ప్రజాస్వామ్య స్వాప్నికుడు కొఠారి | What Rajni Kothari had predicted for India | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య స్వాప్నికుడు కొఠారి

Published Thu, Jan 29 2015 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

ప్రజాస్వామ్య స్వాప్నికుడు కొఠారి

ప్రజాస్వామ్య స్వాప్నికుడు కొఠారి

ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ప్రభుత్వాలదే బాధ్యతనే వాదనను రజనీ కొఠారి తిరస్కరించారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బలమైనశక్తి ప్రజల భాగస్వామ్యమేనని విశ్వసించారు.  మన ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల భాగస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నదని అభిప్రాయపడ్డారు. రోజు రోజుకీ ప్రభుత్వాలు కార్పొరేట్ రంగంవైపు పరుగులు తీస్తూ నూతన పెట్టుబడిదారీ వ్యవస్థకు జీవం పోస్తున్నాయని స్పష్టం చేశారు. అందుకే అన్నిరకాల దోపిడీ పీడనల నుంచి విమోచన కలిగించే ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
 
 ‘‘కిందిస్థాయిలో ప్రజలు చైతన్యవంతులు కావడం ఎంతో అవసరం. ఇది వాంఛనీయం కూడా. ఆకలికి, అవమానాలకు వ్యతిరేకంగా నిలబడేది నిజమైన ప్రజాబలమే. అంతేకానీ, పార్టీల వ్యవస్థ, ఎన్నికలు, ఇతర సంప్రదాయ పద్ధతులు ఏవీ నిజమైన ప్రత్యామ్నాయాలు కావు. రోజూ ప్రజల్లో పెరుగు తున్న అశాంతికి, అసంతృప్తికి సరైన వేదిక లభిస్తే అది ఎన్నో మార్పులకు శ్రీకారం కాగలుగుతుంది.’’ ఈ మాటలన్నది ఎవరో కాదు ప్రముఖ రాజనీతి వేత్త, విద్యావేత్త, పరిశోధకులు, మానవ హక్కుల ఉద్యమ నాయకులు రజనీ కొఠారి. ఈ కొద్ది మాటలతోనే రాజనీతికి నిజమైన భాష్యం చెప్పిన ఆయన జనవరి 19న మన నుంచి శాశ్వతంగా నిష్ర్కమించారు. సత్యాన్వేషణే ఊపిరిగా సాగిన ఆయన జీవితం రాజనీతి శాస్త్రంలో కొత్త ఒరవడిని సృష్టిం చింది, ఎన్నో వినూత్న కోణాలను స్పృశించింది. రాజకీయాలు సామాజిక ప్రగతికి, ప్రజాస్వామ్య మనుగడకు దోహదపడాల్సిన ఆవశ్యకతను ఆయన పరిశోధనలు, రచనలు అడుగడుగునా నొక్కి చెప్పాయి.
 
 కొఠారి 1928లో మహారాష్ట్రలోని ఒక జైన వ్యాపారి కుటుంబంలో పుట్టిన ప్పటికీ, సంప్రదాయ వృత్తిని కాదని అధ్యాపకునిగా జీవనాన్ని ప్రారంభిం చారు. తదుపరి బరోడాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేస్తూ సత్యశోధనకు ఉపక్రమించారు. 1961లో ‘ఎకనమిక్ వీక్లీ’లో (నేటి ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ) వరుసగా ఆరు వ్యాసాలు రాశారు. ‘భారత రాజకీయాలు, రూపం, సారం’ అనే శీర్షికతో సాగిన ఈ వ్యాసాలు ఆ రోజుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
 
 ప్రముఖ విద్యావేత్త రమేష్ థాపర్ నిర్వహణలోని ‘సెమినార్’లో కూడా ఆయన రాశారు. ఆ రచనలతో ప్రభావితులైన ప్రొఫెసర్ శ్యాంచరణ్ దూబే తాను నడుపుతున్న ‘నేషనల్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్’లో అసిస్టెంట్ డెరైక్ట ర్‌గా పనిచేయాలని ఆహ్వానించారు. కానీ స్వతంత్రంగా ఆలోచించే తత్వం ఉన్న రజనీ కొఠారి 1963లో తానే స్వయంగా ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవల పింగ్ సొసైటీస్’ (సీఎస్‌డీఎస్) అనే సంస్థను స్థాపించారు. ఇటీవలే ఈ సంస్థ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ప్రముఖ మేధావులు ఆశీష్ నంది, డీఎల్ సేథ్, రామాశ్రయ్ రాయ్, బషీరుద్దీన్ అహ్మద్‌ల వంటివారు సీఎస్‌డీఎస్‌లో కొఠారితో కలసి పనిచేశారు. రచనలకే పరిమితం గాక ఆయన పలు సామా జిక ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం ఆయన కార్యాచరణకు అంతఃసూత్రం. అందుకే ఆయన తన రచనా వ్యాసంగమంతటా, మొదటి రచన నుంచి చివరి వరకు ప్రజాస్వామ్యం మీదనే దృష్టిని కేంద్రీకరించాడు.
 
 భారతదేశంలో రాజకీయాలు
 1961లో ఆయన రాసిన ఆరు వ్యాసాల సంపూర్ణ రూపమే ‘పాలిటిక్స్ ఇన్ ఇండియా’ (1970). అది అంతవరకు రాజనీతి శాస్త్రంలో కొనసాగుతున్న సాంప్రదాయక చింతనకు ముగింపు పలికింది. కులవ్యవస్థను అర్థం చేసుకో కుండా భారత రాజకీయాలను చర్చించలేమని ఆయన అందులో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ధృక్పథం దిగుమతి చేసుకునే విలాస వస్తువు కాదని, మన దేశ పరిస్థితులకు దాన్ని అన్వయించుకోవాలని, మన సామాజిక పరిస్థితులకు తగిన ప్రజాస్వామ్య విధానాలను కొత్తగా మనం రూపొందిం చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ వలస పాలనలోని మంచి, చెడులను తులనాత్మకంగా చర్చించారు. పాశ్చాత్య చదువుల వలన ఆవిర్భ వించిన మధ్యతరగతి వర్గం రాజకీయ మార్పులకు సారథి అయిందని భావించారు.
 
 హిందూ పునరుజ్జీవనానికి బ్రిటిష్ పాలన కూడా దోహదపడిందని, అందువల్లనే హిందూ భావజాలం నుంచి వచ్చిన నాయకులే మొదటి ఐదు దశాబ్దాల జాతీయోద్యమాన్ని నడిపారని ఆయన పేర్కొన్నారు. ఆధునికత వైపు దృష్టి, సంస్థాగత నిర్మాణ వ్యూహాలు, రాజకీయ పార్టీల వ్యవస్థ, ఐక్య కూటముల ఏర్పాటు, సామాజిక నిర్మాణాలు వంటి స్వాతంత్య్రానంతర పరిణామాలను కూడా ఆయన ఈ రచనలో వివరించారు. భారత రాజకీ యాల్లో కులం పాత్రను సంక్షిప్తంగా స్పృశించారు. దేశాభివృద్ధిలో రాజకీయా ర్థిక విధానం పాత్ర, అంతర్జాతీయ పరిస్థితులను వివరిస్తూ భవిష్యత్ పథానికి మార్గనిర్దేశనం చేశారు. ‘‘భారత చారిత్రక పరిణామక్రమంలో ప్రజాస్వామ్య రాజకీయాలు క్రియాశీల పాత్ర పోషించాయి, భవిష్యత్తులో ఇది కొనసా గాలి’’ అని ఉద్బోధించారు.
 
 భారత రాజకీయాల్లో కులం
 కొఠారి వెలువరించిన రెండో పుస్తకం ‘కాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’ (1973) నూతన ఆలోచనలకు తెరలేపింది. 1970 దశకం వచ్చే సరికి వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర రాజకీయశక్తుల ఆవిర్భావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ అంశంపై సీఎస్‌డీఎస్‌తో క్షేత్రస్థాయి అధ్యయనాలను చేయించి మరీ ఆయన ఈ పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆ పుస్తకానికి రాసిన ఉపోద్ఘాతంలో ఆయన కులం, రాజకీయాలు ఒకే సమయంలో పరస్పర విరుద్ధంగానూ, కలగలిసి సాగుతున్నాయని విశ్లేషించారు. ‘‘ఆధునికతకు, సాంప్రదాయానికీ, మొత్తంగా సమాజానికి, రాజకీయాలకూ మధ్య వైరుధ్యం సాగుతున్నది’’ అని ప్రకటించారు. మహారాష్ట్రలో మహర్‌ల రాజకీయ ప్రస్థానం, గుజరాత్‌లో క్షత్రియుల సంఘటన, తమిళనాడులో నాడార్‌ల రాజకీయ అరంగేట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ, రెడ్డి కులాల ఆధిపత్యం, రాజస్థాన్‌లోని కుల సమీకరణాలు, బిహార్‌లో కులసామాజిక వర్గాల ఐక్య సంఘటన, ఇలా వివిధ రాష్ట్రాల్లో కొత్తగా పుట్టుకొస్తున్న రాజకీయ సంస్థల గురించి, నూతనంగా ముందుకు దూసుకు వస్తున్న నాయకుల గురించి అత్యంత శాస్త్రీయ పద్ధతిలో ఆయన అధ్యయనం జరిపించారు. ఒకరకంగా చెప్పాలంటే, రాజకీయాలు కులాలకు అతీతంగా ఉన్నాయనే భావనలోనే మేధావులుండేవారు. అయితే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల ఆవిర్భావం అనేది కేవలం రాజకీయ కారణాల వల్ల సంభవిస్తున్న పరిణామం మాత్రమే కాదని ఆయన గుర్తించారు. రాజకీయాల్లో తమకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదనే భావన ఆయా కులాలకు ఏర్పడటం కూడా అందుకు కారణమని ఆయన తేల్చి చెప్పారు. ఆ తరువాతి పరిణామాలు అదే విషయాన్ని రుజువు చేసి చూపాయి. 1970 దశకం చివరిలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
 
  కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పరచిన జనతా పార్టీ వివిధ రాజకీయ పార్టీల కలయిక మాత్రమే కాదు. వివిధ కులాల సమ్మేళ నంతో కూడిన రాజకీయ వేదిక కూడా. బిహార్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర కొన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణేతర పార్టీలు ఉనికిలోకి వచ్చిన విషయం మనకు తెలుసు. నేడు రాజకీయాల్లో కులం పాత్రను అధ్యయనం చేయాలను కునే వారెవరైనా మొదట ‘కాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’తో ప్రారంభించా ల్సిందే. భారత రాజకీయాలను ఆయన ఏదో ఒక సిద్ధాంతం వెలుగులో అధ్య యనం చేయలేదు. అందువల్లనే చాలా నిజాయితీగా అధ్యయనం చేయగలి గారు. ‘‘నేనిక్కడ ఒక విషయం ఒప్పుకోవాలి. నేను సాంప్రదాయక జాతీయ వాదినీ కాదు, అట్లా అని పాశ్చాత్య రాజకీయ భావజాలానికి లోబడీ లేను. నేను ఎటువంటి రాజకీయ సిద్ధాంతాలను తలకి ఎత్తుకోలేదు. అందువల్లనే స్వతంత్రంగా ఆలోచిస్తూ, అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం సులభ మైంది’’ అని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
 
 ప్రజాస్వామ్యంపై పునరాలోచన
 కొఠారీ ‘రీథింకింగ్ డెమొక్రసీ’ మనకొక ప్రజాస్వామ్య పెన్నిధిని అందించిం ది. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎదురవుతున్న సవా ళ్లను, అనుసరించాల్సిన మార్గాలను ఇందులో కొఠారి సూచించారు. ఆయన రాత కోతలకు పరిమితమైన మేధావి కాదు. తాను నమ్మిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆచరణ ద్వారా కూడా బలోపేతం చేయాలని చూసిన వారు. తీవ్ర నిర్బంధం అమలు జరిగిన ఎమర్జెన్సీ రోజుల్లోనే ఆయన ఢిల్లీలో ‘పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్’ను (పీయూసీఎల్) స్థాపించి, 1984 వరకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఎమర్జెన్సీలో జరిగిన పలు అరాచకాలను బయట పెట్టి దేశవ్యాప్త ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాన్ని సాగించారు. మన రాష్ట్ర పౌరహక్కుల ఉద్యమానికి ఆద్యులైన కన్నబీరన్ కూడా పీయూసీఎల్‌లో జాతీయస్థాయి బాధ్యతలు నిర్వహించారు.
 
  ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ప్రభుత్వాలది మాత్రమే బాధ్యత అనే వాదనను కొఠారి తిరస్కరించారు. ప్రజల భాగస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బలమైన శక్తి అని భావించారు. ‘‘ప్రజాస్వామ్యం కింది స్థాయి ప్రజల ద్వారా మాత్రమే మనుగడ సాగించగలదు. ఇది కేవలం గొప్ప నాయకుల ద్వారా సాధ్యం కాదు. శక్తివంతులైన, బాధ్యతాయుతమైన పౌరుల చైతన్యమే దీనికి పునాది’’. దేశంలో అమలులో ఉన్న ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంపై రజనీ కొఠారికి సదభిప్రాయం లేదు.
 
  ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల భాగస్వా మ్యాన్ని దెబ్బతీస్తున్నదని ఆయన అభిప్రాయం. ప్రజాస్వామ్యానికి ఎదురవు తున్న మరొక సవాలును కూడా ఆయన మనముందుంచారు. రోజు రోజుకీ ప్రభుత్వాలు కార్పొరేట్ రంగంవైపు పరుగులు తీస్తూ కొత్త పెట్టుబడిదారీ వ్యవస్థకు జీవం పోస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఆయన ‘రీథింకింగ్ డెమొక్రసీ‘లో అన్ని రకాల దోపిడీ పీడనల నుంచి విమోచన కలిగించే ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్ నం: 9705566213)
 - మల్లెపల్లి లక్ష్మయ్య

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement