సంబోధన...సంప్రదాయం
‘ఒరేయ్ చక్రధర్....ఎక్కడున్నావ్!’ ఓ తండ్రి గట్టిగా అరిచాడు. పెరట్లో నుంచి పరుగులు పెడుతూ వచ్చిన కొడుకు చక్రధర్ కోపంగా జవాబిచ్చాడు. ‘ఇక్కడే ఉన్నాను. ఎందుకలా అరుస్తారు?’
కొంచెం హెచ్చుతగ్గులతో దాదాపు ప్రతి ఇంటా ఇదే సన్నివేశం రోజూ తారసపడుతూనే ఉంటుంది.
తండ్రి కుమారుణ్ణి ఒకటి, రెండుసార్లు పిలిచి, రాకపోయేసరికి కాస్త కోపంగా అలా అని ఉండొచ్చు.
పిల్లవాడు పలకలేదు. కానీ, ఆ సర్వంతర్యామి...అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు పిలవగానే పలుకుతాడు. స్పందిస్తాడు. కాబట్టే మన పెద్దలు ఈ అలవాటు మనకు బోధించారు.
సాంకేత్యం పరిహాస్యంగా వా స్తోభం హేళన మేవవా
వైకుంఠ నామగ్రహణం అశేషాఘహరం విదుః
ఒకరిని అవసరార్ధమే పిలిచినా, హేళనగా పిలి చినా, స్తోత్రం చేసినా...ఏ భావంతో చెప్పినా ఆ వైకుం ఠుడి నామం పాపాలన్నిటినీ పోగొడుతుందని భావం.
ఇటీవల పిల్లలకు భగవంతుని పేరే పెట్టినా ఆ పేర్లతో పిలిచే అలవాటు పోయింది. చిలుకూరులో జరిగిన ఒక సన్నివేశాన్ని మీ అందరికీ చెబుతాను. స్వామివారి పాదతీర్థాన్ని భక్తులకు ఇచ్చేటపుడు ఎవరైనా చిన్న పిల్లలను తీసుకుని వస్తే వారి పేర్లు అడగటం నాకు అలవాటు. ఆ పేరు తెలుసుకుని, అలాగే పిలవడం నా మనసుకు ఆనందాన్నిస్తుంది. ఒకసారి ఓ అమ్మమ్మగారనుకుంటాను...చిన్న పాపను ఎత్తుకుని వచ్చింది. ఆ పాప ముద్దుగా ఉంది. మూడేళ్లుంటాయేమో. ఆమెకు కూడా తీర్థం అడిగి తీసుకున్నారు. ‘పాప పేరేమిటమ్మా’ అని అడిగాను. ‘శ్రీవిద్య అని పెట్టాము స్వామీ’ అని ఆ పెద్దావిడ అన్నారు. అద్భుతమైన పేరు. తాంత్రికమైనటువంటి సాధనకై పెట్టిన పేరు శ్రీవిద్య. ఇందులో లక్ష్మీ సరస్వతులున్నారు. ‘ఇంట్లో ఈ పాపను ఏమని పిలుస్తారమ్మా’ అని అడిగితే ‘శ్రీవిద్యనే అంటాం స్వామీ’ అని ఆమె జవాబిచ్చారు.
కాస్సేపయ్యాక తీర్థం పంచడాన్ని వేరొక అర్చకస్వామికి అప్పగించి మంటపంవైపు వెళ్లాను. అక్కడ ఆ పాప మళ్లీ కనబడింది. వాళ్ల అమ్మమ్మ అలా దించగానే పరుగెత్తడం మొదలెట్టింది. ‘ఏయ్... మ్యాగీ ఎటుపోతున్నావ్’ అంటూ ఆ అమ్మమ్మ గట్టిగా అరిచారు. భక్తులంతా గొల్లున నవ్వారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడున్నందువల్ల నేను సరదాగా జోక్యం చేసుకుని అన్నాను. ‘చూశావామ్మా...స్వామివారి వద్ద అబద్ధం ఆడావు. పాపను ఇంట్లో శ్రీవిద్య అని పిలుస్తామన్నావు. ఇప్పుడేమో మ్యాగీ అంటున్నావు. అమ్మాయికి నూడుల్స్‌కు పెట్టే పేరు పెడతావామ్మా నువ్వు...’ అన్నాను.
అందరూ గమనించవలసిన ముఖ్య విషయం ఉంది. ఈ ఆధునిక యుగంలో స్వామివారినిగానీ, మన దైవాన్ని గానీ, అమ్మవారినిగానీ తలచుకొనే అవకాశం తక్కువ. ఏ పండగకో, ఉత్సవానికో వెళ్లినప్పుడే స్వామివారిని తలుచుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో భగవన్నామాన్ని నిరంతరం ఉచ్చరించడానికి అవకాశం మనకు పిల్లల పేర్ల ద్వారా కలుగుతుంది. వాళ్లకు భగవత్సంబంధమైన పేర్లు పెట్టి వారిని అలాగే పిలుస్తుంటే భగవంతుని అష్టోత్తరం చదివినట్లు అవుతుంది. చక్రధర్ అని పేరుపెట్టి చంటి అని పిలుస్తున్నారు. పండు అంటున్నారు. కనీసం రోజుకి కొన్నిసార్లయినా వారిని పూర్తి పేరుతో పిలిచే అలవాటు చేసుకోవాలి.
- సౌందరరాజన్
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు