పతన దశలో ప్రాణవాయువు | oxygen levels around the globe decreasing, ABK prasad writes | Sakshi
Sakshi News home page

పతన దశలో ప్రాణవాయువు

Published Tue, Dec 8 2015 12:56 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

పతన దశలో ప్రాణవాయువు - Sakshi

పతన దశలో ప్రాణవాయువు

రెండోమాట


వాతావరణ కాలుష్యానికి బడుగు దేశాలను బాధ్యులను చేయాలని అగ్రరాజ్యాలు యత్నిస్తున్నాయి. పంటలకూ, పేదల పనిపాట్లకూ అగ్రరాజ్యాలు ఎనలేని నష్టం కలిగిస్తున్నాయి. పైగా ఎదురు ‘బొంకు’తూ కాలుష్యానికీ, వాతావరణ మార్పులకూ వర్ధమాన దేశాలే కారణమని దుష్ర్పచారానికి సాహసిస్తున్నాయి. ఇలాంటి ప్రచారం చాటున, ‘ఉగ్రవాద ప్రమాద’ ప్రచారం మాటున ఇరాక్, అఫ్ఘానిస్తాన్, ఇరాన్, లిబియా, సిరియా, ఈజిప్టు లాంటి స్వతంత్ర రాజకీయ వ్యవస్థలనూ, సెక్యులరిస్టు దేశాలనూ కబళించడానికి పెద్ద రాజ్యాలు ప్రయత్నిస్తున్నాయి.
 
 
‘ప్రపంచ వ్యాప్తంగానే 1997 నుంచీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. 2015లో (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌సహా) ఉప్పతిల్లిన ఎల్-నినో లాంటి వాతావరణ వ్యవస్థ 1997లోనూ తారసిల్లింది. పసిఫిక్ మహా సముద్రం కేంద్రంగా ప్రారంభమై, విస్తరించి విరుచుకుపడుతున్న ‘ఎల్-నినో’కు ఆసరా సముద్రాలే. ఆ తాకిడి అరేబియా, హిందూ సంద్రాలకూ విస్తరించి తీక్షణమైన ఉష్ణోగ్రతలకు కారణమవుతోందని రుజువైంది. విడుదలయ్యే బొగ్గుపులుసు వాయువుల (ఉద్గారాలు) వల్ల జనించే అదనపు వేడిమిలో 90 శాతం తాపశక్తి సముద్రజలాలకు చేరుతోంది. ఇందులో 10 శాతం మేర బొగ్గుపులుసు వాయువు (సీఓటు) గాలికి, భూమికి, మంచుకి బట్వాడా అవుతోంది.  

ఇండియాలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో నమోదైన గరిష్ట, సగటు ఉష్ణోగ్రతలు దాని ఫలితమే. గత 115 సంవత్సరాల్లో ఎన్నడూ ఎరుగనివి. ఇవి ఆ నెలలో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 1 డిగ్రీ నుంచి 1.25 డిగ్రీలు; తిరిగి అక్టోబర్‌లో కూడా 1.09 డిగ్రీల నుంచి 1.35 డిగ్రీల దాకా నమోదయ్యాయి. కాగా నవంబర్‌లో దేశంలో నమోదైన సగటు ఉష్ణోగ్రత సాధారణ తాపశక్తి కన్నా 1.25 డిగ్రీలు ఎక్కువ’
- డా॥అరవింద కుమార్ శ్రీవాస్తవ
(డెరైక్టర్, భారత వాతావరణ శాఖ జాతీయ కేంద్రం)

అందుకేనేమో, శరవేగాన వస్తున్న వాతావరణ మార్పులను కరాఖండీగా అంచనా వేసి ప్రజలను హెచ్చరించడంలో ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు కొంత తడబడాల్సివస్తోంది, కొలది గంటల వ్యవధిలోనే అంచనాలను మార్చుకోవలసివస్తోంది. అంతేకాదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలోని కొన్ని జిల్లాలకు తగిలిన పెనుతుపాను తాకిడిని బట్టి, భారీ స్థాయిలో అది కలిగించిన కష్టనష్టాల దృష్ట్యా దూసుకువస్తున్న మరో ప్రమాదాన్ని గురించి కూడా  శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు! అంతా మరింత జాగరూకులై ఉండవలసిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నారు.  ఇంకో వైపున, దాదాపు 183 దేశాల ప్రతినిధులతో పారిస్‌లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి   సమావేశం (సీఓపీ 21 లేదా సీఎంపీ 11)లో వాతావరణ పరిరక్షణకు సంబంధించిన చర్చలు మరోసారి (‘క్యోటో’-జపాన్) వాయిదా పడే ప్రమాదం కనిపిస్తు న్నది.

ఇవి దశాబ్దాలుగా సాగుతున్నాయి. కాని, అత్యుగ్రమైన ఉష్ణోగ్రతలకు తరచూ కారణమవుతూ, వాతావరణ పరిస్థితులను అతలాకుతలం చేస్తున్న ఎల్-నినో వ్యవస్థ 2100 నాటికి మానవులకు, ఇతర జీవరాశికి ఊపిరులు అందించే ఆక్సిజన్ (ప్రాణవాయువు)కే ‘ఎసరు’ పెట్టనుందని జీవరసాయన, సాగర శాస్త్రవేత్తలు చేసిన సరికొత్త పరిశోధనల ఆధారంగా అంచనా వేస్తున్నారు! ఎల్-నినో వాతావరణ వ్యవస్థ ప్రకోపిస్తున్న కొద్దీ సముద్ర జలాలు పోటెత్తిపోయి, రుతువులు తారుమారై పలు దేశాలలో (ఇండియా తదితర ఆసియా, ఆగ్నేయాసియా దేశాలు సహా) భారీ ఎత్తున కరువు కాటకాలు, ఆకస్మిక వర్షాలు, వరదలు, ముంపు సంభవిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వైపరీత్యాలకు తోడు, సామ్రాజ్యవాదం
పసిఫిక్ సముద్రం మీదుగా ఇతర సాగరాలను ప్రభావితం చేసే మరొక వాతావరణ వ్యవస్థ ‘లా-నినా.’ ఇది ఎల్-నినో వ్యవస్థకు భిన్నం. ‘నానో’ కారును గుర్తుపెట్టుకుంటే రెండు వ్యవస్థల పేర్లలో ఉన్న అక్షరాల తేడాను తేలిగ్గా గుర్తించవచ్చు. ఎల్-నినో వల్ల మిచ్, కత్రినా (అమెరికా), హుద్ హుద్, దివిసీమ ఉప్పెన వంటి తీవ్ర ఉత్పాతాలు నిరంతరం ఎదురవుతాయి. అయితే వాతావరణ మార్పులకూ, పర్యావరణంలో వస్తున్న పెను మార్పులకూ కేవలం ఈ రెండు వైపరీత్యాలే మూలమని భావించరాదు.

ఎందుకంటే,  ప్రపంచంలోని పేద, వర్ధమాన దేశాల సంపదను, వనరులను కొల్లగొట్టడానికి  పరిసరాలను, స్థానిక వాతావరణాన్ని లెక్క చేయకుండా ఇప్పటికీ దురాక్రమణలను, దోపిడీని కొనసాగించుకోవాలన్న సామ్రాజ్యవాద వలస పెట్టుబడిదారీ వ్యవస్థల తాపత్రయం వల్ల కూడా ప్రపంచ పర్యావరణం ధ్వంసమవుతూ వచ్చిందన్నది వాస్తవం. అణ్వాయుధ పోటీతో అగ్రరాజ్యాలు పేద దేశాల ఆక్రమణకు కాలు దువ్వడం మరొక వాస్తవం. వాటి ప్రమేయం ఏమీ లేకున్నా వాతావరణ కాలుష్యానికి ఆ బడుగు దేశాలను బోనెక్కించేందుకు అగ్రరాజ్యాలు యత్నిస్తున్నాయి. పంటలకూ, పేదల పనిపాట్లకూ అగ్రరాజ్యాలు ఎనలేని నష్టం కలిగిస్తున్నాయి. పైగా ఎదురు ‘బొంకు’తూ కాలుష్యానికీ, వాతావరణ మార్పులకూ వర్ధమాన దేశాలే కారణమని దుష్ర్పచారానికి సాహసిస్తున్నాయి.

ఇలాంటి ప్రచారం చాటున, ‘ఉగ్రవాద ప్రమాద’ ప్రచారం మాటున ఇరాక్, అఫ్ఘానిస్తాన్, ఇరాన్, లిబియా, సిరియా, ఈజిప్టు లాంటి స్వతంత్ర రాజకీయ వ్యవస్థలనూ, సెక్యులరిస్టు దేశాలనూ కబళించడానికి పెద్ద రాజ్యాలు ప్రయత్నిస్తున్నాయి. తమ చర్యల వల్లనే టైజం తలెత్తి, స్వైరవిహారం చేస్తోందన్న సత్యాన్ని మరచిపొమ్మని పరోక్షంగా అగ్రదేశాలు బోధిస్తున్నాయి. నిజం చెప్పాలంటే,  ఈ ‘చావు తెలివి’లో భాగంగా బాంబులతో, విషవాయు ప్రయోగాలతో వాతావరణాన్నీ, పర్యావరణాన్నీ చెడగొడుతున్నవారే వర్ధమాన దేశాలకు నష్టపరిహారం చెల్లించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఉత్తరాఫ్రికా నుంచి బంగ్లాదేశ్, ఆగ్నేయాసియా దేశాల వరకూ వాతావరణంలోని అనూహ్య మార్పులు వాటి ప్రభావాన్ని చూపుతున్నాయి. రెండు రకాల వాతావరణ వ్యవస్థల వల్ల (ఎల్-నినో, లా నినా)ఈ మార్పులు ప్రమాదకర స్థాయికి కూడా చేరుకుంటున్నాయి. ప్రసిద్ధ ఆక్స్‌ఫామ్ సంస్థ జరిపిన సర్వే వివరాలు ఇందుకు తాజా ఉదాహరణ.

ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న 50 శాతం విషవాయువులు (కార్బన్-డయాక్సైడ్) జనాభాలో కేవలం 10 శాతంగా ఉన్న ప్రపంచ ధనిక దేశాల నుంచే ఉత్పత్తి అవుతున్నాయని ఈ సర్వే స్పష్టం చేస్తున్నది. అంతేగాదు, ‘‘వాతావరణ / పర్యావరణ మార్పులకూ, ఆర్థిక అసమానతలకూ దగ్గర సంబంధం ఉంది. ఇవి పడుగూ పేకల్లా అల్లుకుపోయాయి. ఈ 21వ శతాబ్దంలో మనకు ఎదురవుతున్న పెద్ద సవాలే ఇది’’ అని ఆ సర్వే వ్యాఖ్యానించింది. ఎల్-నినో ప్రభావం వల్ల ఉప్పొంగే సముద్ర జలరాశి వల్ల విడుదలయ్యే ఉష్ణోగ్రతల ఫలితంగా మాల్దీవులు, ప్రపంచంలో నాల్గవ అతి చిన్న దేశమైన ‘తూవల’ వంటి చిరుదీవులూ, అక్కడి జనాభా ప్రపంచ పటం నుంచి కనుమరుగైపోవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు!

కొత్త వ్యాధులూ వాటి పుణ్యమే
అంతేగాదు, సముద్రపు ఉష్ణోగ్రతలను ఎల్-నినో దారుణంగా పెంచేయడం వల్ల  1990లలో కలరా, డెంగ్యూ, మలేరియా లాంటి అంటువ్యాధులు ప్రబలిపోయాయి. సముద్ర జీవులైన చిత్రవిచిత్ర సూక్ష్మక్రిములు (‘ప్లాంక్డన్’) తామరతంపరగా పుట్టుకొస్తున్నాయి. ఇవి తిరిగి వరదలకూ పెనుతుపానుల వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులకూ దారితీయవచ్చునని హార్వర్డ్ మెడికల్ స్కూల్స్ డెరైక్టర్ డాక్టర్ పాల్ ఈప్‌స్టన్ అంచనా. 1998 నాటి వాతావరణ పరిస్థితులు మానవుల ఆరోగ్యాన్ని దెబ్బతీసి అనేక మంది చావులకు కారణమయ్యాయని ఆయన పేర్కొన్నాడు.

తూర్పు ఆఫ్రికాను ఆకస్మిక వరదలతో ముంచెత్తిన ఎల్-నినో ‘రిఫ్‌వ్యాలీ’ జ్వరం, కలరా, మలేరియాలకు కారణమై భారీ స్థాయిలో ప్రాణన ష్టం తెచ్చిందని ఆయన వెల్లడించాడు. సకాల వర్షాలు వెనకబడి ఉష్ణోగ్రతలు తీవ్రతరం కావటం వల్ల ఆగ్నేయాసియా దేశాల్లో పెక్కుచోట్ల శ్వాసకోశ వ్యాధులు ప్రబలిపోయాయని ఈప్‌స్టన్ తన అధ్యయనంలో వెల్లడించాడు (ఎన్విరాన్‌మెంటల్ న్యూస్ నెట్‌వర్క్: 1999 ఫిబ్రవరి 16). సెంట్రల్ అమెరికాలోనూ పరిస్థితి ‘డిటో’ అని రాశాడు! అలాగే 2100 సంవత్సరానికల్లా ప్రపంచవ్యాప్త సముద్ర జలాల ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్‌కు పెరగవచ్చునని, అందువల్ల భూమిని ముమ్మరించే వరదల బీభత్సాన్ని మించి, ప్రాణికోటికి అవసరమైనంత ప్రాణవాయువు (ఆక్సిజన్) లభించకపోయే ప్రమాదం ఉండవచ్చునని బ్రిటన్‌లోని లీసెస్టర్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది! చెట్లలో కిరణజన్య సంయోగక్రియను అడ్డుకోవడం ద్వారా ఈ ప్రమాదం దాపురించవచ్చునని వారు హెచ్చరించారు.

ఇప్పుడు పెరిగిన స్థాయికన్నా మించి ఉష్ణోగ్రత ఏ మాత్రం పెరిగినా అంటార్కిటిక్ మంచుకుప్పలు కరిగి పారిశ్రామిక యుగారంభానికి ముందున్న ఉష్ణోగ్రతకన్నా ఏ కొలది డిగ్రీలు పెరిగినా, వాన కన్నా ముందు ప్రపంచాన్ని పెనువరదలు ముంచెత్తుతాయని సెర్జీ పెట్రోవెస్కీ అనే గణిత శాస్త్రవేత్త ఊహిస్తున్నాడు! ఈ భూఖండాన్ని ఆవరించి ఉన్న మొత్తం వాతావరణంలోని మూడింట రెండు వంతుల ఆక్సిజన్ కిరణజన్య సంయోగక్రియ ఫలితం. అది కాస్తా ‘బంద్’ అయితే భారీ సంఖ్యలో మానవ, మానవేతర జీవరాశికి మరణమే శరణ్యమని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
 
- ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement