
విషాద భారతం
రైతు వ్యవసాయానికి అంటిపెట్టుకుని ఉండటం ముందు ముందు కష్టమౌతుందని కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ వేత్త మద్దూరు సుబ్బారెడ్డి మూడు దశా బ్దాల క్రితమే జోస్యం చెప్పారు. నీరు తదితర ఉత్పాదకాలు దాదాపుగా అవస రం లేని తిమ్మారెడ్డి ముల్లును నాటడాని కైనా రైతులు సిద్ధపడతారేగానీ పంటలు పండించరని కూడా ఆయన అన్నారు. అలాగే నేడు రైతాంగం ఇతర వృత్తులకు చేరుతోంది. దాదాపు మూడు లక్షల మం ది రైతులు ఆత్మహత్యలతో వ్యవసాయం నుంచి విముక్తి చెందారు. గణాంకాల రీత్యానే రాజకీయాలు, వార్తల్లో ప్రధానాంశంగా ఉండే భారత వ్యవ సాయ రంగపు నెత్తుటి గాథ ఇది.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతాంగానికి అందించే సహా యం బ్యాండ్ ఎయిడ్ పట్టీలు, ఉపశమనకారుల స్థాయిని మించడం లేదు. ఏ ఆశాలేని రైతాంగంలో ఆశలను చిగురిం పజేయడానికి సరిపడేంత ఆత్మవిశ్వాసాన్ని ప్రభుత్వాలు కలి గించలేకపోతున్నాయి. విపత్తులలో ఇచ్చే సహాయం సైతం తరచుగా అక్రమార్జనా సాధనంగా మారుతోంది. ఉత్తరప్ర దేశ్ ప్రభుత్వం ఇటీవల రైతులకు సహాయంగా ఇచ్చిన చెక్కు లు తిరిగొచ్చాయి. కొన్ని చెక్కులయితే ఒక భోజనం కొను క్కోడానికి కూడా సరిపోనివి!
ఢిల్లీలోని గజేంద్రసింగ్ ఆత్మహత్య దేశ అంతరాత్మను దిగ్భ్రాంతికి గురిచేసిందని అనిపించింది. కానీ అది ప్రధాని నరేంద్ర మోదీ నుంచి... ‘‘లోతుగా వేళ్లూనుకుని’’ ఉన్న వ్యవ సాయ సంక్షోభ కారణాలను గుర్తించాలి, పరిస్థితి ఇలా ఎం దుకు దిగజారిందని ప్రతి ఒక్కరూ ‘‘ఆత్మశోధన చేసుకోవా ల’’నే సందేశాన్ని మాత్రమే రాబట్టగలిగింది. ఆ ఆత్మహత్య తీవ్రస్థాయి చర్చను రేకెత్తించడం ఒక పరిహాసోక్తిలా అనిపి స్తోంది. ఎందుకంటే ఢిల్లీ రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 0.9% మాత్రమే.
మహారాష్ర్ట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో అది 11% నుంచి 33% వరకు ఉం టుంది. అక్కడే ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు జరిగాయి. రైతు ఆత్మహత్యకంటే, దాన్ని కళ్లారా చూడ్డమే మనల్ని ఎక్కు వగా కదిల్చినట్టుంది. రోజువారీ సీరి యల్లాగా దాన్ని చూపిన టీవీకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.
మోదీ ‘‘ఆత్మశోధన’’ పిలుపుతో రైతాంగం సంతృప్తి చెందుతుందనుకోను. వారికి కావాల్సింది వ్యవస్థను ప్రక్షాళ నం చేయడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారి దగ్గరికి పోవాల్సిన పనే లేకుండా బతకడానికి సరి పడా ఆదాయం. నీటిపారుదల ప్రాజెక్టులు, సబ్సిడీకి ఎరు వుల గురించి ఇంకా మాట్లాడటాన్ని వాళ్లు లెక్క చేయరు. వారు కోరేది వ్యవసాయ మార్కెట్లలో దురాశాపరులైన దళారులు అంతరించా లని. ఉత్పత్తులకు వాస్తవికమైన ధరలు, వడ్డీ వ్యాపారులను నిర్మూలించే బ్యాంకిం గ్ వ్యవస్థ కావాలని. వ్యవసాయ ఉత్ప త్తులను ‘‘పొలం నుంచి నేరుగా కంచం దగ్గరకు’’ చేర్చాల్సిన అవసరం ఉంది.
కానీ మన రాజకీయ ఉపరితల నిర్మాణం లో వ్యవసాయ మార్కెట్లు ఒక అంతస్తు. కాబట్టి అది జరిగే అవకాశాలు తక్కువ. రైతులను మృత్యువు ఒడిలోకి నెడుతున్న వి కలుపు మొక్కలను వదిలేసి పంటను మేసేస్తున్న చట్టబద్ధమైన ముళ్ల కంచెలే. రైతుకు అధిక ధరలంటే వినియోగదారుల జీవన వ్యయాల పెరుగుదలేనని అనుకోకండి. ధరలో అధిక భాగాన్ని దిగమిం గేది దళారులే. రైతులూ వినియోగదారులే. వారి ఆదా యాలు, వినియోగం ఆర్థికవ్యవస్థను శక్తివంతం చేస్తాయి.
మనల్ని మనమే కొన్ని ప్రశ్నలు వేసుకోవాల్సి ఉంది. తుపానులు, భూకంపాల్లాంటి విపత్తుల్లో తప్ప ప్రభుత్వాలు త్వరిత చర్యలకు, నిధులను వెచ్చించడానికి ఎందుకు చొరవ చూపవు? ప్రధాని చెప్పిన ‘‘లోతుగా వేళ్లూనుకున్న కారణా లే’’ నేటి సంక్షోభానికి కారణం. మరి దాని పరిష్కారానికి ఈ చొరవ చూపరేం? దళారులపై ఎందుకు చర్యలు తీసుకోరు? రైతులపై ఒత్తిడిని తగ్గించాలని వారిని ఎందుకు కోరరు?
విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు తదితరాలు వేటికైనాగానీ గ్రామీణ ప్రాంతాలకంటే నగరాలకే తలసరి కేటాయింపులు ఎక్కువ.
అదే రైతులకు తక్కువ వడ్డీకి రుణా లు, రుణమాఫీలంటే చాలు గట్టి ప్రతికూల స్పందనలు రేగు తుంటాయి. ‘సూటూ బూటూ వేసుకున్నవారికే’ అన్ని విశేష హక్కులన్నట్టు... ముడతలుపడ్డ చొక్కాల మొరటు మనుషు లకు ఏమీ అక్కర్లేదంటారు. చెల్లించలేని రుణాలకు రైతులు అత్మహత్యలు చేసుకుంటుండగా, పారిశ్రామికవేత్తలు చెల్లిం చని రుణాల విషయంలో అంతా కళ్లు మూసుకునే వ్యవస్థను మనం ప్రోత్సహించాం.
‘‘నగరవాసులమైన మనం రైతు కోసం ఏమైనా చేస్తాం, అతని భుజాల మీంచి దిగడం తప్ప’’ అని గాంధీజీ ఎప్పుడో అన్నారు. ఆ మాటలను నేను ఈ కాలానికి వర్తించేలా ‘‘ఏమైనా చేస్తామని అంటాం’’ అని మార్చ సాహసిస్తాను. చాలా మంది నేతలు, విధానకర్తలైన ఉన్నతాధికారులు సైతం రైతు నేపథ్యం నుంచి వచ్చినవారే. అయినా వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కారం చేయాలనే అభీష్టం కొరవడటమే నేటి భారతావని విషాదం.
మహేష్ విజాపుర్కర్
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, ఈమెయిల్: mvijapurkar@gmail.com))