ఉల్లి రైతు విలవిల
కందిపప్పును కేంద్రం నుంచి కిలోకు రూ. 55లకే తీసుకుంటున్న మహారాష్ట్ర ప్రభుత్వం దాన్ని రేషన్ షాపుల్లో కూడా కిలో రూ.120ల ధరకు అమ్ముతుండటాన్ని ఏమనాలి? థానే లోని నా స్వగృహానికి సమీపంలో వ్యాపారం చేస్తూ, టెంపోలో సరుకులను తీసుకువచ్చే ఒక చిల్లర వ్యాపారస్తుడి నుంచి నా రోజువారీ కూరగాయలను కొంటుంటాను. అత డొక రైతు. గత సీజన్‌లో ఉల్లిపాయలు పండించాడు. ఉల్లిపా యలను కిలోకు రూ.20ల లెక్కన అమ్ముతుండేవాడు. కానీ అతడు పండించేది మాత్రం పొలంలోనే కుళ్లిపోతుండేది . కారణం. దళారీలు అతడు పండించిన ఉల్లికి కిలోకు రూపాయి కూడా చెల్లించడానికి ఇష్టపడేవారు కాదు. కాబట్టే అతడు ఉల్లిపాయలను వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) నుంచి కొని వాటిని నాకు అమ్మేవాడు. పొలంలో అతడికి వచ్చే ధరకు, నేను చెల్లించే ధరకు మధ్య రూ. 19ల తేడా ఉండేది. దీనికి దళారీలే కారకులని అతడు ఆరోపించేవాడు.
రవాణా ఖర్చులన్నీ పోగా తనకు మిగిలే లాభం చాలా తక్కువని వాపోయే అతడు తన లాభం గురించి ఎన్నడూ చెప్పేవాడు కాదు. తనకొచ్చే లాభంపై అతడు చెప్పేది నమ్మాలో వద్దో కూడా నాకు తెలీదు. రైతును, వినియోగదారుడిని పణంగా పెడుతూ సాగే ఈ వ్యవహారంలో భారీ స్థాయిలో అక్రమ లాభార్జనకు అవకాశముందనేది స్పష్టం. రైతుకు చెల్లించే ధరకు, విని యోగదారుడు చెల్లించే ధరకు మధ్య ఉన్న తేడా (పైన చెప్పి నట్లు రూ.19ల తేడాకే పరిమి తమవుదాం) రైతుకే ప్రయో జనం కలిగిస్తుందంటూ రెండేళ్ల క్రితం యూపీయే-2 పాలనలో వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ చెప్పిన విష యాన్ని చిల్లర వ్యాపారికి గుర్తు చేశాను. ‘అంటే మంత్రి ఇప్పుడు లాభార్జనను చట్టబద్ధం చేశారన్నమాట’ అంటూ ఆ వ్యాపారి చెప్పింది సరైందే.
రైతులు తాము పండించిన కూరగాయలు, పళ్ల ఉత్పత్తులను నేరుగా వినియోగ దారులకే అమ్ముకోవడాన్ని అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నిర్ణ యించింది. దీనివల్ల రైతులకు మంచి ధర రావడానికీ, వినియోగదారులు సరసమైన ధరకు వ్యవసాయ ఉత్పత్తులు పొందడానికి సాధ్యపడుతుంది.
అయితే లబ్ధిదారులకు మేలు చేకూర్చాలంటే చేయవలసింది ఇంకెంతో ఉంది. ఉదాహరణకు, రైతులు తమ పంటలను ఎక్కడికి తీసుకువచ్చి అమ్మాలనేది సమస్య. వారికి తగు సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ప్రభుత్వం సంస్థల నుంచి వీరికి ఎంత సహకారం అందుతుందన్నది అస్పష్టమే. కానీ, చేయడం కంటే చెప్పడం చాలా సులువు. ముందుగా రైతులు సంఘటిత కావలసిన అవసరముంది. రవాణా సదు పాయాలను, విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. తొలినుంచీ కొనసాగుతున్న పలువురు చిల్లర వ్యాపారులు అన్ని నగర ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లను కూడా ఆక్రమించేశారు కాబట్టి రిటైల్ స్థలాలను కనుగొనడం రైతులకు కష్టసాధ్యమే.
బలమైన రాజకీయ సంబంధాల దన్ను కలిగి, లాభసాటి బేరగాళ్లతో కూడిన వ్యవ స్థీకృత సంస్థ అయిన ఏపీఎంసీ.. వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారుకు అందించడం కోసం గాను తమ ప్రత్యేక హక్కును వదులుకోదు. వాళ్లు తమ వద్ద ఇప్పటికే ఉన్న పలుకుబడినీ, శక్తినీ ఉపయోగిస్తారు. జూలై 4న కమిషన్ ఏజెంట్లు తమ షాపులను రోజంతా మూసివేశారు. దీంతో మహారాష్ట్రలో ధరలు చుక్కలనంటాయి. పైగా నిరవధిక సమ్మె చేపడతామని వారు బెదిరించారు.
మరోవైపు ప్రభుత్వం వ్యవసాయదారులకు, వినియోగదారులకు సాయపడటం మాటేమిటో గానీ, ఏపీఎంసీలో తిష్టవేసిన కమిషన్ ఏజెంట్ల లాబీలను చీల్చడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. మొదట కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్-నేష నల్ కాంగ్రెస్ పార్టీ కూటమి పాలించడం కారణంగా మార్కెట్ కమిటీలో ఈ రెండు పార్టీలు బలంగా పాతుకుపోయాయి. దీన్ని బద్దలు చేయాలని బీజేపీ తలుస్తోంది తప్పితే, మార్కెట్ క్రమబద్ధీకరణను ఎత్తివేయాలని అది కోరుకోవడం లేదు.
అయితే మొజాంబిక్ దేశం నుంచి దిగుమతవుతున్న కందిపప్పును కేంద్రం నుంచి కిలోకు రూ.55లకే తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రేషన్ షాపుల్లో కూడా కిలో రూ.120ల ధరకు అమ్ముతుండటాన్ని ఏమనాలి? వాస్తవానికి ప్రభుత్వమే ఒక దళారీ. ఇలాంటి నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ గురించి బాధ పడటం దేనికి?
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ మెయిల్ : mvijapurkar@gmail.com
- మహేష్ విజాపుర్కార్