలో విమర్శలు వచ్చినా, రాజకీయ ప్రత్యర్థులు తప్పుపట్టినా ఎదురు దాడి చేయడం. ఒక విధానాన్ని రూపొందించే ముందు సాధ్యమైనంత విస్తృ తంగా సంప్రదింపులు జరపాలని కానీ విధానం అమలు చేసే క్రమంలో దాన్ని అందరికీ వివరించాలని కానీ పట్టింపులేదు. ఏ మాత్రం అధ్యయనం లేకుండా పథకాలు ప్రకటించడం, నిధులు కేటాయిస్తున్నట్టు బహిరంగ సభలలో వాగ్దా నం చేయడం. ప్రతి నిర్ణయంలోనూ నిగూఢమైన కోణం ఉంటుంది. స్వల్ప కాలిక దృష్టి మాత్రమే కానీ సుదూరంగా ఆలోచించి విధాన నిర్ణయాలు చేస్తున్న దాఖలా లేదు. నిత్యజీవితంలో ప్రజలను వేధిస్తున్న సమస్యలను ఎట్లా పరిష్క రించాలో ప్రజాప్రతినిధులతో, అధికారులతో సుదీర్ఘంగా సమాలోచన జరిపి విధానం రూపొందించడం సమర్థులైన పాలకుల లక్షణం. అటువంటి సమస్యల జాబితాలో మొట్టమొదటి అంశం మరుగుదొడ్లు.
 
 స్తబ్దత, నిర్లిప్తత
 ప్రధాని ప్రకటనను మనస్పూర్తిగా అమలు చేయడానికి పార్లమెంటు సభ్యులూ, శాసనసభ్యులూ, ఇతర ప్రజాప్రతినిధులు ప్రయత్నించినా ఈ సమస్య చాలా వరకూ పరిష్కారమయ్యేది. నాయకులు వాగ్దానాలు చేస్తూనే ఉంటారు కానీ అవి అమలుకు నోచుకోవనే అభిప్రాయం సామాన్య ప్రజలకూ ఉన్నది. సగటు పౌరులలో సైతం ఒక రకమైన స్తబ్దత గూడుకట్టుకున్నది. నిర్లిప్తత కనిపిస్తున్నది. ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా చేసుకోవలసిన చిన్న పనులు కూడా స్వయం గా చేయకుండా కలెక్టర్లకూ, ఎంఎల్‌ఏలకూ అర్జీలు పెట్టుకుంటూ ఎదురు చూడ టం అలవాటయింది. ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలలకూ, బాలి కలకూ విడివిడిగా మరుగుదొడ్లు నిర్మించి, నీటివసతి ఏర్పాటు చేయడం అసా ధ్యమైన పని కాదు. తమ పిల్లలే స్కూళ్లలో టాయిలెట్లు లేక నానా అవస్థలూ పడుతుంటే, మూత్రపిండాలకు సంబంధించిన జబ్బులకు గురి అవుతుంటే తల్లి దండ్రులు పట్టించుకోవడం లేదు. అది ముఖ్యమైన సమస్య కాదన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకుంటున్నారు. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లో ఒక దుర్ఘటన జరిగింది. నిజానికి దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలలోనూ పతాక శీర్షికగా రావలసింది. కానీ రాజకీయాలకే అమితమైన ప్రాధాన్యం ఇస్తున్న మీడియా ముఖ్యమైన ఈ వార్తను పట్టించుకోలేదు. జార్ఖండ్‌లోని దుంకా గ్రామంలో పన్నెండో తరగతి చదువుతున్న 17 ఏళ్ల ఖుష్బూ తన ఇంట్లో మరుగుదొడ్డి లేని కారణంగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
 
 కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగు అవసరమని తండ్రి కి ఆ యువతి పదేపదే చెప్పింది. ఆమె వాదనను తల్లి కూడా బలపరించింది. కానీ టాయిలెట్  నిర్మించడానికి పెట్టే ఖర్చు తాను భరించ లేనిదనీ, అంతకంటే కూతురి పెళ్లి ఘనంగా జరిపించడానికి డబ్బు ఆదా చేయ డం ముఖ్యమనీ చెప్పి భార్య నోరు మూయించారు. బహిర్భూమికి తాను వెడు తున్నప్పుడు భార్య, కూతురు వెడితే తప్పేమిటనే భావనే కానీ వారి ఇబ్బందిని అతడు అర్థం చేసుకోలేకపోయాడు. ఖుష్బూ తన తాతగారింటికి పరుగెత్తుకుం టూ వెళ్ళి టాయిలెట్ ఉపయోగించేది. ఇంట్లో టాయిలెట్ లేకపోవడం ఆమెకు అవమానంగా, దుర్భరంగా తోచింది. అటువంటి జీవితం వ్యర్థం అనుకున్నది.
 
 ఈ దారుణం జరిగిన వారంలోనే బ్రెడ్ సొసైటీ తరఫున కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ పి చంద్రశేఖరరావు, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అధి నేత డాక్టర్ భాస్కరరావు, నేను మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాలలోని ఆరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లాం. బ్రెడ్ సొసైటీ ప్రభుత్వ పాఠశాలలో గ్రంధాలయాలు ఏర్పాటు చేసి, ప్రతి పాఠశాలకూ ఒక బీరువా, 650 పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నది. తెలంగాణలో సుమారు 200, ఆంధ్రప్రదేశ్‌లో350 స్కూళ్ళలో ఈ సదుపాయం కలిగించింది. గ్రంథాలయాల నిర్వహణ ఎట్లా ఉన్న దో చూడటంతో పాటు మరుగుదొడ్లు సవ్యంగా ఉన్నాయో లేవో తనిఖీ చేయా లన్న ఉద్దేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన ఇరుగుపొరుగు జిల్లాలలో పర్య టించాం. కర్నూలు జిల్లాలోని పెద్దపాడు, కల్లూరు గ్రామాలలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు వేయిమందికి పైగా ఉన్నారు. వారిలో ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నవారు చాలామంది ఉన్నారు. హాస్టళ్లలో కానీ స్కూళ్లలో కానీ మరుగుదొడ్లు లేవు. కర్నూలు నగరం మధ్యలో ఉన్న ఇందిరాగాంధీ జెడ్‌పీ హైస్కూలులో మాత్రం మరుగుదొడ్లు తగినన్ని ఉన్నాయి. పరిశుభ్రంగా ఉన్నాయి.  
 
 ఈ స్కూలులో 1560 మంది విద్యార్థులు న్నారు. మునిసిపల్ కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న కారణంగా కాబోలు ఈ స్కూలు నిర్వహణ బాగానే ఉన్నట్టు కనిపించింది. మహబూబ్‌నగర్ జిల్లా లోని ఉండవెల్లి, వేముల, సుగూరు గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. పిల్లలు ఉంటున్న హాస్టళ్లలో సైతం ఈ వసతి లేదు. మూడు స్కూళ్లలో కలిపి తొమ్మిది వందల మంది విద్యార్థులు ఉంటారు. మధ్యాహ్న భోజనం సమకూర్చుతున్న కాంట్రాక్టర్లకు బిల్లులు మూడు, నాలుగు మాసా లుగా చెల్లించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికులు బడుగువర్గాలకు చెందిన బాలబాలికలే. వారికి సరైన ఆహారం లేదు. కనీస వసతులు లేవు. గ్రామస్థులు పట్టించుకోరు.
 
 సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (సీడీఎస్) జూలై మొదటి వారంలో హైదరాబాద్ నగరంలో ఎనిమిది దళిత  విద్యార్థినుల సంక్షేమ హాస్టళ్లను పరిశీలించింది. మలక్‌పేట, ఉప్పుగూడ, జమిస్థాన్‌పూర్, అడ్డగుట్ట, మౌలాలీలోని ఎస్సీ గరల్స్ హాస్టళ్లలో టాయిలె ట్స్ ఉన్నాయి. కానీ ఒక్క ఉప్పుగూడ హాస్టల్‌లోనే టాయిలెట్లు సక్రమంగా పని చేస్తున్నాయి. తక్కిన హాస్టళ్లలో కొన్ని టాయిలెట్లకు తలుపులు లేవు. నీటి సరఫరా లేదు. విద్యుత్ సౌకర్యం లేదు. మరుగుదొడ్లు సవ్యంగా లేని కారణంగా విద్యార్థులు ఆలస్యంగా స్కూళ్లకు వెడుతున్నారు. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరా లలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటే చిన్న పట్టణాలూ, గ్రామాల సంగతి చెప్పనక్కరలేదు.
 
 సుప్రీంకోర్టు ఆదేశం బేఖాతరు
 నరేంద్రమోదీ ప్రధాని కావడానికి ముందే, యూపీఏ ప్రభుత్వ హయాంలోనే స్కూళ్లలో టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 2013 మార్చి చివరి నాటికి అన్ని పాఠశాలల్లోనూ మరుగుదొడ్లు నిర్మించాలనీ, నీటి వసతి కల్పించాలనీ, అన్ని టాయిలెట్లూ సక్రమంగా పని చేస్తున్నట్టు నివేదిక పంపిం చాలనీ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ సక్రమంగానే ఉన్నట్టు నివేదికలు సుప్రీంకోర్టుకు పంపించాయి. పరిస్థి తిలో మాత్రం మార్పు లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని మొత్తం స్కూళ్లలో సగానికి సగం స్కూళ్లలో ఈ  రోజుకు కూడా టాయిలెట్ వసతిలేదు.

విద్యార్థినులు ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడో, తొమ్మిదిలోకి అడు గుపెట్టిన తర్వాతనో చదువుకు స్వస్తి చెబుతున్నారు. ఇందుకు ముఖ్యమైన కార ణాలలో టాయిలెట్లు లేకపోవడం ఒకటి. విద్యార్థులకే కాదు మహిళా టీచర్లకూ మరుగుదొడ్డి సౌకర్యం లేని పాఠశాలలే ఎక్కువ. ప్రభుత్వ పాఠశాలలే కాదు అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో నడుస్తున్న అనేక ప్రైవేటు పాఠశాలల్లోనూ ఇదే దారు ణం. టాయిలెట్ సదుపాయం లేదు కనుక మంచినీళ్లు తాగకుండా, కడుపు నిండా తినకుండా స్కూళ్లకు వెడుతున్న విద్యార్థినులూ, మహిళా టీచర్లూ ఉన్నా రు. ఈ కారణంగా ఎనీమియా వంటి రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు.
 కపట మనస్తత్వాన్ని నరనరానా జీర్ణించుకున్న మనం వాస్తవాన్ని చూడ కుండా అవాస్తవిక జగత్తులో విహరిస్తూ ఉంటాం.
 
ప్రధాని ఉద్ఘోషించినా, నిధులు సమకూర్చినా స్వచ్ఛ భారతం కలగానే మిగిలిపోతుంది. పరిశుభ్రత పట్ల, ఆరోగ్యం పట్ల పట్టింపు ప్రజలందరికీ ఉన్నప్పుడే స్వచ్ఛ భారత్ కల సాకా రం అవుతుంది. ఈ ప్రాథమిక సౌకర్యం అందరికీ అందుబాటులోకి రానంత వరకూ భారత దేశం చైనా కంటే వేగంగా అభివృద్ధి చెందినా, అగ్రరాజ్యంగా అవతరించినా గర్వకారణం కాజాలదు. మనిషి పరిశుభ్రంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మనసులోని మాలిన్యం తొలగిపోవాలి. ఉన్నది లేన ట్టూ, లేనిది ఉన్నట్టూ ఊహించుకొని భ్రమలలో జీవించడం మానుకోవాలి.  ఆత్మవంచనకు స్వస్తి చెప్పాలి.   
 - కె.రామచంద్రమూర్తి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement