పనే దైవం అనేవారు | Gandhi's personal assistant Kalyanam | Sakshi
Sakshi News home page

పనే దైవం అనేవారు

Published Thu, Jan 29 2015 10:39 PM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM

పనే దైవం అనేవారు - Sakshi

పనే దైవం అనేవారు

గాంధీజీ వ్యక్తిగత సహాయకుడు వెంకట్రావ్ కళ్యాణం
 
బాపూజీ అంటే శాంతి కపోతం. ఆ స్వాతంత్య్రమూర్తికి ప్రత్యక్ష సేవలందించారు వెంకట్రావ్ కళ్యాణం. 1944 నుండి గాంధీజీ అమరుడైన 1948 వరకు ఆయనకు కళ్యాణం వ్యక్తిగత సహాయకుడు. నాలుగేళ్లపాటు గాంధీజీ జీవిత గమనానికి సాక్షిగా నిలిచిన కళ్యాణం ఆయన గురించి ఏమంటున్నారు?  గాంధీమార్గానికి, ఆయన ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లకు ప్రత్యక్ష సాక్షి అయిన కళ్యాణం... నేడు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ‘ఫ్యామిలీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
 
గాంధీజీ దగ్గరికి ఎలా చేరానంటే..?

మహాత్మాగాంధీకి సేవలు అందించటం నా పూర్వజన్మసుకృతం. అటువంటి అపూర్వవ్యక్తిని సమీపాన్నుంచి చూశాననే తృప్తి నా మరణం వరకు ఉంటుంది. మహాత్ముడి  వ్యక్తిగత సహాయకుడిగా చివరి నాలుగేళ్లూ ఆయన్ని అంటిపెట్టుకునే ఉన్నాను. మా తల్లితండ్రులు తంజావూరుకు చెందిన వెంకట్రావు అయ్యర్, మీనాంబాళ్‌లకు 22 ఆగస్టు 1920 సిమ్లాలో నేను జన్మించాను. 21 ఏళ్ల వయస్సులో గాంధీ సేవాగ్రామ్ ఆశ్రమంలో చేరాను. ఆశ్రమంలో చేరకముందు ఆంగ్లేయుల దగ్గర పనిచేసేవాడిని. ఓ ఇంగ్లీషు అధికారి దగ్గర పనిచేస్తున్నప్పుడు గాంధీ అనే వ్యక్తి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నాడని తెలిసింది. నాకు అర్థంకాలేదు. ఎందుకు... ఎవరు పాలిస్తేనేముంది. మొఘల్స్, రాజులు, ఆంగ్లేయులు బాగానే ఉంది కదా అనిపించింది. ఎందుకంటే మేము సంతోషంగానే ఉన్నాం. స్వాతంత్య్రం వస్తే ఏమవుతుంది? మాకు తెలిసేదికాదు. అప్పుడు నేనింకా స్కూల్ పిల్లాడిని. అర్థమయ్యేదికాదు. పక్కనే ఉన్న అధికారిని అడిగాను. ఆయన ‘గాంధీ ఈజ్ రైట్’ అన్నాడు. ‘ఎందుకు?’ అన్నాను. ‘వీయార్ ఫారినర్స్,  దిస్ ఈజ్ యువర్ కంట్రీ’ అన్నారు. http://img.sakshi.net/images/cms/2015-01/81422552364_Unknown.jpgఅప్పటికీ నాకు అర్థంకాలేదు. ఆశ్రమంలో చేరిన రెండేళ్ల తర్వాత గాంధీ జైలు నుండి విడుదలవుతున్నారని తెలిసింది. ఎప్పుడూ నేరుగా చూడలేదు కాబట్టి మొదటిసారి ఆశ్రమం నుండి అందరితోపాటే నేనూ వెళ్లాను.

అక్కడ ఓ గదిలో గాంధీజీ ఓ పెద్దాయనతో మాట్లాడుతున్నారు. అప్పుడు గాంధీ కోవలం (గోచీ, పంచె) కట్టుకుని ఉన్నారు. పక్కనే వ్యక్తి లాల్చీ పైజామాలో ఉన్నారు. అప్పుడు గాంధీజీని చూసి ఆయన పనిమనిషేమో అనుకున్నాను. ఆ వ్యక్తి వెళ్లిపోయాక ఆశ్రమం వారిని పిలిచారు. అప్పుడు ఆశ్రమం వాళ్లు నన్ను పరిచయం చేశారు - ‘ఇతను తమిళుడు. ఢిల్లీ నుండి వచ్చాడు. మీకు సహాయకుడిగా ఉండేందుకు’ అని! అప్పుడు అనుకున్నాను ఈయనే గాంధీజీ అని! గాంధీజీ తెల్లవారుజామున మూడున్నరకే నిద్రలేస్తారు. ప్రార్థన చేస్తారు. ఉదయం, అదేవిధంగా నిద్ర పోయేముందు మరోసారి ప్రార్థన తప్పనిసరి. ఆశ్రమంలో అందరూ రావాల్సిందే. ఎవరైనా రాకపోతే కోపం రాదు, కానీ ఇష్టం ఉండదు. కోపం అంటే హింస. అందుకే ఆయనకు కోపం రాదు. నాకు ఉదయం ఐదుగంటలకు రోజువారి కార్యక్రమాల గురించి డిక్టేట్ చేసేవారు. ఎప్పుడైనా తప్పు టైపు చేసినా కోప్పడరు. సోమవారం నిశ్శబ్దం... ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు ఎవరితోనూ మాట్లాడరు. అప్పుడు నాకు డిక్టేషన్ రాసి ఇచ్చేవారు. ఆయన రాత ఎవరికీ అర్థమయ్యేదికాదు. మా సీనియర్లు భూతద్దంపెట్టి చూసేవారు.

గాంధీజీ నుండి నేర్చుకున్నది

క్రమశిక్షణ, శాంతి, సహనం, సుహృద్భావం, నిజాయితీ, స్వయంసేవ, దేశసేవ. తెల్లవారుజామున 3 నుండి మధ్యాహ్నం 12 వరకు ఆయనతో కలసి పనిలో గడిపేవాణ్ణి. కూరగాయలు కొన్న సందర్భమే లేదు. గార్డెనింగ్ గాంధీ నుండి నేర్చుకున్నదే. ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి. పనే దైవం అనేవారు గాంధీజీ. శుభ్రత మాత్రం ఆంగ్లేయుల నుండి నేర్చుకున్నా.
 
రాజకీయాల గురించి గాంధీజీ ఏమనేవారు...


 సర్దార్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ వాదనలు గాంధీజీకి తలనొప్పులు తెచ్చేవి. పటేల్, నెహ్రూ ఇద్దరి వాదనలు వేర్వేరుగా ఉండేవి. నెహ్రూ ముస్లిం పక్షపాతి. పటేల్ హిందూ పక్షపాతి. ఇదే వారిద్దరి మధ్య విభేదాలకు కారణమయ్యేవి. కానీ గాంధీజీకి ఇద్దరూ సమానమే. ఈ విభేదాలతో ఇద్దరూ గాంధీజీకి రాజీనామా ఇచ్చారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. మీరిద్దరూ సీనియర్లు... టాప్ లీడర్లు ఇలా చేయకూడదు. దేశం అభివృద్ధి చెందాలంటే ఇద్దరూ కలిసి ముందుకు సాగాలని హితవు చెప్పేవారు. అలా వారు కొనసాగారు.
 
గాంధీజీ హత్యకు కారణం...

గాంధీజీపై పలుమార్లు గాడ్సే హత్యాయత్నం చేశారు. ఈ విషయం తెలిసి హోంమంత్రిగా ఉన్న పటేల్ గాంధీజీ దగ్గరకు వచ్చేవారందరినీ తనిఖీచేసి పంపాలని భద్రత కల్పించారు. కానీ గాంధీజీ అందుకు నిరాకరించారు.  తనిఖీలు లేకపోవటంతో గాడ్సే తుపాకీతో వచ్చాడు. జేబులో నుండి తుపాకి తీసి కాల్చాడు. నేను గాంధీజీ పక్కనే ఉన్నాను. తూటా తగలగానే గాంధీజీ కుప్పకూలిపోయారు.
 
ప్రస్తుతం కళ్యాణం ఏం చేస్తున్నారు?

గాంధీజీ మరణానంతరం నాకు పనిలేకుండా పోయింది. అందుకే గాంధీజీ నాకేమి నేర్పాడో అది ఆచరిస్తున్నా. మోడి స్వచ్ఛ భారత్ ప్రారంభించారు. మంచిదే. కానీ, నేను 1948 నుండి పాటిస్తున్నా.
 
ప్రార్థన తప్పనిసరి. ఆశ్రమంలో అందరూ రావాల్సిందే. ఎవరైనా రాకపోతే గాంధీజీకి కోపం రాదు, కానీ ఇష్టం ఉండదు. కోపం అంటే హింస. అందుకే ఆయనకు కోపం రాదు.
 
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement