సమ దృష్టే రాయలసీమకు రక్ష
రాజధాని ఎంపికలో నాడు ఏ సమస్యలైతే తీవ్ర చర్చనీయాంశాలైనాయో, ఇప్పుడూ అవే పునరావృతమైనాయి. ఆంధ్ర రాష్ట్రంలో సర్కారు జిల్లాలు పెత్తనం సాగిస్తాయనే బలమైన భావనతో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడడానికి సీమ వాసులు ముందు వ్యతిరేకించారు.
ఆంధ్రప్రదేశ్ కుటిల రాజకీయాలకు బలైంది. తెలుగుజాతిని రెండు ముక్కలు చేసి, కలహాల కుంపట్లు రగిలించారు. ఆరు దశాబ్దాల పాటు కష్టసుఖాలలో కలసి మెలసి జీవిస్తూ హైదరాబాద్‌ను మంచి రాజధానిగా, మహానగరంగా తీర్చిదిద్దుకున్నాం. అంతిమంగా ఆ అభి వృద్ధి ఫలాలను అనుభవించే అర్హత లేదంటూ సీమాంధ్ర ప్రజల తలరాత లను మార్చేశారు. మిగిలిన 13 జిల్లా లతో ఆంధ్రప్రదేశ్ అన్న పేరుతోనే రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీక రించారు. రాజధానిని నిర్ణయించకుం డానే వదిలిపెట్టారు.
అడ్డగోలు విభజనలో కాంగ్రెస్‌కు సహకరించిన బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టింది. నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాస నసభలో తెలుగుదేశం అధికార పక్షం కాగా, వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉంది. కాంగ్రెస్‌కు, కమ్యూని స్టులకు ప్రాతినిధ్యమే లేదు. కొత్త రాజధాని ఎంపికలో చేదు అనుభవాలు పునరావృతం కాని రీతిలో రాయలసీమ, ఉత్త రాంధ్ర, మధ్య, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల అభీష్టానికి అను గుణంగా నిర్ణయం తీసుకోవాలి.
మద్రాసు నగరాన్ని (నేడు చెన్నై) వదులుకోవడం నష్ట మే అయినా, నాడు ఆంధ్రరాష్ట్రం పోరాడి సాధించుకున్నారు కాబట్టి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు అంతగా విచారిం చలేదు. మద్రాసును ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్, ప్రజా సోషలిస్టు పార్టీలు కోరాయి. నాటి ప్రధాని నెహ్రూ దీనిని తోసిపుచ్చారు. తరువాత విజయవాడ రాజ ధానికి అనువైన దని కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదిం చింది. కృషీకార్ లోక్‌పార్టీ తిరుప తి మీద మొగ్గు చూపింది. దీని మీద ఉమ్మడి మద్రాసు శాసనసభలోని ఆంధ్ర శాసనసభ సభ్యులు జూన్ 5, 1953న ప్రత్యేక సమావేశం జరి పారు. ఐదురోజులు చర్చించి వెనుకబడిన రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలని, కర్నూలును తాత్కాలిక రాజధానిని చేయాలని నిర్ణయించారు. హైకోర్టును గుంటూరులో నెలకొ ల్పాలని తీర్మానించారు.
రాజధాని ఎంపికలో నాడు ఏ సమస్యలైతే తీవ్ర చర్చనీ యాంశాలైనాయో, ఇప్పుడూ అవే పునరావృతమైనాయి. ఆంధ్ర రాష్ట్రంలో సర్కారు జిల్లాలు పెత్తనం సాగిస్తాయనే బలమైన భావనతో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరు పడడానికి రాయలసీమ వాసులు ముందు తటపటాయించ డమే కాదు వ్యతిరేకించారు. రాయలసీమ వాసుల మనోగ తాన్ని పసిగట్టి, 1936 నాటి ‘శ్రీబాగ్ ఒడంబడిక’(పెద్ద మనుషుల ఒప్పందం) ద్వారా సీమ ప్రజలకు భరోసా ఇచ్చి ఉద్యమంలో అంతర్భాగం చేశారు. కానీ శ్రీబాగ్ ఒడంబడిక బుట్టదాఖలా అయింది.
రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధికి రాష్ట్ర విభజన చట్టంలో ఎలాంటి నిర్దిష్టమైన ప్రణాళికను పొందుపరచ లేదు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి పేర్కొన్న అంశాలన్నీ కోస్తాంధ్ర కేంద్ర బిందువుగానే ఉన్నాయి. విశా ఖ - నెల్లూరు మధ్య ఉన్న ప్రాంతంపైనే కేంద్రీకరించినట్టు కనిపిస్తున్నది. గత అనుభవాల ఆధారంగా భవిష్యత్ పరిణా మాలను ఊహించుకొంటున్న రాయలసీమ ప్రజానీకానికి విశ్వాసం కలిగించే ప్రయత్నం జరగడం లేదనిపిస్తున్నది.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించి, అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించి, ఖర్చు చేయడం ద్వారా మాత్రమే ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించగలరు. సీమకు విస్తా రమైన భూసంపద, ఖనిజ, అటవీ సంపద ఉన్నాయి. కానీ, నీరే సమస్య. కృష్ణా నదీజలాల వినియోగ నియంత్రణ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయమే కృష్ణా నదీ జలాల నిర్వహణ, వినియోగంలో గుండెకాయ లాంటిది. తుంగభద్ర, జూరాల జలాశయాల వద్ద నీటి నిల్వ, వినియోగాంశాలు కీలకమైనవి. అందువల్ల బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడం సముచితం. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న ఉన్నత విద్యా సంస్థల్లో కొన్నింటిని ఈ ప్రాంతంలో నెలకొల్పాలి. రాజధాని సమ స్యను మాత్రమే వేరుచేసి అత్యాధునిక హంగులతో గుం టూరు - విజయవాడ లేదా విజయవాడ - ఏలూరు మధ్య లేదా మరెక్కడైనా మహానగరాన్ని నిర్మిస్తామని చెబితే రాయ లసీమకు ఒరిగేదేమీలేదు. ‘సమగ్ర దృష్టి, సమగ్రాభివృద్ధి, సమన్యాయం’ ప్రాతిపదికన నవ్యాంధ్రప్రదేశ్‌లో సుపరిపాల నను ప్రజలు కోరుకొంటున్నారు.
(వ్యాసకర్త నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం కార్యనిర్వాహకులు, హైదరాబాద్) టి. లక్ష్మీనారాయణ