
స్వీయాతిశయ యశోభూషణులు
రాహుల్ వివేకశూన్యుడని, చెడిపోయిన పిల్లాడనీ, కేజ్రీవాల్‌ను రభస సృష్టించే అరాచకవాదనీ మోదీ భావిస్తారు. మోదీని హిందూ ఉన్మాదనీ, తన కుటుంబ హక్కయిన అధికారాన్ని దోచుకున్న వ్యక్తనీ రాహుల్ భావిస్తారు.
జాతిహితం
జాతీయ రాజకీయాలను శాసించే ఆ ముగ్గురూ తమకు తామే గొప్పవారమనే దృష్టితో ప్రత్యర్థుల పట్ల తీవ్ర తృణీకారంతో, శత్రుత్వంతో ఉండటం సాధారణమైంది. రాహుల్ వివేకశూన్యుడని, చెడిపోయిన పిల్లాడనీ, కేజ్రీవాల్‌ను రభస సృష్టించే అరాచకవాదనీ మోదీ భావిస్తారు. మోదీని హిందూ ఉన్మాదనీ, తన కుటుంబ హక్కయిన అధికారాన్ని దోచుకున్న వ్యక్తనీ రాహుల్ భావిస్తారు. మోదీ, రాహుల్‌లు దొంగల ముఠాల నేతలనీ, జైళ్లలో ఉండాల్సినవారనీ కేజ్రీవాల్ భావిస్తారు. ఫలితం, అత్యంత విచ్ఛిన్నకర రాజకీయాలు.
నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌లు ముగ్గురినీ ఒకే గాటన కట్టి చూపే వాదన ఇది. ముగ్గురూ పూర్తి భిన్నమైన వ్యక్తులు. అయితే వారిలో ఒకే అసాధారణమైన, ముఖ్య సాధారణ విలక్షణత ఉంది. వారిలో ప్రతి ఒక్కరూ తమను తాము ప్రథమ పురుషలో సంబోధించుకుంటూ ఉంటారు. 2014 ఎన్నికల ప్రచారానికి ముంద టి, తర్వాతి మోదీ ఉపన్యా సాలను మరోసారి విని చూడండి. మోదీ ఇది చేయడు లేదా ఇది మోదీ మాత్రమే చేస్తాడు అనడం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది.
ఇక కేజ్రీవాల్ ఈ విద్యలో ఆరితేరిన వారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ‘‘కేజ్రీవాల్’’ మాత్రమే ఢిల్లీని బాగు చేయగలరు అనేది ఆయన సర్వసాధారణ ప్రయోగంగా ఉండేది. వాస్తవానికి ఆయన ఢిల్లీలోని ఒక కిక్కిరిసిన ఒక పేద మురికివాడలోని బహిరంగసభలో తనను తాను ‘‘కేజ్రీవాల్’’ అని మూడుసార్లు సంబోధిం చుకున్నారు. అంతేకాదు, బీజేపీ వారి పిల్లలు కూడా ఆకలి కడుపులతో నిద్రించాల్సి వస్తోందని తనకు తెలుసనీ, ‘‘కేజ్రీవాల్ మాత్రమే వారి సమస్యలను పరిష్కరించగలడు’’ కాబట్టి ఆప్‌లో చేరిపోవాలనీ వారికి చెప్పారు. గత వారం రాహుల్ షకుర్‌బస్తీ మురికివాడ కూల్చివేత నిర్వాసితు లతో మాట్లాడుతూ.. ఈసారి ఏ మురికివాడను కూలదోయడానికి వచ్చినా వెంటనే ‘‘రాహుల్‌గాంధీ’’ని పిలవండి, ‘‘ఆయన (‘నేను’ కాదు) ఇక ఏ మురికివాడనూ నిర్మూలించనివ్వరు’’.
‘ప్రథమ’తోటే చిక్కులు
జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్రధారులు ముగ్గురూ ఇలా తమను తాము ప్రథమ పురుషలో తమ గొప్పదనాన్ని తామే అతిశయింపజేసుకుని సంబో ధించుకోవడం ఆశ్చర్యకరమైన కాకతాళీయత. గతంలో, కనీసం దాదాపు గత నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో ఇది ఎక్కడా ఎరుగనిదనేది నిస్సందేహం. ఇందిర, రాజీవ్, వీపీ సింగ్, వాజ్‌పేయీ, అద్వానీ, సోనియా, అంతా ప్రజా దరణగల నేతలే. అయినా వారెవరూ ఇలా ఎన్నడూ మాట్లాడలేదు. నెహ్రూ, గాంధీలూ మాట్లాడలేదు. వాజ్‌పేయీ ఒకే ఒక్క సందర్భంలో అలాంటి ప్రథమ పురుష ప్రయోగం చేశారు. అదీ కూడా ఆయన తనను తాను తప్పు పట్టుకునే విధంగానే అన్నారు.
కార్గిల్ యుద్ధం జరుగుతుండగా ఆయన కార్యాలయం నాకు ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన్ను కలుసుకో డానికి సమయం ఇచ్చింది. కానీ, నేను ఒక గంటకుపైగా వేచి ఉండాల్సి వచ్చింది. నేను ఆయన్ను ఆట పట్టిద్దామని కార్గిల్‌లో ముమ్మరమైన పోరు సాగుతుండగా పగటి పూట ఎలా నిద్ర పోగలుగుతున్నారన్నాను. పరి హాసం గా, తెచ్చిపెట్టుకున్న అతి గాబరాతో ‘‘అవును, అవును, ఒక రైఫిల్ తెచ్చి ఇవ్వండి, అటల్జీ యుద్ధరంగానికి పోతాడు, దేశానికి ఇప్పుడు జవాన్ల కొరత వచ్చి పడింది!’’అన్నారు. ఆయనెన్నడూ వ్యవహార శైలిలో అలా అనలేదు.
తమ గురించి తాము ఇలా ప్రథమ పురుషలో మాట్లాడటం కొత్త పరి ణామం. ఇదేమైనా అహంకారోన్మాదం పెరగడాన్ని సూచిస్తోందా? విచ్ఛిన్న రాజకీయాలకు, పార్లమెంటు పని చేయలేకపోవడానికి సైతం అదే కారణ మా? ఏదేమైనా మన అతి పెద్ద నేతలు ఒకరితో ఒకరు తప్ప ఎక్కడైనా మాట్లాడుతుండే పరిస్థితి నెలకొంది. రాజీ, ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు.
చరిత్ర చారెడు మానసిక రుగ్మత
జనరంజక మనస్తత్వశాస్త్రంతో ఉన్న ప్రమాదాలేమిటో నాకు తెలుసు. అయినా ఇది దాన్ని శోధించాల్సిన పరిస్థితి. మిమ్మల్ని మీరు ప్రథమ పురుషలో సంబోధించుకోవడాన్ని ‘‘ఇల్లీయిజం’’ అంటారని కొంత పరిశోధన తదుపరి నాకు తెలిసింది. చరిత్రలో జూలియస్ సీజర్ నుంచి నెపోలియన్ వరకు అక్కడి నుంచి (కొన్నిసార్లు) మార్గరేట్ థాచర్, మన దారాసింగ్ వరకు అలాంటి పదప్రయోగం చేశారు. సాల్వడార్ డాలీ ఒక ఇంటర్వ్యూలో మాత్రమే తన గురించి ప్రథమ పురుషను ఉపయోగించారు.
వీరంతా నైపుణ్యంగలవారు, విజయవంతమైన వారు, గొప్ప ప్రాబల్యాన్ని, ప్రాచు ర్యాన్ని పొందినవారు. కానీ వారిలో ఎవరూ హేతుబద్ధమైనవారు, రాజీపడేవారు, సర్దుబాటు స్వభావం గలవారూ కారు. ఆ మూడు లక్షణాలూ నేటి మన చర్చలో కనిపించడం లేదు. ఈ అంశాన్ని శతాబ్దాల తరబడి చర్చిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దాన్ని రాజసాన్ని వ్యక్తం చేసే ‘‘మేము’’తో పోలుస్తున్నారు. మార్క్‌టై్వన్ ఇక్కడా చమత్కారాన్ని వదల్లేదు. ‘‘రాజులు, అధ్యక్షులు, సంపాదకులు, కడుపులో ఏలిక పాము లున్నవారు’’ మాత్రమే సంపాదకీయపరమైన ‘‘మేము’’ అనే పదాన్ని ప్రయోగించే హక్కును కలిగి ఉన్నారన్నాడు.
ఈ ప్రత్యేక మానసిక స్థితిని చాలా మంది నిపుణులు విశ్లేషించారు. వాటిలో తాజాది, ఎక్కువగా వర్తించేది బెంగళూరుకు చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త శ్యామ్‌భట్‌ది. ‘టైమ్స్ నౌ’ అర్నాబ్ గోస్వామికి రాహుల్ ఇచ్చిన ఇంటర్వ్యూ బాగా చర్చకు వచ్చింది. అందులో ఆయన తనను తాను ‘‘రాహుల్ గాంధీ’’ అని సంబోధించుకున్నారు. ఒక సందర్భంలో వరుసగా రెండు వాక్యాల్లో మూడు సార్లన్నారు: ‘‘...రాహుల్‌గాంధీ ఎవరో, ఏమిటో, రాహుల్ గాంధీ ఉన్న పరిస్థితులేమిటో మీరు కాస్త తెలుసుకోవాలి. ఆ పనిచేస్తే మీకు రాహుల్ గాంధీ దేనికి భయపడతారు, దేనికి భయపడరనే ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది.’’
ఒక మనస్తత్వ శాస్త్రవేత్తగా నన్నిది బాగా ఆకర్షించింది. తనను తాను ప్రథమ పురుషలో సంబోధించుకోవడం (ఇల్లీయిజం అనే దృగంశం) మానసి కపరమైన మౌలిక సమస్యను సూచిస్తుంది... ఇల్లీయిజం తనతో తనకున్న ఇబ్బందికి సూచన... స్వయం మోహితత్వానికి సంబంధించిన గాయాలను తమకు సంబంధించిన కుహనా గొప్పతనంతో తాదాత్మ్యం చెందడం ద్వారా అలాంటివారు రక్షణ పొందుతారు. కాగా వాస్తవంలో వారి వ్యక్తిత్వం చాలా దుర్భలమైనది...’’ నేనిక ఈ విషయాన్ని మిగతా మనస్తత్వ శాస్త్రవేత్తల చర్చకు వదిలేస్తాను. పార్లమెంటరీ రాజకీయాలకు ఆవశ్యక లక్షణాలైన మౌలి కమైన నమ్రత, సర్దుబాటుతత్వం ప్రజా జీవితంలోని ప్రముఖులలో లోపిం చడం అనే వాస్తవం మాత్రం రాజకీయంగా వర్తించేది. అలా అతిశయించిన అంతరాత్మ ఉన్న వ్యక్తి, తను తప్పుకావచ్చని అంగీకరిస్తాడని ఆశించలేరు. నేనెప్పుడూ తప్పు కాకపోయినట్టయితే, ఆవతలి వ్యక్తి చెప్పేదానిలోనూ ఏదో సమంజసమైనది ఎలా ఉంటుంది?
‘ఎన్‌డీటీవీ’ వారి ‘వాక్ ద టాక్’ కార్యక్రమంలో ఎల్‌కే అద్వానీ నాతో మాట్లాడుతూ (జూన్ 2008), బీజేపీని కాంగ్రెస్ శత్రువుగా చూడటమే ఆ పార్టీతో వ్యవహరించడంలో ఉన్న ఒక ఇబ్బంది అన్నారు. నేడు, ఆ ముగ్గురు నేతలకూ తమ స్వీయ గొప్పదనం (లేదా అభద్రత?) దృష్టి కోణం నుంచి ప్రత్యర్థుల పట్ల విపరీతమైన తృణీకారభావం, క్రూర శత్రుభావమూ సర్వ సాధారణమైపోయాయి. రాహుల్ వివేకశూన్యుడని, చెడిపోయిన పిల్లాడనీ, కేజ్రీవాల్‌ను రభస సృష్టించే అరాచకవాదనీ మోదీ భావిస్తారు. రాహుల్, మోదీని హిందూ ఉన్మాదనీ, తన కుటుంబ గుత్త హక్కయిన గుజరాత్‌ను చేజి క్కించేసుకోవడమే గాక జాతీయాధికారాన్ని సైతం దోచుకున్న వ్యక్తనీ భావిస్తారు. ఇక కేజ్రీవాల్... మోదీ, రాహుల్‌లు ఇద్దరూ దొంగల ముఠాల నేతలనీ, వారంతా జైళ్లలో ఉండాల్సినవారనీ భావిస్తారు.
ముగ్గురిదీ ఫ్యూడల్ మనస్తత్వమే
ఫలితం, ఇటీవలి చరిత్రలోనే అత్యంత విచ్ఛిన్నకరమైన నేటి రాజకీయాలు. పీవీ నరసింహారావు మైనారిటీలో ఉంటూ ఐదేళ్లు సాగించిన పాలనలో చట్టాలు ఆమోదం పొందాయి. వీపీ సింగ్, దేవెగౌడ, గుజ్రాల్‌ల దినదిన గండం ప్రభుత్వాలూ చట్టాలు ఆమోదం పొందాయి. నేడు లోక్‌సభలో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నా చట్టాలు చేయలేకపోతున్నాం. సంఖ్యల సంగతి ఎలా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ఎల్లప్పుడూ ప్రతిపక్షం ఉంటుందని అంగీకరించే విశాల హృదయం ఆ పార్టీ నాయకత్వానికి లేకపోవడమే అందుకు కారణం. గెలిచినవారిదే అంతా అనేది ప్యూడల్ మనస్తత్వం. ఆ కారణంగానే బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష నాయక హోదాను నిరాక రించింది.
అలాగే, రాహుల్ కాంగ్రెస్ కూడా ప్రజాభిప్రాయం బీజేపీకి లోక్‌సభలో 282 సీట్లను కట్టబెట్టి, తన సొంత బలాన్ని 44 లేదా 45కు కుదిం చిందన్న తర్కాన్ని గౌరవించడమూ లేదు, పైగా చాలా తలపొగరుతనాన్నీ ప్రదర్శిస్తోంది. తన బలాన్ని పలు రెట్లు హెచ్చించి చూపే సామాజిక మాధ్యమాలు, టీవీ ప్రైమ్ టైమ్ కార్యక్రమాల అండతో కేజ్రీవాల్ కూడా ఆ రెండు పార్టీలను అలాంటి తృణీకార దృష్టితోనే చూస్తున్నారు. మరింత సంప్రదాయక కాలంలోనైతే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీవంటి వివేకవంతులు ఎవరైనా జోక్యం చేసుకుని, శాంతి నెలకొనేలా చేయాలంటూ ముగించే వాడిని. కానీ, మన రాజకీయాలను శాసించే ఆ ముగ్గురి వ్యక్తిత్వాలూ ఒకే విధమైనవైన దృష్ట్యా అదిప్పుడు చాలా కష్టమనిపిస్తోంది.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta