ఓ చిన్నారి డైరీ | kitty dairy | Sakshi
Sakshi News home page

ఓ చిన్నారి డైరీ

Published Mon, Jun 6 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

ఓ చిన్నారి డైరీ

ఓ చిన్నారి డైరీ

తన పుట్టినరోజు కానుకగా తండ్రి ఇచ్చిన ఆటోగ్రాఫ్ నోట్బుక్కులో ఆన్ ఫ్రాంక్(అన్నా ఫ్రాంక్) డైరీ రాయడం ఆరంభించింది. ఆ డైరీకి ‘కిట్టీ’ అని పేరు పెట్టుకొంది. ఎక్కువభాగం ఆ కిట్టీ నేస్తానికి ఉత్తరాలు రాస్తున్నట్టుగా ఈ డైరీ రాసింది. 1942 జూన్ 12న మొదలుపెట్టి, 1944 ఆగస్ట్ 1 దాకా కొనసాగించింది. మొత్తం 26 నెలలు. దాదాపుగా ఈ కాలమంతా ఆన్ కుటుంబం రహస్య జీవితం గడిపిన దశ.

 నాజీల పాలనలో యూదుల మీద జరుగుతున్న దురాగతాలకు భయపడి, స్వదేశం జర్మనీ వీడి, వీరు నెదర్లాండ్స్ చేరుకున్నారు. మరో కుటుంబం(వాన్డాన్లు)తోపాటు అక్కడ తలదాచుకున్నారు. మొత్తం ఎనిమిదిమంది. అయితే, చివరకు వారి జాడను తెలుసుకున్న నాజీల చేతికి బందీలుగా చిక్కారు. ఆన్ అక్క మార్గోట్ నీరసం వల్ల బంకర్ మీద నుండి పడిపోయి చనిపోయింది. ఆన్ టైఫస్ వల్ల మరణించింది. అప్పటికి ఆమెకు 15 ఏళ్లు. ఆన్ తండ్రి ఒట్టో ఫ్రాంక్ ఒక్కడే ఈ ఎనిమిదిమందిలోనూ బతికి బయటపడ్డాడు. రహస్య జీవితంలో ఆన్ కుటుంబానికి అండగా ఉన్న మీప్ గీజ్ వల్ల ఈ కాగితాల కట్ట ఒట్టో చేతికివచ్చింది. అలా, డచ్ భాషలో రాసిన ఈ డైరీ తొలుత 1947లో ప్రచురితమై, తర్వాత ‘ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ పేరిట 1952లో ఇంగ్లిష్లోకి అనువాదమై, ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. ‘యుద్ధం మీద కదిలించే వ్యాఖ్యానాలు చేసిన ఒక సామాన్యమైన చిన్నపిల్ల’ గొప్ప రచయితల సరసన చేరిపోయింది. అయితే, ఈ డైరీ కేవలం యుద్ధ వ్యాఖ్యానమే కాదు, తన ఆనందాలూ ఇష్టాయిష్టాలూ ఎన్నింటినో ఆన్ కిట్టీతో పంచుకుంది. అంతెందుకు, కౌమార బాలికకు తగిన లైంగిక కుతూహలాలు కూడా ఇందులో ఎన్నో ఉన్నాయి.

ఈ డైరీని తాజాగా మాడభూషి కృష్ణప్రసాద్ తెలుగులోకి అనువదించారు. ప్రచురణ: పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ; ఫోన్: 9866115655.
అందులోంచి కొన్ని భాగాలు...
జూన్ 12, 1942
నేను అనుకొన్న ప్రతిదీ నీతో పంచుకోవచ్చనుకుంటున్నాను. అలాగ నేను ఎప్పుడూ ఎవరితోనూ పంచుకోలేదు. నువ్వు నాకు అన్ని విధాలా సుఖాన్ని కలగజేసి అండగా ఉంటావనుకుంటున్నాను.
 
జూన్ 20, 1942
... నేను డైరీ ఎందుకు రాద్దామనుకుంటున్నాననే విషయానికి వస్తాను. నాకు నేస్తాలు లేరు.
నన్ను మరింత స్పష్టంగా చెప్పనియ్యి. పదమూడేళ్ల అమ్మాయి ఈ ప్రపంచంలో పూర్తిగా ఒంటరితనం అనుభవిస్తోందని ఎవరూ నమ్మరు...
1940 మే తరువాత మంచిరోజులు అరుదైపోయాయి. మొదట యుద్ధం, తరువాత లొంగుబాటు, ఆ తరువాత జర్మన్ల రాక. అప్పుడే యూదుల కష్టాలు ప్రారంభమయ్యాయి... యూదులు పసుపు పచ్చ తార ధరించాలి. వాళ్లు సైకిళ్లను మూలపెట్టాలి. వాళ్లు కారు ఉపయోగించకూడదు. తమ స్వంత కారు కూడా నడపకూడదు. వాళ్లు సాయంత్రం 3 నుండి 6 గంటల మధ్య తమకు కావలసిన వస్తువులు కొనుక్కోవాలి... వాళ్లు సినిమాలకుగాని, నాటకశాలలకు గాని, మరి ఏ ఇతర వినోద కార్యక్రమాలకు గాని వెళ్లరాదు...
 ... అమ్మమ్మ 1942 జనవరిలో చనిపోయింది. నేను ఆమె గురించి ఎంత తరచుగా ఆలోచిస్తున్నానో, ఎంత గాఢంగా ఆమెను ప్రేమిస్తున్నానో ఎవరికీ తెలియదు...
మేము నలుగురం బాగానే ఉన్నాం. ఇది జూన్ 20, 1942. నేను నా డైరీ అంకితం ఇస్తున్నాను.
 -నీ ఏన్నీ
 
జూలై 8, 1942
ప్రియమైన కిట్టీ,
ఆదివారం ఉదయం నుండి యుగాలైనట్లుంది. ఈ లోగా ఎంతో జరిగింది... కానీ చూస్తున్నావు కదా కిట్టీ నేను బతికే ఉన్నాను. అదీ అసలు విషయం అంటున్నాడు నాన్న. నేను బతికే ఉన్నాను. కానీ ఎక్కడ? ఎలాగ? అని అడగకు...
 ...కొద్దిసేపటి తరువాత మార్గోట్ వంటింటి గుమ్మం దగ్గర కంగారు పడుతూ కనిపించింది. ‘‘నాన్నకు 55 వాళ్లు రమ్మనమని నోటీసు పంపారు’’ అని చెవిలో చెప్పింది. ‘‘అమ్మ వాన్డాన్ను కలవడానికి వెళ్లింది’’ అని కూడా చెప్పింది. వాన్డాన్ నాన్న వ్యాపార భాగస్వామి.
నాన్నకు మంచిమిత్రుడు.
నేను నిర్ఘాంతపోయాను. కాన్సంట్రేషన్ కేంప్లు, ఒంటరి గదుల దృశ్యాలు, నా మనోనేత్రం ముందు ప్రత్యక్షమయ్యాయి. మేము నాన్నను అటువంటి విధికి ఎలాగ విడిచిపెట్టగలం...
మేము రహస్య స్థలంలోకి వెళ్లాలని నాన్న అనడంలో అర్థం అదే. మేము ఎక్కడ దాక్కుంటాం. నగరంలోనా? గ్రామసీమలోనా? ఇంట్లోనా? గుడిసెలోనా? ఈ ప్రశ్నలు నేను అడగడానికి అనుమతి లేదు. కానీ అవి నా బుర్రలో పరుగెడుతూనే ఉన్నాయి.
 మార్గోట్, నేనూ మా ముఖ్యమైన వస్తువుల్ని స్కూల్ బేగ్లో సర్దడం ప్రారంభించాం. మొట్టమొదట లోపల పెట్టింది డైరీయే. తరువాత గిరిజాల తిప్పేవి, జేబురుమాళ్లూ, స్కూలు పుస్తకాలు, దువ్వెన, కొన్ని పాత పుస్తకాలు లోపలపెట్టాం. రహస్యస్థానంలోకి వెళ్లే ఆలోచనలో ఉండి, నేను పిచ్చి వస్తువులన్నీ బేగ్లో పెట్టాను. కాని నాకు విచారం లేదు. నాకు బట్టల కన్న జ్ఞాపకాలే ముఖ్యం...
 
 డిసెంబర్ 22, 1943
 ప్రియమైన కిట్టీ,
 నాకు ఫ్లూ వచ్చింది. అందుచేతనే నీకు ఇవాళ్టి వరకు ఉత్తరం రాయలేదు. ఇక్కడ జబ్బు వస్తే దుర్భరం. నేను దగ్గాలనుకొంటే ఒకటి, రెండు, మూడు దుప్పట్ల కింద దూరి ఆ శబ్దాన్ని నులిమివేయడానికి ప్రయత్నిస్తాను. సాధారణంగా ఫలితం ఏమిటంటే దగ్గుతెర పోదు...
 భయంకర క్షణం ఏదీ అంటే నిశ్చయంగా డస్సెల్ డాక్టర్లాగా నా దగ్గరకు వచ్చి తన జిడ్డుతలను నా అనాచ్ఛాదిత ఛాతీపై లోపలి ధ్వనులు వినడానికి పెట్టినపుడు. ఆయన జుట్టు నాకు చక్కిలిగింతలు పెట్టింది. కానీ నేను ఉక్కిరిబిక్కిరయ్యాను. ఆయన ముప్పై సంవత్సరాల కిందట వైద్యశాస్త్రం చదివి ఉండవచ్చును. డాక్టర్ కావచ్చును. ఆయన వచ్చి నా గుండె మీద చెవి ఎందుకు ఆనించాలి? ఆయన నా ప్రేమికుడు కాదు. ఆ మాటలకు వస్తే నా లోపల ఆరోగ్యంగా ఉందో అనారోగ్యంగా ఉందో వినలేడు. ఆయన చెవుల్లో పిచికారి కొట్టాలి. ఆయనకు విపరీతమైన చెవుడు వస్తోంది...
 
 ఏప్రిల్ 3, 1944
 ప్రియమైన కిట్టీ,
 నా మామూలు అలవాటుకు వ్యతిరేకంగా ఈసారి పూర్తిగా ఆహారం గురించే రాస్తాను. ఎదుచేతనంటే అది ముఖ్యమైన, ఇబ్బందికరమైన విషయం అయిపోయింది... మేము కొన్నాళ్లు ఎండైవ్ తిన్నాం- ప్రతిరోజూ అదే. ఇసుకతో ఎండైవ్. ఇసుక లేకుండా ఎండైవ్. కాల్చిన ఎండైవ్, ఉడకబెట్టిన ఎండైవ్. తరువాత బచ్చలి. దాని తరువాత కోల్బ్రీ, దోసకాయలు, టమోటాలు, సాయర్క్రాట్ వగైరా, వగైరా.
 రోజూ సాయర్క్రాట్ తినడం అంగీకారయోగ్యం కాదు. కానీ ఆకలిగా ఉంటే తింటావు...
 ప్రతివారం గొప్ప ఆకర్షణ ఏమిటంటే లివర్ సాసేజ్, ఎండురొట్టె మీద జామ్. అయినా మేము ఇంకా బతికే ఉన్నాం. తరచు మా నిరుపేద భోజనాన్ని ఆనందంగానే తింటున్నాం.
 -నీ ఏన్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement