ముసుగు ‘యుద్ధం’ | mask war across china | Sakshi
Sakshi News home page

ముసుగు ‘యుద్ధం’

Published Wed, Dec 11 2013 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM

ముసుగు ‘యుద్ధం’

ముసుగు ‘యుద్ధం’

  ‘ఉద్రిక్తతలు లేని ప్రపంచం’ ఆదర్శం మంచిదే. కానీ అదే నిజమైతే అంతర్జాతీయ మీడియా ‘ఆకలి’కి మాడక తప్పదు. ‘సిరియా,’ ‘ఇరాన్’ చప్పగా చల్లారాయన్న దిగులు లేకుండా తాజాగా ‘గగనతల రక్షణ ప్రాంతాల (ఏడీఐజెడ్) యుద్ధం’ వచ్చిపడింది. ప్రపంచ మీడియా కథనాల ప్రకారం జపాన్‌పై చైనా నవంబర్ 23న ప్రారంభించిన ఈ ‘యుద్ధం’లోకి డిసెంబర్ 8న దక్షిణ కొరియా ప్రవేశించింది. అది తన గగనతల రక్షణ ప్రాంతాన్ని 66, 500 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. గగలతల ప్రకటనలు , ఏర్పాట్లు సర్వసాధారణమైనవే. ఆ ప్రాంతంలో ప్రవేశించే విమానాలు ఆ దేశానికి తమ గుర్తిం పును, ప్రయాణ పథకాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పయనించాల్సి ఉంటుంది.
 
 

కాకపోతే చైనా, దక్షిణ కొరి యాల ఏడీఐజెడ్ ప్రకటనలు అసాధారణమైనవి. దక్షిణ కొరియా ఏడీఐజెడ్  చైనా ప్రకటించిన ‘నూతన ఏడీఐజెడ్’ లోకి విస్తరించింది. అంటే చైనా తనదిగా ప్రకటించిన ప్రాంతంలో కొంత భాగం తనదేనని దక్షిణ కొరియా బరి లోకి దిగింది. చైనా ‘నూతన ఏడీఐజెడ్’లో... దక్షిణ కొరి యా తనదంటున్న సముద్రంలో మునిగి ఉన్న ఒక పెద్ద రాయితో పాటూ జపాన్ తనవంటున్న సెనెకాకు లేదా దియోయు దీవులు కూడా ఉన్నాయి. చైనాతో స్నేహసంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో గత వారం చైనాలో పర్యటించిన అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్...  చైనా ‘ఏకపక్షంగా కవ్వింపు చర్యకు పాల్పడింది’ అని రూలింగ్ ఇచ్చారు. బీజింగ్‌లో అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్‌తో జో  రాయబారం కంటే ముందే... గత నెల 24న అంటే చైనా నూతన ఏడీఐజెడ్‌ను ప్రకటించిన మరుసటి రోజే అమెరికా ఆ వివాదాస్పద దీవులపైకి యుద్ధ విమానాలను పంపి దానికి సవాలు విసిరింది.
 
 ఈ రభసంతా తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని అపార చమురు నిక్షేపాల కోసం ఆ ప్రాంత దేశాలకు, చైనాకు మధ్య తలెత్తుతు న్న వివాదాలుగానే కనిపిస్తాయి. కానీ కావు. ఇంతవరకు సాగిన ‘యుద్ధం’ అంతా చదరంగపు తొలి ఎత్తుల్లాగా అందరికీ తెలిసిన ఎత్తులు పైఎత్తులే. కాకపోతే తెల్ల పావులతో ఆడుతున్న ఆటగాడిలా తొలి ఎత్తు వేసినది చైనా.
 అసలు ఆటంతా అమెరికా నావికా దళ యుద్ధ కళాశాలలో హాట్ టాపిక్‌గా ఉన్న ‘రివర్స్ గ్రేట్ వాల్’ వ్యూహం చెబుతుంది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన చైనా గోడను ఒకప్పుడు ఆ దేశ రక్షణ కోసం నిర్మించారు. దానికి విరుద్ధమైన సముద్రపు చైనా గోడను నిర్మించాలని అమెరికా రక్షణశాఖ కలగంటోంది. దానికి ‘అదృశ్య వ్యతిరిక్త చైనా కుడ్యం’ అని నామకరణం కూడా చేసింది. జపాన్, కొరియా ద్వీపకల్పాల మీదుగా ఉత్తరాన ఉన్న హాంకాంగ్, ఫిలిప్పీన్స్, ఇండోైచె నాల వరకు, అక్కడి నుంచి ఆస్ట్రేలియా ఖండం వరకు అది విస్తరిస్తుంది. ఈ అదృశ్య కుడ్యం కల నిజమైతే చైనా సముద్ర వాణిజ్యం దాదాపు మొత్తం నిలి చిపోతుంది. అలాగే దాని నావికా బలం కాళ్లు కట్టేసిన ట్టే అవుతుంది. అందుకే ‘చైనా డెయిలీ’ పత్రిక సంపాదకీయం ఈ వ్యూహాన్ని పీడ కలగా అభివర్ణించింది.
 
 అమెరికా ఆడుతున్న ఈ కనిపించని క్రీడ లక్ష్యం చైనా ను ఆర్థికంగా, సైనికంగా దిగ్బంధం చేయడం. ఈ ఆటలో ప్రధాన క్రీడాకారుడు జపాన్ ప్రధాని షింజే అబే. రెండవ ప్రపంచ యుద్ధ నేరస్త దేశంగా జపాన్‌పై ఉన్న ఆంక్షలను ధిక్కరించి ఆయన దేశాన్ని వేగంగా సైనికీకరిస్తున్నారు. ఒక్కసారిగా రక్షణ వ్యయాన్ని పదకొండు రెట్లు పెంచి చైనాతో కయ్యానికి కాలుదువ్వడం ప్రారంభించారు. అమెరికా తన ‘ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య (టీపీపీ) వాణిజ్య ఒప్పందాన్ని’ సాకారం చేసే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించింది.
 
 నాలుగు ఖండాలకు విస్తరించిన టీపీపీ బృహత్తర వాణిజ్య కూటమితో... ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిక్యతను దెబ్బతీయడంతో పాటూ ఆ ప్రాంత దేశాల సార్వభౌమత్వ హక్కులను సైతం గుప్పిట పట్టే అవకాశం అమెరికా దాని మిత్ర దేశాలకు లభిస్తుంది. జో బిడెన్ అంటున్నట్టుగా ఏకపక్షంగా కవ్వింపు చర్యలకు దిగుతున్నది చైనా కాదు... అమెరికా, జపాన్‌లే. జపాన్ తనవంటున్న సెనెకాకు దీవులు చైనావేనని జపాన్ చరిత్రకారులు 16వ శతాబ్ది నుంచి చెబుతున్నారు. 1895లో జపాన్ వాటిని ఆక్రమించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వాటిని చైనాకు అప్పగించడానికి అది లిఖితపూర్వకంగా అంగీకరించింది కూడా. ఆ దీవుల నుంచే నేడు అమెరికా తన చైనా వ్యతిరేక అదృశ్య వ్యతిరిక్త మహాకుడ్య నిర్మాణా న్ని ప్రారంభించింది. దానికి వ్యతిరేకంగానే చైనా తొలి ఎత్తును వేసింది. తాజాగా అమెరికా దక్షిణ కొరియా పావు ను కదిపింది. చైనా ఆటకు ముందే బాగా కసరత్తు చేసిన ఆటగాడిలా నిశ్చింతగా పావులు కదుపుతోంది.
 పి. గౌతమ్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement