పీవీ, మన్మోహన్ ఔర్ సోనియా! | Manmohan singh not even noticed their spoiling his privacy as a PM | Sakshi
Sakshi News home page

పీవీ, మన్మోహన్ ఔర్ సోనియా!

Published Sun, Mar 15 2015 12:47 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

పీవీ, మన్మోహన్ ఔర్ సోనియా! - Sakshi

పీవీ, మన్మోహన్ ఔర్ సోనియా!

రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసింది లగాయతు తన అధికారాన్నీ, స్వేచ్ఛనూ సోనియా, రాహుల్ హరిస్తుంటే ఆయన వారించలేదు. ఆర్థిక సంస్కరణలకు అడ్డం వస్తూ ప్రజారంజక కార్యక్రమాలను అమలు చేయాలంటూ సోనియా లేఖలు రాస్తూ వాటిని మీడియాకు రహస్యంగా అందించడాన్ని సైతం సహించారు.  
 
 ‘ఇందిరాగాంధీని తీహార్ జైలుకు తీసుకుపోతుంటే వ్యాన్‌ను మధ్యలో ఆపు చేయించి ఆవిడ మోరీ గట్టు మీద కూర్చుంది. అప్పుడు నేనూ, ఇతర కాంగ్రెస్ నాయకులూ నానా తంటాలు పడి పత్రికా విలేకరు లకూ, సంపాదకులకూ కబురు పెట్టి, వారు హుటా హుటిన అక్కడికి వచ్చేటట్టు చేశాం. అది సంచలనా త్మక సందర్భం. కాంగ్రెస్ పార్టీలో మాబోటి నాయకులందరూ ఇందిరమ్మకు అండగా నిలిచారు. ఇప్పుడు మనకు తోడు ఎవరున్నారు?’ 1996 మేలో ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత పీవీ నరసింహారావు హైదరాబాద్ చాలాసార్లు వచ్చారు. రాజ్‌భవన్‌లో దిగేవారు. తరచు కలుసుకునే అవకాశం ఉండేది. ప్రముఖ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావూ, నేనూ పీవీని కలుసుకున్నప్పుడు ఆయన మనసు విప్పి వెలిబుచ్చిన వేదన ఇది.
 
 మరో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను సీబీఐ కోర్టు బుధవారంనాడు బోనులో నిలబెట్టినప్పుడు పీవీ వ్యధ కళ్ళకు కట్టింది.. బొగ్గు నిల్వలను బిర్లాకు చెందిన హిండాల్కో సంస్థకు కేటాయించాలన్న ‘అక్రమ’ నిర్ణయంలో మన్మోహన్ సింగ్‌కు పాత్ర ఉన్నదని భావించిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్పెషల్ జడ్జి భరత్ పరాశర్ మాజీ ప్రధానికి సమన్స్ జారీ చేశారు. ఈ వ్యవహారంలో మన్మోహన్ తప్పిదం ఏమీలేదనీ, ఆయనను నిందితుడుగా పేర్కొనవలసిన అవసరం లేదనీ సీబీఐ లోగడ రెండు విడతలు నిర్ధారించినప్పటికీ న్యాయమూర్తి మాత్రం ఏ కారణం చేతనో మాజీ ప్రధానిని నిందితుడుగా పరిగణించి కోర్టుకు రావలసిందిగా ఆదేశించారు. చట్టాన్ని గౌరవించే పౌరునిగా మన్మోహన్ కోర్టుకు హాజరైనారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిజాయితీపరునిగా పేరు ప్రఖ్యాతులున్న మన్మోహన్‌సింగ్‌ను నిందితుడుగా బోను ఎక్కించడం వెనుక రాజ కీయ కుట్ర ఉన్నదంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆగ్రహించారు. ఆమె నాయకత్వంలో ఏకే ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్, చిదంబరం, షీలాదీక్షిత్, గులాంనబీ ఆజాద్ వంటి కాంగ్రెస్ హేమాహేమీలు మన్మోహన్‌సింగ్‌కు సంపూర్ణ సంఘీభావ సూచనగా అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయం నుంచి మాజీ ప్రధాని నివాసం వరకూ పాదయాత్ర చేశారు. పీవీ పట్ల సంఘీభావం లేకపోగా ఆయన పట్ల శత్రుభావాన్ని సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించింది. పీవీ, మన్మోహన్ గురుశిష్యులు. ఇద్దరూ వ్యక్తిగతంగా అవినీతికి అతీతమైనవారే. కానీ ఇద్దరూ అవినీతి కేసులలో నిందితులుగా బోను ఎక్కవలసి రావడం విశేషం.
 
 తుది వరకూ ఒంటరి పోరాటం
జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన నలుగురు లోక్‌సభ సభ్యులను కొనుగోలు చేశారన్న ఆరోపణపై ఢిల్లీ న్యాయమూర్తి అజిత్ భ ర్తోక్ పీవీకి మూడేళ్ళ కారాగార శిక్ష విధిస్తూ 2000 అక్టోబర్ 12న తీర్పు ఇచ్చారు. ఆ రోజు మాజీ ప్రధానిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్ళిన ఒకే ఒక మాజీ సహచరుడు మన్మో హన్‌సింగ్. పీవీ తనపైన వచ్చిన మూడు కేసులలోనూ కడవరకూ ఒంటరి పోరు చేయవలసి వచ్చింది. పీవీపైన పెట్టిన లఖూభాయ్ చీటింగ్ కేసు, సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు, జేఎంఎం కేసులలో చివరిది మాత్రమే బలమైనది. లఖూభాయ్ కేసులో చంద్రస్వామి నిందితుడు. పీవీ నిందితుడు కాదు. లఖూభాయ్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో తాను చంద్రస్వామికి పీవీ సమక్షంలో డబ్బు చెల్లించానని ఆరోపించాడు. ఇంకో ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పరువు తీసే దురుద్దేశంలో పత్రాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణపై పెట్టిన సెయింట్ కిట్స్ కేసులో కూడా ప్రధాన నిందితులు చంద్రస్వామి, ఆయన స్నేహితుడైన ఆయుధాల వ్యాపారి అద్నాన్ ఖషోగి.
 
 సెయింట్ కిట్స్ కాన్సలేట్ అధికారి చేత పత్రాలు ఫోర్జరీ చేయించారన్నది పీవీపైన అభియోగం. చంద్రస్వామి వంటి మార్మికుడినీ, దళారినీ దగ్గరికి తీసిన పీవీ విచక్షణారాహిత్యానికి మూల్యంగా ఆయన మెడకు ఈ రెండు కేసులూ చుట్టుకున్నాయి. దేశంలో అస్థిర పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్న సమయంలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా సరే రక్షించుకొని పూర్తికాలం పరిపాలించాలనే సంకల్పంతో చేసిన చాణక్యం మూడో కేసుకు దారితీసింది. 1993 జూలై 26న లోక్‌సభలో విశ్వాస తీర్మానం నెగ్గేందుకు జేఎంఎం ఎంపీలను కొనుగోలు చేశారనే అభియోగంతో పెట్టిన కేసులో ఎంపీలలో ఒకరైన శైలేంద్ర మహతో అప్రూవర్‌గా మారడంతో కేసు జటిలమైంది. చివరికి ఢిల్లీ హైకోర్టు మహతో సాక్ష్యం నమ్మశక్యంగా లేదని నిర్ధారించి పీవీని నిర్దోషిగా ప్రకటించింది. ఈ మూడు కేసుల నుంచీ పీవీ 2003లో నిర్దోషిగా బయటపడ్డారు. బాబ్రీమసీదు కూల్చివేత ఘటనపైన దర్యాప్తు చేసిన లిబరహాన్ కమిషన్ సైతం పీవీ తప్పు లేదని తేల్చింది. ఈ నివేదిక జస్టిస్ లిబరహాన్ 2009 జూన్ 30 వ తేదీన అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అందజేశారు. అప్పటికి అయిదేళ్ళ కిందటే పీవీ కన్ను మూశారు.
 
సోనియా సంఘీభావం వెనుక...
మన్మోహన్‌సింగ్‌ను కాపాడుకుంటామంటూ సోనియా ప్రతిజ్ఞ ఎందుకు చేశారు? ఇప్పుడు మాజీ ప్రధానికి మద్దతు తెలపకపోతే ఆయన సోనియా నివాసం నుంచి తనకు వచ్చిన చిట్టీల గుట్టు రట్టు చేస్తారనే భయం కారణం కావచ్చు. మన్మోహన్ కుమార్తె సూచించినట్టు ఆయన స్వీయచరిత్ర రాసినా రాయవచ్చు. అందులో జార్జి, అహ్మద్ పటేల్ వంటి సోనియా మనుషులు అధికారుల నియామకాలూ, బదిలీలూ, కీలకమైన ఫైళ్లపై సంతకాలూ వంటి అనేక అంశాలలో ఆమె ఆదేశాలంటూ పంపించిన సిఫార్సుల గురించి ప్రస్తావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికలలో చిత్తుగా ఓడినప్పటికీ పూర్తిగా చేవ ఉడిగిపోలేదు. రాహుల్ గాంధీ విదేశాలలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దిగువ స్థాయి పోలీసు అధికారులు ఆయన నివాసానికి విధ్యుక్తధర్మంగా వెళ్ళడంపై ఆ పార్టీ శనివారం నాడు రాద్ధాంతం చేసింది. ఈ తంతు చూస్తుంటే తన ఇంటి ముందు ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ తచ్చాడుతూ కనిపించారన్న సాకుతో చంద్రశేఖర్ ప్రభుత్వా నికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరిస్తున్నట్టు రాజీవ్‌గాంధీ ప్రకటించినప్పటి ఉదంతం గుర్తుకొస్తున్నది. పీవీ పట్ల వాజపేయికి సానుభూతి ఉన్నట్లే మన్మోహన్ పట్ల నరేంద్రమోదీకీ సద్భావం ఉంది.
 
కానీ న్యాయస్థానంలో కేసులు ఉన్నప్పుడు ప్రధానులైనా, రాష్ట్రపతులైనా చేయగల సాయం అంటూ ఏమీ ఉండదు. పైగా, బలమైన కారణం లేకుండా న్యాయమూర్తి మాజీ ప్రధానిని నిందితుడుగా నిర్ధారించరు. పరిస్థితులు అనుకూలించి ఈ కేసులో బొగ్గు మసి అంటకుండా బయటపడినప్పటికీ చరిత్ర మన్మోహన్‌సింగ్‌కు ఉదాత్తమైన స్థానం మాత్రం కేటాయించదు. కారణం ఏమిటి? ఉన్నత పదవులలో ఉన్నవారికి ఎప్పుడు పదవీ విరమణ చేయాలో తెలియాలి. అవమానాలను ఎంతవరకూ దిగమింగాలో గ్రహించాలి. మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్ళ పాటు నడిపించి అర్జున్‌సింగ్ లేఖాస్త్రాలను తట్టుకొని, సోనియాకు విధేయుడుగా ఉండటానికి నిరాకరించి ఆమె ఆగ్రహానికి గురైన పీవీ విపరీతమైన మానసిక క్షోభ అనుభవించారు. కానీ చివరి శ్వాస వరకూ ఆత్మాభిమానం కాపాడుకున్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధానిగా, విదేశాంగ విధానంలో సృజనాత్మకమైన పోకడలు పోయిన దక్షుడుగా పీవీకి చరిత్రలో గౌరవనీయమైన చోటు దక్కుతుంది.
 
చారిత్రక తప్పిదం
పీవీ రాజకీయాలలోకి తీసుకొని వచ్చిన ఉన్నతాధికారి, అధ్యాపకుడు, ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్ ప్రధానిగా పూర్తి భిన్నంగా వ్యవహరించారు. తాను సోనియా నియమించిన ప్రధానిననీ, ఆమె దయతోనే పదవిలో ఉన్నాననే స్పృహ ఆయనను క్షణం కూడా వీడలేదు. 2009 ఎన్నికల తర్వాత రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసింది లగాయతు తన అధికారాన్నీ, స్వేచ్ఛనూ సోనియా, రాహుల్ హరిస్తుంటే ఆయన వారించలేదు. ఆర్థిక సంస్కరణలకు అడ్డం వస్తూ ప్రజారంజక కార్యక్రమాలను అమలు చేయాలంటూ మన్మోహన్‌కు సోనియా లేఖలు రాస్తూ వాటిని మీడియాకు రహస్యంగా అందించడాన్ని సైతం సహించారు. మౌనంగా బాధపడుతూ ‘మౌన్‌మోహన్’ అనే పేరు తెచ్చుకొని అపహాస్యం పాలైనారే కానీ ప్రతిఘటించలేదు. అవినీతి నిరోధక ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల గోష్ఠిలో నాటకీయంగా చించివేసి ‘అట్టర్ నాన్సెన్స్’ అంటూ కటువుగా వ్యాఖ్యానించినప్పుడు మన్మోహన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన స్వదేశానికి తిరిగి రాగానే రాహుల్ ప్రవర్తనకు నిరసనగా రాజీనామా చేసి ఉన్నట్లయితే ఆయనకు చరిత్ర మెరుగైన స్థానం కేటాయించేది.
 
 అంతులేని కృతజ్ఞతాభావంతో సోనియాకు ఎదురు చెప్పలేక ప్రధాని పదవిలో బందీగా 2010 నుంచి నాలుగేళ్ళపాటు ఎందుకు ఉండిపోయారో ఆయన ఎప్పటికైనా సంజాయిషీ చెప్పవలసిందే. కనీసం తనకు తాను సమాధానం చెప్పుకోక తప్పదు. స్వలాభం లేదు. సొంత ముఠా లేదు. ఒకరిని ఉద్ధరించాలని కానీ ఒకరిపైన ప్రతీకారం తీర్చుకోవాలనీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనస్సన్యాసి. అటువంటి వ్యక్తి సోనియా, రాహుల్ మాత్రమే కాకుండా మంత్రి మండలిలోని సీనియర్ సహచరులు కూడా బహిరంగంగా అవమానించినప్పుడు పదవిని పట్టుకొని వేళ్ళాడటం అవివేకం. పీవీ మంత్రి మండలిలో ఐదేళ్ళు ఆర్థిక మంత్రి గానూ, 2004 నుంచి ఐదేళ్ళు ప్రధానిగానూ ఆర్జించిన కీర్తి యావత్తూ రెండవసారి ప్రధానిగా పని చేసిన ఐదేళ్ళలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. సమకాలీన వ్యాఖ్యాతల కంటే భవిష్యత్తులో చరిత్రకారులు మన్మోహన్‌సింగ్‌ను అంచనా వేయడంలో ఇంకాస్త ఉదారంగా వ్యవహరించవచ్చునేమో కానీ, సకాలంలో పదవి నుంచి వైదొలగకపోవడం మాత్రం చారిత్రక తప్పిదం.  
 - కె.రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement