తిరస్కారమే పురస్కారమా?
ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రతిపక్షం చేతిలోగాక, కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పదేపదే అవమానాలను ఎదుర్కొంటున్నారు. రాహుల్‌గాంధీ, ఆ ఆర్డినెన్స్‌ను పూర్తి అర్థరహితమైనదంటూ తీసిపారేయడానికి ముందు చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, కమల్‌నాథ్‌ల వంటి వారంతా దానికి మద్దుతు పలికినవారే. కాంగ్రెస్ హిట్‌లిస్ట్‌లో నరేంద్రమోడీ మొట్టమొదటివారైతే, మన్మోహన్‌ది ఆ తర్వాతి రెండో స్థానం. ఎన్నికల మహా సంరంభపు జాతరలో గలీజు గణాం కాలు ఊరేగటం మనకు సుపరిచితమే. ఇక కుయుక్తుల మాటకొస్తే అది మరో కథ. మిట్టమధ్యాహ్నపు ఎండలో గారడీవాడు ప్రదర్శించే కనికట్టుకూ, అమాస రాత్రి స్మశానంలో భూత మాంత్రికుడు సాగించే అన్వేషణకూ ఉన్నంత తేడా ఆ రెంటికీ మధ్యన ఉంది.
బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాలుకు ప్రతిగా కాంగ్రెస్ సమన్వయంతో సాగిస్తున్న ఎదురుదాడిలో ఆర్థిక మంత్రి పి. చిదంబరం గణాంకాల చేత శీర్షాసనం వేయించారు. ఆ విషయంలో బీజేపీ తాను ఒంటరిన ని భావించనవసరం లేదు. దానికి తోడు ప్రణబ్‌ముఖర్జీ ఉన్నారు. చిదంబరం తనకు ముందు ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ప్రతిష్టను దెబ్బతీయడానికి అలాంటి ఎత్తుగడలనే ప్రయోగించారు. అయితే ఈసారి చిదంబరం చూపిన హస్తలాఘవం విభిన్నమైనది. ఎన్‌డీఏ, యూపీఏ పాలనా కాలాల వృద్ధి రేట్లను ఆయన... వృద్ధి ఊర్ధ్వ ముఖంగా సాగుతున్నదా లేక అథోముఖంగా పయనిస్తున్నదా అనే ప్రస్తావనే లేకుండా మధ్యంతర కాలపు సగటులను సరిపోల్చారు. కొండమీదికి ఎక్కుతున్నా, దిగువకు పోతున్నా సగటు ఎత్తు మాత్రం ఒక్కటిగానే ఉంటుంది. ఎన్‌డీఏ తనకు సంక్రమించిన అధ్వాన్నపు వృద్ధి రేట్లను 8 శాతానికి పైకి తీసుకుపోయింది. ఉన్నతస్థాయి వృద్ధి రేట్లతో ప్రారంభించిన యూపీఏ ఎగుడు దిగుడుల మధ్య వాటిని కిందకు దిగజార్చింది. చిదంబరం వాదనలు కాంగ్రెస్ పక్షపాతుల కేరింతలను దాటి పయనించలేవు. విలువ కోల్పోయిన ఆదాయాలతో కూరగాయలను కొనుక్కునే ఓటర్‌కు అసలు నిజం తెలుసు.
అధికార పక్షపు కుయుక్తుల శాఖ నడిపేది మరింత విషపూరితమైన వ్యవహారం. జల్లిన బురద కొద్దిగానైనా అంటుకోకపోతుందా అనే భావనతో అది ఆరోపణలను తయారుచేస్తుంది. అయితే బురదను జల్లేప్పుడు మీ చేతులు కూడా మలినం కాక తప్పవు. కుయుక్తుల శాఖ జిత్తులమారి ఎత్తుగడలు ప్రజల్లో చెల్లుబాటు కావు.
ఇవి యూపీఏ పోరాడుతున్న మొదటి ఎన్నికలేమీ కావు. నేటితో పోలిస్తే 2009 ఎన్నికల ప్రచారం దివ్యమైన పరిశుద్ధతను నేర్పే పాఠం లాంటివి. శత్రువుల జాబితాను తయారుచేసి, వారిపైకి బురదజల్లే బ్రిగేడ్‌ను సమీకరించక తప్పని స్థితిలో నేడు అధికార పార్టీ ఉంది. 2009లో సైతం యూపీఏకు ఆందోళన కలిగించిన అంశాలు లేకపోలేదు. వాటిలో ‘ఓటుకు నోటు’ కుంభకోణం తక్కువదేమీ కాదు. అయినాగానీ ఆనాడు కాంగ్రెస్ వద్ద చెప్పుకోడానికి సానుకూలమైన కథనం కూడా ఉండేది. యువతరంలో అది ఆశలను రేకెత్తించగలిగింది. ఆ ఆశలన్నీ ఇప్పుడు బుగ్గయి పోయాయి. ఎన్నికలపరమైన దాని పర్యవసానాలు రోజురోజుకు ప్రస్ఫుటమవుతున్నాయి.
అయితే కాంగ్రెస్‌కు హానికరమైన నష్టాన్ని కలుగజేస్తున్నది అధికార వ్యవస్థలో నెలకొన్న పూర్తిస్థాయి గందరగోళమే. ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రతిపక్షం చేతిలోగాక, కాంగ్రెస్‌పార్టీ చేతుల్లో పదేపదే అవమానాలను ఎదుర్కొంటున్నారు. శిక్షలుపడ్డ రాజకీయ నేతల ఆర్డినెన్స్ విషయంలో ఆ పార్టీలో నెలకొన్న అయోమయం, హఠాత్తుగా పార్టీ వైఖరి తలకిందులు కావడం ఆ గందరగోళంలోని ఒక సంచలనాత్మక ఘటన మాత్రమే. రాహుల్‌గాంధీ, ఆ ఆర్డినెన్స్‌ను పూర్తి అర్థరహితమైనదంటూ తీసిపారేయడానికి ముందు చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, కమల్‌నాథ్‌ల వంటి భారీ వస్తాదులంతా దానికి మద్దుతు పలికినవారే. రాహుల్ భాషను చూస్తే ఒకింత ముందస్తుగా సన్నద్ధమై మాట్లాడినట్టుఉంది. ఆయన మాటలు అత్యున్నత విధానపరమైన వివాదంగా కంటే క్రీడా మైదానంలో మాటకు మాట విసరడం లాగే ధ్వనించాయి. ఏదేమైనా, అదే కాంగ్రెస్ అభిప్రాయం. అయితే మన్మోహన్ తన మంత్రివర్గ సహచరులతో సహా వెంటనే రాజీనామా చేయాలి. ప్రధాన మంత్రికి, అధికార పార్టీకి మధ్య అలాంటి యుద్ధం ఇంతకు మునుపెన్నడూ ఎరుగనిది.
అయితే వ్యవహారం అంతవరకు రాకపోవచ్చు. ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ వైఖరిలోని మార్పునకు కారణం రాజకీయాలే తప్ప సూత్రబద్ధత కాదు, మంత్రివర్గం ఆ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు రాహుల్‌గాంధీ దానిని వ్యతిరేకించ లేదు. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా మారిన తరువాత, ఆ ఆర్డినెన్స్‌పై హడావిడిగా సంతకం చేయాల్సిన అవసరం లేదని నమ్మడానికి తగిన కారణాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపిన తర్వాత ఆయన దాన్ని వ్యతిరేకించారు.
దాదాపు దశాబ్ద కాలంగా ప్రధానిగా ఉన్న మన్మోహన్ వ్యక్తిగత ప్రతిష్టలోని చివరి పెచ్చులు కూడా నుగ్గునుగ్గు కావడం చూడాల్సిరావడం ఇబ్బందికరమే. పాకిస్థాన్‌తో శాంతిని సాధించడానికి, అమెరికాతో గతిశీలమైన నూతన సంబంధాలను నెలకొల్పడానికి మన్మోహన్ చొరవ చూపారు. ఆ రెండు దిశలుగా ఆయన చేసిన కృషి ఒక్కసారే బోర్లపడింది. ఈ వారం అమెరికాలోనే అది తారస్థాయికి చేరడం కాకతాళీయమే. మన్మోహన్ శ్వేతసౌధ సందర్శన ఎలాంటి లక్ష్యాలు లేని పదవీ విరమణ విందులాగా సాదరపూర్వక మైనదే. ఇక నవాజ్ షరీఫ్‌తో ఆయన సంభాషణలు ప్రారంభం కావడానికి ముందే జమ్మూలోని ఉగ్రవాద రక్తపాతంతో నెత్తురోడాయి. మొదటిది ఏ ప్రాధాన్యమూ లేని ఘటన కాగా, రెండోది అసలు మొదలు కానే లేదు.
ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీరు ప్రధానికి భంగపాటు కలిగించేదిగా లేదా కలిగించాల్సిందిగా ఉంది. పాకిస్థాన్‌తో చర్చల నుంచి కాంగ్రెస్ దూరంగా జరిగింది. అంబికాసోనీ వంటి నేతలు బహిరంగంగానే తమ అసమ్మతిని తెలిపారు. కాంగ్రెస్ హిట్‌లిస్ట్‌లో నరేంద్రమోడీ మొట్టమొదటివారైతే, ప్రధాని మన్మోహన్‌ది ఆ తర్వాతి రెండో స్థానం.
మన్మోహన్ ఒక విరాగా లేక గాయాల బాధను ప్రేమించే విపరీత మనస్తత్వం గలవారా? ప్రతిపక్షం చేతిలో దండనకు గురికావడం ఇచ్చిపుచ్చుకునే ప్రజాస్వామిక రాజకీయాల్లో భాగం. సొంత పార్టీ సహచరుల నుంచే తిరస్కార అస్త్రాలకు గురి కావడాన్ని అంగీకరించడం సామాన్యం కాదు. అంత తేలికగా అంతుపట్టని స్వభావం అందుకు అవసరం. మన్మోహన్ బహుశా తాను పయనిస్తున్న నావను కల్లోలానికి గురిచేయరాదని భావిస్తుండవచ్చు. కానీ ఆ నావను నడిపే నావికులే దాన్ని పెను తుఫానులోకి నడుపుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం అనేది ఇంకా మిగిలి లేదు. మనకు ఉన్నదల్లా అనిశ్చితితో కూడిన వాదోపవాదాల్లో తాము ఎక్కడ నిలిచి ఉన్నారో లేదా ఎక్కడ నిలవాలో ఏ మంత్రికీ ఖచ్చితంగా తెలియని పరిస్థితి మాత్రమే. ఒక సాంకేతికమైన నిర్మాణం మాత్రమే ఇప్పుడు అధికారంలో ఉంది. కాగా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఏడాది మార్చిలోగా ఎన్నికల్లో ఘోర పరాజయన్ని నివరించే అద్భుతం ఏదైనా జరగాలని ఇంకా ఆశిస్తూనే ఉంది. అద్భుతాలు జరగాలంటే పరమ పవిత్రులు కావాలి. రాజకీయాల్లో పరమ పవిత్రులు ఉండరు.