ఆదివారం సంచికలో‘ పీవీ, మన్మోహన్ ఔర్ సోనియా’ శీర్షికతో ప్రచురించిన త్రికాలమ్‌లో ఒక ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ ‘అట్టర్ నాన్సెన్స్’ అని అభివర్ణించినట్టు వచ్చిన అంశంపై ఒక వివరణ.
ఆదివారం సంచికలో‘ పీవీ, మన్మోహన్ ఔర్ సోనియా’ శీర్షికతో ప్రచురించిన త్రికాలమ్‌లో ఒక ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ ‘అట్టర్ నాన్సెన్స్’ అని అభివర్ణించినట్టు వచ్చిన అంశంపై ఒక వివరణ. పార్లమెంటు సభ్యుడు కానీ, శాసనసభ్యుడు కానీ ఏదైనా కేసులో దోషిగా న్యాయస్థానం నిర్ణయిస్తే సదరు సభ్యుల సభ్యత్వం రద్దు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎన్నికల చట్టంలో చట్టసభల సభ్యులకు అనుకూలంగా ఉన్న నిబంధనను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడం వల,్ల చట్టసభల సభ్యులు దిగువ కోర్టుల నిర్ణయాలను శిరసావహించి సభ్యత్వాన్ని వదులుకోవలసి వస్తుంది.
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వమ్ము చేసే లక్ష్యంతో యూపీఏ సర్కార్ 2013 ఆగస్టు 17వ తేదీన అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. సుప్రీం నిర్ణయానికి విరుగుడుగా ఆర్డినెన్స్ జారీ చేయాలన్న ప్రతిపాదనకు ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ సుముఖత వ్యక్తం చేసినట్టు ప్రభుత్వం చెప్పింది. చట్టసభలో సభ్యులుగా ఉన్నవారిని దోషులుగా న్యాయస్థానాలు నిర్ణయించినప్పటికీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ మూడు మాసాలలోగా ఎగువ కోర్టుకు అప్పీలు చేసుకున్నట్లయితే సభ్యులుగా కొనసాగవచ్చునంటూ ఒక ఆర్డినెన్స్ జారీ చేయించాలని యూపీఏ మంత్రిమండలి నిర్ణయించింది. వెంటనే ఈ నిర్ణయాన్ని బీజేపీ, వామపక్షాలు వ్యతిరేకించాయి. బీజేపీ అగ్రనేత అద్వానీ నాయకత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గం రాష్ట్రపతిని కలుసుకొని ఆర్డినెన్స్ జారీ చేయవద్దంటూ అభ్యర్థించింది. ఆర్డినెన్స్ ప్రతిపాదన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చేరిన తర్వాత ఆయన న్యాయశాఖ మంత్రిని పిలిపించుకొని ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటు పరిశీలనలో ఉండగా ఇప్పుడు ఆర్డినెన్స్ ఎందుకంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం పర్యవేక్షకుడు అజయ్ మాకెన్ (మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి) మీడియాతో మాట్లాడుతున్నారు. ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.
అంతలోనే అక్కడికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వెళ్ళి ‘ఈ ఆర్డినెన్స్ పరమ చెత్తది. దీన్ని చించి అవతల పారేయాలి (దిస్ ఆర్డినెన్స్ ఈజ్ ఎ కంప్లీట్ నాన్సెన్స్, షుడ్ బీ టార్న్ అండ్ త్రోన్ అవే) అంటూ నాటకీయంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రాహుల్ నిష్ర్కమించిన అనంతరం మాకెన్ మాట్లాడుతూ, ‘రాహుల్‌గాంధీ ఇప్పుడు చెప్పిందే మా పార్టీ విధానం’ అంటూ ప్రకటించారు. ఇంత జరిగినా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ మౌనంగా ఉండటాన్ని చాలామంది రాజకీయ పరిశీలకులూ, వ్యాఖ్యాతలూ తప్పుపట్టారు.
- ఎడిటర్