పీవీ పునరావాసం? | PV narasimha rao is 94 jayanthi | Sakshi
Sakshi News home page

పీవీ పునరావాసం?

Published Sun, Jun 28 2015 1:15 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

పీవీ పునరావాసం? - Sakshi

పీవీ పునరావాసం?

పీవీ 94వ జయంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరగడం విశేషం.

పీవీ 94వ జయంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరగడం విశేషం. పీవీ అస్తమించి పదేళ్లు దాటిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న తొలి సమావేశం ఇది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో పీవీకి పునరావాసం. పీవీని బీజేపీ తన ఖాతాలో జమకట్టుకుంటుందన్న భయంతోనో, పీవీకి అన్యాయం చేశామన్న  పశ్చాత్తాపంతోనో కాంగ్రెస్ నాయకత్వం ఇందుకు అనుమతించి ఉంటుంది.  
 
 దాదాపు రెండు వారాలుగా ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అట్టుడికిస్తున్న కొన్ని అంశాలపైన మౌనం పాటిస్తున్నారు. నిష్క్రియాపరుడంటూ, మౌనీబాబా అంటూ మన్మోహన్‌సింగ్‌ను ఎద్దేవా చేసిన మోదీ అదే మౌనాన్ని ఆశ్రయించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రతినిధిగానే మన్మోహన్ పదేళ్లూ గద్దె మీద కూర్చున్నారు. ఆ వాస్తవాన్ని ఆయన ఎన్నడూ విస్మరించలేదు. మరో ప్రధాని పీవీ నరసింహారావు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుల ఆగ్రహం ఒక వైపూ, అర్జున్‌సింగ్ లేఖాస్త్రాలు మరోవైపు బాధిస్తున్నా మౌనంగానే అన్నీ సహిం చవలసి వచ్చింది. మోదీ సంగతి వేరు. ఆయన స్వయంగా దేశం అంతటా అద్భుతంగా ప్రచారం చేసి ఎన్నికలలో ఘనవిజయం సాధించి అట్టహాసంగా అధికారం చేపట్టిన శక్తిమంతుడు. అడ్వానీ వంటి భీష్మాచార్యుడిని పూర్వపక్షం చేసి మార్గదర్శక మండలికి పరిమితం చేసిన యుక్తిపరుడు.
 
 ఈ రోజున మోదీకి ఎదురు చెప్పేవారు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో ఎవ్వరూ లేరు. ఆరెస్సెస్ నాయకులైనా సలహాలూ, సూచనలూ ఇవ్వవలసిందే కానీ ఆదేశించే పరిస్థితి లేదు. మీడియా ఎంత రెచ్చగొడుతున్నా, ఎంతగా పొడుస్తున్నా మోదీ మారు మాట్లాడరేమి? విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలు క్రికెట్ జూదరి లలిత్‌మోదీకి అక్రమంగా సహాయం చేశారన డానికి సాక్ష్యాధారాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ నోరు మెదపరేమి? శని వారంనాడు ఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశానికి హాజరైన వసుంధరా రాజే బీజేపీ పెద్దలను కలుసుకొని తన వాదన వినిపించుకునే అవకాశం లేకుండా జైపూర్‌కి తిరిగి వెళ్ళవలసిన దయనీయమైన స్థితి ఎందుకు దాపురించింది? మోదీ కానీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కానీ రాజే సంజాయిషీ వినకుండా, ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా, సుష్మా, రాజేల గురించి ప్రస్తావించకుండా ఎంతకాలం దాటవేయగలుగుతారు?
 
 ‘న ఖావూంగా, న ఖానేదూంగా (తినను, తిననివ్వను)’ అంటూ ఎన్నికల ప్రచారంలో ప్రతిజ్ఞ చేసి, సంవత్సర పాలన పూర్తయిన సందర్భంగా నిష్కళం కంగా ఏడాది పరిపాలించడమే ఎన్‌డీఏ సర్కార్ సాధించిన విజయంగా చెప్పు కుంటూ ఇప్పుడు అక్రమాలు, అవినీతి జరిగినట్టు బలమైన ఆరోపణలు వచ్చి నప్పటికీ, స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ మోదీ స్పందించకుండా ఉండటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? భారత చట్టాలనుంచి తప్పించుకొని లం డన్‌లో తలదాచుకున్న క్రికెట్ మాయావి లలిత్ మోదీతో సుష్మా, రాజేల లావా దేవీల గురించి పెదవి విప్పకుండా మోదీ (కాంగ్రెస్ నాయకులు అభివర్ణించి నట్టు) ‘లలితాసనం’ వేసి మౌనమె నా భాష అంటే కుదురుతుందా? పార్లమెంటు వర్షాకాలం సభలు సజావుగా సాగుతాయా? పీవీ, మన్మోహన్‌లు ప్రధా నులు కాకపూర్వం సైతం మితంగా మాట్లాడే అలవాటున్నవారు.
 
 మోదీ అతి భాషి. అతివాది. అసాధారణమైన వాగ్ధాటి కలిగిన రాజకీయ యోధుడు. అటు వంటి అధినేత పాటిస్తున్న నిశ్శబ్దం చెవులలో హోరెత్తిస్తున్నది. రెండో తరం ఆర్థిక సంస్కరణలు అమలు చేయలేక, చేయకుండా ఉండ లేక, సంక్షేమబాటలో ప్రయాణం చేస్తున్న సోనియాను ఒప్పించలేక సతమత మైన మన్మోహన్ మనోవ్యధ ఏమిటో ఇప్పుడు మోదీకి అర్థం అవుతూ ఉండ వచ్చు. తన నెత్తిన సోనియా వంటి జేజమ్మ లేకపోయినా, పార్టీలోనూ, ప్రభు త్వంలోనూ తనకు ఎదురు చెప్పేవారు ఒక్కరూ లేకపోయినా నరేంద్రమోదీ నిర్ణ యాలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు?
 
 పాతాళం నుంచి ఆకాశానికి...
 నిరుడు మోదీ ప్రధానమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించినప్పటి పరిస్థితుల కంటే దారుణమైన స్థితిలో దేశం ఉన్నప్పుడు ఇరవై నాలుగేళ్ల కిందట పీవీ ప్రధా నిగా పగ్గాలు చేతబట్టారు. 1989 నుంచి 1991 వరకూ వీపీ సింగ్, చంద్రశేఖ ర్‌లు తలా సంవత్సరం కూడా పదవిలో కొనసాగలేక విఫల మనోరథులై నిష్ర్క మించారు. మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెస్ శ్రేణులను బరిలో నడిపిస్తున్న రాజీవ్‌గాంధీని ఎన్నికల నడిమి ఘట్టంలో ఎల్‌టీటీఈ హంతకులు హత్య చేశా రు. అప్పటికే ఎన్నికలలో పోటీచేయకుండా, రామానందతీర్థ ట్రస్టు వ్యవహా రాలు చూసుకుంటూ, రాసుకుంటూ కాలక్షేపం చేయాలని నిర్ణయించుకొని మూటాముల్లె సర్దుకొని హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న పీవీ ప్రధానిగా ప్రమాణం చేయవలసివచ్చింది. నాటి దేశ ఆర్థికపరిస్థితి అత్యం త దుర్బలం. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి ఆరుమాసాల కిందట అప్పుచేసి తెచ్చుకున్న నిధులు అడుగంటాయి. చంద్రశేఖర్ హయాంలో విదేశీమారక ద్ర వ్యం బొత్తిగాలేకపోవడంతో లండన్ బ్యాంకులో బంగారం కుదువపెట్టవలసివ చ్చింది. అటువంటి నిర్వీర్యమైన ఆర్థికవ్యవస్థను సంస్కరించడానికి పీవీ తీసు కున్న చర్యలు ఏమిటో, అత్యంత ప్రభావవంతమైన నిర్ణయాలను ఎంత ప్రశాం తంగా అమలు చేయగలిగారో తెలుసుకుంటే మోదీకి మార్గదర్శనం అవుతుంది.
 
 రాజకీయాలు తెలియని ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌ను ముందు పెట్టుకొని అత్యంత లాఘవంగా మార్కెట్ సంస్కరణలను పీవీ ప్రవేశపెట్టారు. ఆర్థికంగా నలిగిపోయిన దశ ఏ దేశంలోనైనా కార్మికచట్టాలను తిరగతోడటానికి మంచి సమయమనే అంతర్జాతీయ ద్రవ్యసంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచబ్యాంకు వాద నను తోసిరాజన్నారు పీవీ. బ్యాంకులను ప్రైవేటైజ్ చేస్తారేమోనన్న భయంతో సమ్మె నోటీసు ఇచ్చిన బ్యాంకు ఉద్యోగులకు అటువంటి భయమే అక్కరలేదని భరోసా ఇచ్చారు. భూములు స్వాధీనం చేసుకుంటారేమోనన్న భయంతో ఉద్యమి స్తున్న వ్యవసాయదారులకు కూడా భయపడవలసిన అవసరం లేదనీ, వ్యవసా యరంగాన్ని ముట్టుకోబోమనీ భరోసా ఇచ్చారు.
 
 అయినప్పటికీ గరీబీ హటావో నాటి జీడీపీ పెరుగుదల రేటు 3.5, రాజీవ్ హయాంలో 5.5 శాతం ఉంటే పీవీ పాలనలో అది 7.5 శాతం పెరిగింది. 2000లలో జీడీపీ 8.5 శాతం తాకడానికి కూడా పీవీ ప్రభుత్వం వేసిన ఆర్థిక పునాదులే కారణం. చైనాకు డెంగ్ ఎంత మేలుచేశాడో ఇండియాకు పీవీ అంత ఉపకారం చేశారు. పీవీ రాజకీయ జీవితంలో తప్పులు చేసి ఉండవచ్చు. వ్యక్తిగత జీవితంలో చంద్రస్వామి వంటి మార్మికులకు మితిమీరిన చనువు ఇచ్చి పొరపాటు చేసి ఉండవచ్చు. బాబరీ మసీదు విధ్వంసమైనప్పుడు బీజేపీ నాయకుల హామీలు విశ్వసించి మోసపోయి ఉండవచ్చు. పరిపాలనాపరంగా పొరపాట్లు చేసి ఉండ వచ్చు. ఆర్థిక సంస్కరణల విషయంలో మాత్రం మోదీ కంటే ఎక్కువ గుండెదిట వును పీవీ ప్రదర్శించారు.
 
 చాకచక్యం, వాస్తవిక దృష్టి, సమయజ్ఞత, పట్టువిడు పులు పీవీ శైలిలో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు. లెసైన్స్, పర్మిట్ రాజ్‌ను పీవీ పూర్వపక్షం చేసిన తీరు నుంచి మోదీ, చంద్రబాబునాయుడు గుణ పాఠాలు నేర్చుకోవాలి. ఆర్థిక శాఖను మన్మోహన్‌కు అప్పగించినప్పటికీ పరిశ్ర మల శాఖను పీవీ తనదగ్గరే ఉంచుకున్నారు. లెసైన్స్, పర్మిట్ వ్యవస్థకు చరమ గీతం పాడింది ఆయనే. ఎట్లా? పారిశ్రామిక విధానంలో పెనుమార్పులు తెస్తు న్నామంటూ చాటింపు వేయలేదు. హడావుడి చేయలేదు. మన్మోహన్‌సింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఉదయమే పారిశ్రామిక విధానం ఆర్భాటం లేకుండా ప్రకటించారు. బడ్జెట్‌లో భాగంగానే మీడియా పారిశ్రామిక విధానాన్ని పరిగ ణించి దానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. చడీచప్పుడు లేకుండా వచ్చిన నూతన పారిశ్రామిక విధానం పారిశ్రామికరంగాన్ని అంతవరకూ కట్టివేసి కుంగదీసిన సంకెళ్ళను ఒక్క దెబ్బతో ఛేదించింది.
 
మధ్యేమార్గం
 రొనాల్డ్ రేగన్‌లాగానో, మార్గరెట్ థాచర్ మాదిరో మార్కెట్ ఎకానమీ (విపణి చోదక ఆర్థిక వ్యవస్థ)లో తిరుగులేని విశ్వాసం ఉన్న నాయకుడు కాదు పీవీ. మధ్యేమార్గం అనుసరించాలన్నదే ఆయన అభిమతం. మానవీయకోణం వీడ కుండా సంస్కరణలు (రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్) అమలు చేయాలన్నది సంకల్పం. ఇందుకు భిన్నంగా మోదీ అధికారంలోకి వస్తూనే భూసేకరణ చట్టాన్ని సవరించాలంటూ మొండిపట్టు పట్టి కూర్చున్నారు.
 
  ఇప్పటికి మూడు సార్లు ఆర్డినెన్స్ జారీ చేయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండోసారి అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణం పేరిట రైతు లతో తెగని పంచాయితీ పెట్టుకున్నారు. పీవీ వ్యక్తిగతంగా పరిశుభ్రమైన రాజ కీయ నేత. నాలుగు దశాబ్దాలు (రెండు హైదరాబాద్‌లో, రెండు ఢిల్లీలో) అధికా రంలో ఉన్నప్పటికీ అవినీతి పంకిలం అంటించుకోలేదు. నాడు పీవీ ఆవిష్క రించిన ‘లుక్ ఈస్ట్’ విధానాన్నే నేడు మోదీ ‘యాక్ట్ ఈస్ట్’ విధానంగా మాటమా ర్చుకున్నారు. దేశ ఆర్థిక భవిష్యత్తు తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో సన్ని హిత సంబంధాలు పెట్టుకోవడంలోనే ఉన్నదనే సత్యాన్ని ఆయన రెండున్నర దశాబ్దాల కిందటే గ్రహించారు.
 
 అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ కం ట్రీస్‌తో స్నేహానికి బలమైన పునాది వేశారు. చైనాతో దృఢమైన సంబంధాలకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యామంత్రిగా, రాజీవ్ మంత్రిమండలిలో మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా పీవీ విద్యారంగంలో మౌలికమైన సంస్కరణలు ప్రవేశపెట్టారు. పీవీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు పం జాబ్ రగులుతూ ఉన్నది. కశ్మీర్‌లో ఆటంకవాదులు చెలరేగిపోతున్నారు. సిక్కు పోలీసు ఉన్నతాధికారి కేపీఎస్ గిల్ సహకారంతో, బలప్రయోగంతో పంజా బ్‌లో వేర్పాటు ఉద్యమాన్ని చల్లార్చారు. కశ్మీర్‌లో తీవ్రవాదుల ఆట కట్టించి సైన్యానిది పైచేయి చేయగలిగారు. ఇందుకు అనేక వ్యూహాలు అనుసరించారు. తిరుగుబాటుదారులైనా, వేర్పాటువాదులైనా తోటి పౌరులను కాల్చి చంపడం అన్నది బాధాకరమైన పని.
 
 ఈ విషయంలో గొప్పలు చెప్పుకోవడం అవివేకం. ఇటీవల మయన్మార్ భూభాగంలో తీవ్రవాదులను భారత సైనికులు మట్టుబె ట్టిన ఉదంతాన్ని పరాక్రమ ప్రదర్శనగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్, మరి కొందరు మంత్రులూ, న్యూస్ చానళ్ల యాంకర్లూ అభివర్ణించడం పరిక్వతలేని దూకుడుతనం. ఇటువంటి బడాయిల వల్ల నష్టమే కానీ ప్రయోజనం లేదు. సమస్యను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం, రాజ్యాంగపరమైన, చట్టపరమైన కోణాలను నిశితంగా పరిశీలిం చడం, పరిష్కారమార్గాన్ని కనుగొనడంలో సృజనాత్మకంగా ఆలోచించడం, సమర్థంగా అమలు చేయడం పీవీ విజయ రహస్యం. ఆయన ఎక్కడ ఏ శాఖ నిర్వహించినా దాన్ని ఒకటి, రెండు మెట్లు పైకి తీసుకొనివెళ్లి కూర్చోబెట్టారు. కొత్త పుంతలు తొక్కించారు.
 
 ఆర్థిక సంస్కరణలలో, విదేశీ వ్యవహారాలలో, విద్యారంగంలో పీవీ ముద్రను ఎవ్వరూ చెరపలేరు. భారత్ ప్రపంచం గుర్తించ దగిన ఆర్థికశక్తిగా ఎదుగుతుందని కానీ, ఒకానొక దశలో చైనాకంటే అధికమైన జీడీపీ వృద్ధిరేటును సాధిస్తుందని కానీ రెండున్నర దశాబ్దాల కిందట ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. అనూహ్యమైన విజయాలు సాధించడానికి ప్రధాన కారకుడు పీవీ నరసింహారావు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం గుర్తించినా, గుర్తించకపోయినా, తాత్కాలికంగా అవమానాలు ఎదుర్కొని, నిరాదరణకు లోనై ఈ లోకం వీడి వెళ్లిపోయినా చరిత్రలో పీవీ స్థానం మాత్రం చిరస్థాయిగా ఉంటుంది.
 
దేశానికి పీవీ చేసిన నిరుపమాన సేవను గుర్తించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని ఉడికించడానికి కావచ్చు మోదీ ప్రభుత్వం పీవీ స్మారక చిహ్నాన్ని ఢిల్లీలోని ఏక్తాస్థల్ సమాధి ప్రాంగణంలో నిర్మించాలని నిర్ణయించ డాన్ని మనసారా స్వాగతించాలి. ఈ రోజు పీవీ 94వ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల సంయుక్త ఆధ్వ ర్యంలో పీవీ సంస్మరణ సభ జరగడం విశేషం. పీవీ అస్తమించి పదేళ్లు దాటిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న తొలి సమావేశం ఇది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో పీవీకి పునరావాసం. పీవీని బీజేపీ తన ఖాతాలో జమ కట్టుకుంటుందన్న భయంతోనో, పీవీకి అన్యాయం చేశామన్న పశ్చాత్తాపంతో నో కాంగ్రెస్ నాయకత్వం ఇందుకు అనుమతించి ఉంటుంది. తప్పు ఆలస్యంగా నైనా దిద్దుకుంటున్నందుకు కాంగ్రెస్ నాయకులను అభినందించాలి.
- కె.రామచంద్రమూర్తి
సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement