
సాధికారతకు సరైన సాధనం
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి భారత ప్రభుత్వం ఉమ్మడిగా అమలు చేస్తున్న ఏకీకృత శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) మొత్తం ప్రభుత్వ పథకాలలోనే తలమానికమైనది.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి భారత ప్రభుత్వం ఉమ్మడిగా అమలు చేస్తున్న ఏకీకృత శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) మొత్తం ప్రభుత్వ పథకాలలోనే తలమానికమైనది. దీన్ని సాధారణ వ్యవహారంలో అంగన్‌వాడీ పథకం అంటారు. దళితులు, గిరిజనులు, నగర మురికివాడల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 1975లో ఈ పథకాన్ని రూపొందించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రసూతి మహిళలు, తల్లులకు, 0-6 ఏళ్ల వయస్సులోనిపిల్లల సమగ్రాభివృద్ధికి ఈ పథకం ఎంతో ముఖ్యమైనది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఏకీకృత శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్)కి సంబంధించిన సామాజిక గణన ప్రాతిపదికన నేను రాసిన ‘ఉడకని మెతుకులు’ పుస్తకం ఇటీవలే ప్రచురితమైంది. ఆ జిల్లాలో ఐసీడీఎస్ పథకం అమలులో జరిగిన లోపాల గురించి ఈ పుస్తకం చర్చిస్తుంది. నా అధ్వర్యంలో అక్కడ జరిగిన విస్తృతమైన సామాజిక గణన ప్రాతిపదికన ఈ పుస్తకం రూపొందింది. అయితే ఇది కేవలం ఒక్క అనంత పురం జిల్లాకు సంబంధించినదే కాదు భారతదేశమంతటా నెలకొన్న పరిస్థితులకు ఇది సూచిక. ఈ పుస్తకం ప్రతులను అధ్యయనం కోసం కలెక్టర్లందరికీ పంపించాను.
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టి.కె. శ్రీదేవి ఐసీడీఎస్‌ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. ఈ సంవత్సరం మే 28న మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సెమినార్‌కు ఆమె నన్ను ఆహ్వానించారు. అంగన్‌వాడీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసే మార్గాలపై ఈ సెమినార్‌లో రోజు పొడవునా చర్చా కార్యక్రమం జరిగింది. మన మహిళలు, శిశువుల ఆరోగ్య.. తదితర ప్రయోజనాలు కాపాడటం కోసం సరైన సమయంలో నిర్వహించిన ఈ సెమినార్ హాజరైన అందరిలో ఎనలేని స్ఫూర్తిని కలిగించిందనడంలో సందేహం లేదు.
ఈ సందర్భంగా తెలంగాణ సీఎంను అభినందించేంత స్థాయికలిగిన వ్యక్తిని కాను కానీ, ఒకేసారి అయిదుమంది మహిళా కలెక్టర్లను ఆయన నియమించడం మాత్రం సుపరిపాలనకు సంబంధించి విప్లవాత్మక చర్య అని భావిస్తున్నాను. దీనిని నిజంగానే ఆధునిక, రాజనీతిజ్ఞత కలిగిన నాయక త్వంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంగన్‌వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని రూ. 7 వేలకు, సహాయకులకు రూ. 4,500లకు పెంచటం గుర్తించదగినది. ఈ చర్యను ఒక ప్రభుత్వాధినేత చేపట్టగలరని గతంలో ఎవరూ కలలో కూడా ఊహించలేదు. భారతదేశంలో అత్యంత కీలకమైన హక్కుల ఆధారిత కార్య క్రమమైన ఐసీడీఎస్ పథకానికి ఇది నిజంగా శుభసూచకం. ఈ రంగానికి సంబంధించి రాష్ట్రంలో మరిన్ని సంస్కరణలు జరుగగలవని ఆశిస్తున్నాను.
నేను రచించిన ఉడకని మెతుకులు పుస్తకంలో సిఫార్సు చేసినట్లుగా అంగన్‌వాడీ కేంద్రాలన్నింటినీ శిశు పరిరక్షక కేంద్రాలు గా మార్చడంలో ప్రభుత్వం విధాన రూపకల్పన చేయగలదని కూడా ఆశిస్తున్నాను. నేను రాసిన పుస్తకం కానీ, మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన సెమినార్ కానీ ఐసీడీఎస్ పథకం అమలులో జరుగుతున్న లోపాలకు ఏ ఒక్కరినీ విమర్శించడం పనిగా పెట్టుకోలేదు. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేయటాన్ని మెరుగుపర్చడం, పథకం అమలులో ముఖ్యమైన వైఫ ల్యాలు ఏమిటి? వాటిని సరిదిద్దడం ఎలా అనే విషయాలే వీటికి ప్రాతిపదిక. దేశంలోని పేదల్లోకెల్లా నిరుపేదలుగా ఉన్న మహిళలు, శిశువుల హక్కులను, ప్రయోజనాలను కాపాడటాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయత్నించవలసిన సందర్భమిది. ఐసీడీఎస్ సెమినార్‌లో నేను చేసిన కీలకోపన్యాసం వివరాలు...
తలమానికమైన పథకం ఐసీడీఎస్
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి భారత ప్రభుత్వం ఉమ్మడిగా అమలు చేస్తున్న ఏకీకృత శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) మొత్తం ప్రభుత్వ పథకాలలోనే తలమానికమైనది. దీన్ని సాధారణ వ్యవహారంలో అంగన్‌వాడీ పథకం అంటారు. దళితులు, గిరిజనులు, నగర మురికివాడల ప్రజల సంక్షే మాన్ని దృష్టిలో ఉంచుకుని 1975లో ఈ పథకాన్ని రూపొందించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రసూతి మహిళలు, తల్లులకు, 0-6 ఏళ్ల వయస్సు లోనిపిల్లల సమగ్రాభివృద్ధికి ఈ పథకం ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా ప్రసూతి మహిళల, పిల్లల భవిష్యత్ మానవ, సామాజిక అభివృద్ధికి సంబం ధించిన పథకమిది. ఈ పథకం మొత్తం మీద ఆరు సేవలను అందిస్తోంది. అవి అనుబంధ పోషకాహార, రోగనిరోధక శక్తి పెంపు, ఆరోగ్య తనిఖీ, ఆరోగ్య సంబంధ సేవలు, పోషక, ఆరోగ్య విద్య, ప్రీ స్కూల్ విద్య.
ఏకీకృత శిశు అభివృద్ధి సేవల పథకం (అంగన్‌వాడీ) రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 హామీ ఇచ్చిన విధంగా మహిళలు, పిల్లల జీవించే హక్కును నేరుగా ప్రతిబింబిస్తుంది. అందుకే అంగన్‌వాడీ కార్యక్రమం విఫలమైతే, దానిలో భాగమైన మహిళల, పిల్లల మానవ, సామాజిక అభివృద్ధి హక్కులకు ఉల్లంఘన జరిగినట్లే అవుతుంది. భారతీయ పేదలలో అత్యధిక శాతంగా నమోదైన మహిళల, పిల్లల జీవితాలకు సంబంధించిన అతి ముఖ్యమైన రంగాలపై ఈ పథకం వైఫల్యం ప్రభావం చూపుతుంది.
భారతీయ శిశువుల అత్యధిక మరణాలకు ప్రధాన కారణం పుట్టిన పసిబిడ్డ బరువు తక్కువుండటమే. నవజాత శిశువుల బరువు మన దేశంలో 2.5 కేజీల కంటే తక్కువగా ఉంటోంది. గర్భిణులలో రక్తహీనత, పోషకాహార లోపం దీనికి ప్రధాన కారణాలు. బరువు తక్కువ పిల్లలు శారీరక, మానసిక అభివృద్ధి లోపానికి గురై వారి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువ గా ఉంటుంది. ఈ లోపం కారణంగా శిశుదశలో వీరిలో కలిగే ప్రభావాలను తదనంతర జీవితంలో తొలగించడం చాలా కష్టం.
మాతా, శిశు జీవనచక్రంలో చోటుచేసుకున్న ఈ పెనులోపాలకు సమగ్ర పరిష్కారమే అంగన్‌వాడీ పథకం. పోషకాహారంపై, ఆరోగ్యంపై సమగ్ర విద్య, స్థానిక ఆహారాన్ని అందించడం, ప్రధానంగా ఐరన్ అనుబంధ ఆహా రాన్ని మహిళలకు అందుబాటులో ఉంచటం, పిల్లల వృద్ధి దశను పర్యవేక్షిం చడం వంటి నివారణ చర్యలను అంగన్‌వాడీ పథకం చేపట్టింది. అయితే అనేక రాష్ట్రాల్లో ఐసీడీసీ పథకం అమలులో వీటిని చిత్తశుద్ధితో చేపట్టలేదని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఈ లోపం కారణంగానే మహిళలు, పిల్లల్లో మానసిక, తదితర వైకల్యాలు నేటికీ కొనసాగుతున్నాయి. పైగా 69 శాతంపైగా గ్రామీణ భారత మహిళలకు 16 ఏళ్లకు లోపే పెళ్లి చేస్తున్నారని యునిసెఫ్ ఇచ్చిన సమాచారం దీనికి అదనంగా తోడవుతోంది.
తక్కువ వయస్సులో జరుగుతున్న ఇలాంటి వివాహాలు కాన్పు దశలో తీవ్ర నష్టాలకు కారణమవుతున్నాయి. ఈ ఒక్క సందేశం మనకు ఆడశిశువుల ఆరోగ్య ప్రతిపత్తికి పరిరక్షణ విషయంలో అంగన్‌వాడీ సేవల ప్రాధాన్యతను నొక్కి చెబుతోంది. ప్రసూతి సమయంలో, ప్రసవించిన అనంతరం శిశువుల తొలి మూడేళ్ల జీవితంలో అంగన్ వాడీ పథకం సమర్థంగా చేపట్టే పర్యవేక్షణ ఆ శిశువుల జీవితకాల ఆరోగ్యానికి హామీనిస్తుంది. మన ప్రభుత్వాల ఆరోగ్య, మహిళా-శిశు అభివృద్ధి శాఖల మధ్య సమన్వయలోపం నేపథ్యంలో శిశువుల జీవితంలో తొలి మూడేళ్ల కాలం పర్యవేక్షణపై అంగన్‌వాడీ కేంద్రాలు ప్రత్యేక శ్రద్ధ చేపట్టాల్సి ఉంది.
తొలి మూడేళ్లు అత్యంత ముఖ్యం
అంగన్‌వాడీ పథకం ప్రవేశపెట్టి 40 ఏళ్లు కావస్తున్నప్పటికీ శిశువు తొలి దశలో చేపట్టవలసిన సముచిత చర్యలు ఇప్పటికీ లోపభూయిష్టంగానే ఉంటు న్నాయి. ఈ నేపథ్యంలో తొలి మూడేళ్ల పర్యవేక్షణ శాశ్వతంగా కొనసాగాల న్నదే ఐసీడీసీ ‘మంత్రం’గా ఉండాలి. ఈ తరహా శిశు సంరక్షక కేంద్రం మాతా శిశువులకు సంబంధించిన అనేక హక్కులను పరిరక్షించగలు గుతుంది. గ్రామీ ణ మహిళలకు నిరంతరాయ పని కల్పించడం, మూడేళ్లు దాటిన ఆడ శిశువుల కు విద్య నేర్పడం, తల్లిపాలు తాగడం శిశువుకు హక్కుగా కల్పించడం, విద్యా హక్కుకు పునాదిగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌ను తగినరీతిలో కల్పించడం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, విద్య, మహిళా, శిశు అభివృద్ధి వంటి సంబంధిత శాఖలన్నింటినీ సమన్వయించడంలో రాజీలేని ప్రయత్నాలు చేయడం ద్వారానే అంగన్‌వాడీ పథకాన్ని మరింత పరిపుష్టం చేయగలం.
అంగన్‌వాడీతోటే సాధికారత
మన దేశంలో ప్రసూతి సమయంలో నష్టభయం లేకుండా మహిళలను కాపాడాలంటే అంగన్‌వాడీ వంటి మన సొంత పథకాలను సమర్థవంతంగా చేపట్టడమే సరైనది. అనేక కోణాల్లో అంగన్‌వాడీ పథకం మహిళల నిజమైన సాధికారతను నిర్వచిస్తోంది. దీన్ని అమలు చేస్తున్న సంస్థ మహిళా, శిశు అభివృద్ధి శాఖకు పూర్తి గౌరవం కల్పించాలి. ఎందుకంటే మన జనాభాలో 75 శాతం విషయంలో ఈ శాఖ బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహిస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఒకే సమయంలో అయిదుగురు మహి ళా కలెక్టర్లను నియమించడం, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇస్తున్న అత్యంత కనిష్ట వేతనాలను సవరించాలని నిర్ణయించడం నిజంగానే విప్లవాత్మకమైన చర్యలు. తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాలు మహిళా సాధికా రత అమలుకు శుభసూచకంలా కనిపిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి ఒక రోజంతా నిర్వహించిన ఐసీడీఎస్‌పై సెమినార్ ఈ ఆశకు భవిష్యసూచకంగా నిలబడుతోంది.
(వ్యాసకర్త : కేఆర్ వేణుగోపాల్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి)