మరణం లేని సందేశం
మానవేతిహాసంలో మహాత్ముని స్థానం సర్వోత్కృ ష్టం, మహోన్నతం. మేమాయన్ని గురించి తీర్పు చెప్ప లేనంత అపరిచితులం. మాలో కొందరికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. ప్రేమమయమైన, ప్రబల మైన ఆయన ఉన్నత వ్యక్తిత్వ ప్రభావం మాపై చాలా ఉంది. మా ప్రాణంలో ప్రాణంలా సంలీనమై ఉన్న ఆయన్ను మేమిపుడు ఘోరంగా పోగొట్టుకున్నాం. ఆయన లేని మా జీవితాలు దుర్భరం. మా మధ్య పెన వేసుకున్న గాఢానుబంధం కారణంగా ఆయన వ్యక్తి త్వాన్ని వాస్తవంగా వెలగట్టడం కష్టమే అవుతుంది. అం తటి సన్నిహిత సంబంధం లేని ఇతరులు ఆ వినయ శీలియైన శాంతిదూత అంతరంగంలో వెలిగే సజీవ అగ్నిజ్వాల విశేషాన్ని గమనించలేరు. అందుచేత ఆ రెండువర్గాలు ఆయన సమగ్ర వ్యక్తిత్వ నిరూపణలో సంపూర్ణ న్యాయం చేయలేవు.
ఈనాటి సమస్యలు, సంఘర్షణలు ప్రధాన విషయాలైనప్పుడు భవిష్యత్తులో చరిత్రకారులకు అటువంటి మనోనేత్రం ప్రధానం అవు తుందేమో, నాకు తెలియదు. సమీప భవిష్యత్తులో మాదిరిగానే, భవిష్యత్తులో సయితం ఈ సమున్నత మూర్తి ఘనమైన మర్యాదామన్ననలను అందుకోగల డనటంలో నాకు లవలేశం అనుమానం లేదు. ఆయన ప్రవచించిన సందేశ మాధుర్యాన్ని ఈనాటి కంటే రేపటి తరమే అధికంగా ఆస్వాదిస్తుంది, ఆచరిస్తుంది. ఆ సం దేశం ప్రత్యేకించి ఒక దేశానికో, ఒక వర్గానికో సంబం ధించినది కాదు.
ప్రపంచంలోని అన్ని దేశాలకూ, మాన వాళి మొత్తానికీ ఈ సత్య సందేశం అన్వయిస్తుంది. బాపూజీ తన కాలంనాటి భారతదేశానికి సంబంధిం చిన కొన్ని అంశాలకు అన్వయించి సత్యాన్ని ఉద్ఘాటించి ఉండవచ్చు. కాలమాన పరిస్థితులననుసరించి మార్పు లు సహజం. నాటి ప్రత్యేక అంశాల ప్రాధాన్యం క్రమం గా తగ్గిపోవచ్చు. కానీ మహాత్ముని సందేశ సారం దేశ, కాలాతీతమై విరాజిల్లుతుంది. తత్ఫలితంగా మానవు డిని అర్థం చేసుకోవడంలో బాపూ సందేశం కీలకాంశ మవుతుంది.
భారతదేశానికి స్వాతంత్య్రం సాధించే క్రమంలో ఆ సమయానికి అవసరమైన అనేక విషయాలను బాపూ బోధించారు. భయాన్నీ, ద్వేషాన్నీ పరిత్యజించ మన్నారు. సమైక్యత, సమత్వం, సౌభ్రాత్రం గురించీ, అణగారిన పేద జన సముద్ధరణ గురించీ, శ్రమకు ఉన్న గౌరవం, ఆత్మ ఔన్నత్యాలను గురించీ మనకు విశదీక రించారాయన. సత్యమే దైవమనీ, దైవమే సత్యమనీ పదే పదే ఉద్ఘోషించారు.
నాయకుడైనవాడు ప్రజలను నడిపించేవాడే కాదు. కొందరు ఆధునికుల ఆలోచన ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలో అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి అతడు తలవంచి నడవవలసి ఉంటుంది. అలా వంచని వాడు నేత కాలేడు. మానవాభివృద్ధికి సరైన ప్రగతిపథంలో అనుచరగణాన్ని ఎక్కువ దూరం నడిపించలేడు. తన అభీష్టాన్ని అనుసరించి ఒంటరిగా క్రియాశీలి అయితే తాను నడిపించే అనుచరులకే తాను దూరంకాక తప్ప దు. తన సహచరులు కోరుకునే స్థాయికి తనను తాను దిగజార్చుకుంటే తన ఆదర్శాన్ని తానే ఒమ్ము చేసినట్టు. తాను నమ్మిన సత్యంతో సమాధానపడినట్లవుతుంది. ఆ విధంగా సత్యంతో రాజీపడడం ప్రారంభిస్తే ఇక వాటికి ముగింపు ఉండదు. సత్యపథం చేజారిపోతుం ది. అట్టి స్థితిలో అతడేం చేయాలి? అతడు సత్యాన్నో, సత్య పార్శ్వాన్నో గ్రహించడానికి పరిమితం కారాదు. తాను దర్శించిన సత్యకాంతిని ఇతరులు కూడా దర్శిం చేలాగ చేయగల నేతే విజేత.
ప్రత్యేకించి ప్రజాస్వామ్య వ్యవస్థలో సగటు ప్రజా నాయకుడైనవాడు పరిస్థితులకు అనుగుణంగా తనను తాను చక్కదిద్దుకుంటూ ఉండాలి. తులనాత్మకంగా తక్కువ చెడులో కాలుమోపాలి. అలా సరిపుచ్చుకోక తప్పదు.
మహాత్మునిలో మహాద్భుత విషయం ఏమిటంటే, తాను నమ్మిన ఆదర్శాలనూ, భావించిన సత్యాన్నీ సం పూర్ణ రూపంలో ఆవాహనం చేశాడు. అసంఖ్యాక మానవ బిందు సమూహాన్ని సింధు రూపంగా పరివర్త నం గావించాడు. నిష్టాగరిష్టుడే గానీ, లొంగినవాడు మాత్రం కాదు. కాలానుగుణ అవసరానికి కనురెప్ప పాటు లేనివాడు. మార్పు చెందే పరిస్థితులకు అనుగు ణంగా తనను తాను మార్చుకున్నవాడు. తాత్కాలి కమైన ఈ మార్పులూ చేర్పులూ అప్రధానమైనవి. ప్రధానమైన సిద్ధాంతం వరకు ఏమాత్రం చెదరని, బెద రని వెండికొండ మహాత్మాగాంధీ. తాను చెడు అని భావించిన దానితో ఏనాడూ రాజీ పడలేదు. సమస్త భారతజాతిని సమున్నత శిఖారారోహణం గావించడం లో తాత్కాలికంగానైనా విజయం సాధించగలిగారు. చరిత్రలో అదొక మహాద్భుతమైన ఘనకార్యం. ఆ సాధించింది కొనసాగుతుందా? అది సాధించిన ఫలి తాలు కొనసాగుతాయనడంలో అనుమానం లేదు. కాని దాని శిక్షణలో కొంత ప్రతి చర్య ఉంటుంది. కొంత మంది కొన్ని పరిస్థితుల ప్రభావంతో తమ సహజ స్థితి నుంచి ఉచ్ఛస్థితికి చేరినప్పటికీ తిరిగి వెనుకటి స్థితి కంటే తక్కువ స్థితికి దిగజారిపోతారు.
మనం ఈరోజు అటువంటి సంఘటననే చూస్తున్నాం. దుఃఖభాజన మైన గాంధీజీ హత్యోదంతంతోనే అట్టి ప్రతిస్పందన మనం చూశాం. గాంధీజీ తన జీవితకాలం మొత్తం ఏ ప్రమాణాలకూ, నైతిక విలువల పరిపోషణకూ అంకిత భావంతో కృషి సాగించాడో; ఆ ప్రమాణాలూ, విలు వలూ ఇలా పతనం కావడాన్ని మించిన విషాదం ఇంకే ముంటుంది? బహుశా ఇది తాత్కాలిక దశ కావచ్చు. ప్రజలు తిరిగి యథాపూర్వ సుస్థితిని చేరుతారు. భారత దేశ ఆత్మ గంభీరమైనది. బాపూ బోధించిన ప్రధాన సూత్రాలు మన జాతీయ జీవితాన్ని పునీతం చేస్తాయ నడంలో నాకు ఎటువంటి సందేహం లేదు.
(1950 దశకంలో డీజీ టెండూల్కర్ రాసిన
‘మహాత్మా’ పుస్తకానికి పండిట్ నెహ్రూ రాసిన పీఠికలోని కొన్ని భాగాలు. తెలుగుసేత: యెనిశెట్టి సాంబశివరావు మొబైల్: 77021 74606)