న్యాయానికే న్యాయం దక్కనప్పుడు..!
జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డిపై పార్లమెంట్‌లో రెండోసారి అభిశంసన తీర్మానం తీసుకురావడానికి విఫలయత్నం జరిగినట్లు వార్తలొచ్చాయి. కొద్ది మంది రాజకీయ నాయకుల కారణంగా ఆయన రుజువర్తన రెండోసారి కూడా ప్రశ్నార్థకమవడం శోచనీయం. ఇది ఆయన ఒక్కరిని శంకించడం కాదు, సమస్త న్యాయవ్యవస్థ స్వతంత్రతనూ శంకించడమే అవుతుంది.
ఒక న్యాయమూర్తిని అభిశంసన ప్రక్రియ ద్వారానే తొలగించవచ్చు. ఈ అభిశంసన తన సుదీర్ఘ ప్రక్రియలో విఫలమైనప్పటికీ, దానికి గురైన వ్యక్తి సమాజం దృష్టిలోకి రావడమే కాకుండా ఆయన రాజ్యాంగ విధులను నిర్వర్తించకుండా అడ్డుకుంటుంది కూడా. ఇలాంటి సమస్యలను కొందరు పెద్దగా పట్టించుకోరు కానీ కొందరు అత్యంత సున్నిత స్వభావంతో ఉంటారు. జస్టిస్ నాగార్జున వీటిలో రెండో కోవకు చెందుతారు.
రాజ్యాంగం ప్రకారం జడ్జిని అభిశంసన చేయాలంటే ఉభయ సభలూ దానిపై చర్చిం చిన తర్వాత పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాల్సి ఉంది. న్యాయమూర్తి దుష్ప్రవర్తన లేదా అసమర్థత రుజువైందన్న ప్రాతిపదికపై ఆయనను పదవీ బాధ్యతలనుంచి తొలగించవలసి ఉంటుంది. ఇక్కడ నాగార్జున రెడ్డిపై దుష్ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణ ఏదంటే ఒక దళిత జూనియర్ సివిల్ జడ్జిని ఆయన వేధించారన్నదే.
ఆ సివిల్ జడ్జి జస్టిస్ నాగార్జున రెడ్డిపై పెట్టిన రిట్ పిటిషన్ నేపథ్యంలో ఆ ఆరోపణను పరిశీలించవలసి ఉంది. జస్టిస్ నాగార్జునరెడ్డిని అభిశంసించవలసిందిగా కోరుతూ సివిల్ జడ్జి రెండోసారి కూడా పిటిషన్ దాఖలు చేసినప్పడు, హైకోర్టు డివిజన్ బెంచ్ ఇలా అభిప్రాయపడింది. చట్టప్రకారం రిట్ పిటిషన్‌పై తుది నిర్ణయాన్ని పొందడం మీద కాకుండా రిట్ పిటిషన్‌ను ఏదోలాగా కొనసాగిస్తూ, సమస్యను సజీవంగా ఉంచడంపైనే రిట్ పిటిషన్ దారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడని స్పష్టమవుతోంది.
జస్టిస్ నాగార్జున రెడ్డి గతంలో తనకు కాల్ చేసి ఒక మరణ వాంగ్మూల పత్రం నుంచి తన సోదరుడి పేరును తొలగించాలని ఆదేశించారనీ, దానిని తిరస్కరించడంతో తనపై వేధింపులు మొదలెట్టారని, సస్పెన్షన్ చేయించారని ఫిర్యాదిదారు ఆరోపించారు. పిటిషన్ ప్రకారం ఫిర్యాదుదారు నిజంగానే బాధపడి ఉంటే, ఆయనే మరొకరిని అదే విధమైన బాధకు గురి చేయడం దేనికని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.
రిట్‌పిటిషనర్ తన అఫిడవిట్‌లో పేర్కొన్న వివిధ నివేదనల్లో కేవలం మూడింట్లో మాత్రమే న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఆరోపణలు ఉన్నాయి. ఆ మూడు ఫిర్యాదుల సారాం శం ఒక్కటే. అదేమంటే 13.02.2013న జస్టిస్ నాగార్జున రెడ్డి తన కింది జడ్జి అయిన పిటిషన్ దారును రాయచోటిలోని తన ఇంటికి రప్పించి వేధించారన్నదే. దిగువ కోర్టు సిబ్బందిపై క్రిమినల్ ఫిర్యాదులు ఎందుకు నమోదు చేశావంటూ ఫిర్యాదుదారును వేధింపులకు గురి చేశారని ఆరోపణ. న్యాయ మూర్తికి వ్యతిరేకంగా ఫిర్యాదుదారు చేసిన నివేదికపై హైకోర్టు వ్యాఖ్యానిస్తూ 14.02.2013 తేదీతో ఉన్న నివేదన ఈ మొత్తం వ్యవహారం కట్టుకథ అనడానికి నికరమైన రుజువు అని తేల్చింది.
పిటిషనర్ 18.02.2013న తన తొలి నివేదనను కోర్టుకు పంపారు. ప్రతివాది (జస్టిస్ నాగార్జునరెడ్డి) రాయచోటిలోని తన ఇంటికి పిటిషనర్‌ను పిలిపించి, అవమానించారన్న విషయం దాన్లో లేదు. కిందిస్థాయి సిబ్బందికి వ్యతిరేకంగా నేరారోపణను నమోదు చేసినందుకు పిటిషనర్‌ను దూషించినట్లు ఈ నివేదనలో పొందు పరచలేదు. తర్వాత ఈ లోపాన్ని గుర్తించిన పిటిషనర్ 14.02.2013 తేదీతో కొత్తగా ఒక ఫిర్యాదును సృష్టించి రిట్ పిటిషన్‌ను ఫైల్ చేశారు. 18.02.2013న అఫిడవిట్‌లో పొందుపర్చిన అసలు ఫిర్యాదును ఈ రిట్ పిటిషన్‌లో తొక్కి పెట్టారు.
మొత్తం వివాదానికి కేంద్రబిందువుగా నిలిచిన మరణ వాంగ్మూలంపై హైకోర్టు వ్యాఖ్యానిస్తూ, ఫిర్యాదుదారు ప్రకారం, మరణ వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి 95 శాతం కాలిన గాయాలతో ఉన్నారనీ, అలాంటి వ్యక్తి మరణ వాంగ్మూలం ఇవ్వడానికి స్పృహలో ఉంటారా అనేది స్పష్టం కాలేదని పేర్కొంది. హైకోర్ట్ బెంచ్ మళ్లీ ఇలా పేర్కొంది. ‘అన్ కాన్షియస్’లో అన్ పదాన్ని, ‘ఇన్ ఎ ఫిట్ కండిషన్’ అనే పదాలకు ముందు నాట్ అనే పదాన్ని చేతితో కొట్టేశారు. మరోరకంగా చెప్పాలంటే, రోగి స్పృహలో లేడని, కాబట్టి అతడు మరణ వాంగ్మూలం ఇచ్చే స్థితిలో లేడని డ్యూటీ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను వ్యతిరేక అర్థం వచ్చే రీతిలో మార్చారని హైకోర్టు బెంచ్ ఎత్తి చూపింది.
నా దృష్టిలో అభిశంసనకు గురైనవారు గొప్ప వ్యక్తి. తనకు కలిగిన సంక్షోభంపై కూడా ఆయన ఎంతో సమతుల్యతను ప్రదర్శించారు. తొలిసారి అభిశంసనకు గురైన వెంటనే తన అధికారిక విధులనుంచి తప్పుకున్నారు. కాగా, రెండో అభిశంసన నిర్ధిష్ట రూపం తీసుకోలేదు. ముందే చెప్పినట్లు న్యాయవ్యవస్థను మొత్తంగా పార్లమెంట్ సభ్యుల సంఖ్యాబలానికి వదలిపెడుతున్నారా? విచారణ జరిగే కాలంలో న్యాయమూర్తి కనీస నైతిక కారణాలతో విధి నిర్వహణకు దూరంగా ఉంచడం అంటే ఏమిటీ? అధికారంలో ఉన్న వాళ్లు ఇలాంటి అంశాలపట్ల ఎందుకు మౌనం పాటిస్తున్నారు. వింతగొలిపే విషయం ఏమిటంటే మన వ్యవస్థలో ఇదే న్యాయం. న్యాయానికీ ఇదే న్యాయమే మరి.
వ్యాసకర్త హైకోర్టు సీనియర్ న్యాయవాది
రవిచంద్