
‘ఏకైక’ హోదాతో ఏంచేస్తారు?
నేటి ఏకైక ‘జాతీయ’ పార్టీ హోదాతో బీజేపీ నాయకత్వం ఏం చేస్తుందో ఇంకా స్పష్టం కాలేదు. ఇప్పటికైనా వారు వాగ్దానం చేస్తున్న ‘అభివృద్ధి’ని ఆచరణలో చూపడం కోసం ప్రయత్నిస్తారా? లేక విభజనాత్మక, ప్రతీఘాతక అజెండాతో దేశాన్ని పునర్నిర్వచించాలనే తమ కృషిలో ముందుకు సాగుతారా? సంఘ్ పరివార్ ఈ రెండూ చేయాలని కోరుకునే అవకాశం ఎక్కువ. ఉత్తమ పాలననిచ్చేదిగా బీజేపీని ప్రయోగిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్, దాని అను బంధ సంస్థలూ తమ మౌలిక హిందుత్వ అంజెండాను ముందుకు నెట్టే కృషి చేయవచ్చు.
తాజా శాసనసభల ఎన్నికల్లో అసోంను భారతీయ జనతా పార్టీ చేజి క్కించుకోగా, కేరళను వామపక్షాలు హస్తగతం చేసుకున్నాయి. ఇక బెంగా ల్‌లో మమతా బెనర్జీ, జయలలిత తిరిగి అధికారంలోకి వచ్చారు. ఒక ప్పడు దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతం, ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో ఆధిపత్యశక్తిగా ఉన్న ప్రధాన ‘జాతీయ’ పార్టీగా కీర్తిగాంచిన కాంగ్రెస్ నేడు ఘనకీర్తిగల ప్రాంతీయ పార్టీకి మించి మరేమీ కాదనే వాస్త వాన్ని ఈ ఫలితాలు ధృవీకరించాయి.
నేడు మనం చూస్తున్న ఈ కాంగ్రెస్ క్షీణత విడి విడిగా ఆ పార్టీ, ప్రత్యే కించి 2013 నుంచి ఎడతెరిపి లేకుండా ఎదుర్కొంటున్న ఎన్నికల పరాజ యాలన్నింటి మొత్తం మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం గలది. రాజస్థాన్, ఢి ల్లీలలోనే గాక ఆ పార్టీ హరియాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ-కశ్మీర్‌లలో... ఇప్పుడు కేరళ, అసోంలలో అధికారాన్ని పోగొట్టుకుంది. వీటిలో ప్రతి చోటా అది తన ఓట్ల వాటాను కూడా కోల్పోయింది. ఓట్ల శాతాన్ని నిలబెట్టుకున్న లేదా విస్తరింపజేసుకోగలిగిన ప్రతి చోటా అది శక్తివంతమైన ప్రాంతీయ శక్తుల పుణ్యమే. తమిళనాడులో డీఎంకేతో, పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలతో, బిహార్‌లో ఆర్జేడీ- జేడీయూ(యు)తో చెలిమి దానికి అలాగే లాభించింది. అసోం (హేమంత బిశ్వశర్మ), తమిళనాడు(జీ వాసన్), అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సీనియర్ పార్టీ నేతలు పార్టీని వీడటం కాంగ్రెస్ ప్రాభవ క్షీణతకు అనధికా రికమైన కొలబద్ధ అవుతుంది.
ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో కాంగ్రెస్ ప్రధాన శక్తి కాకుండా పోయిన నాటి తొలి క్షీణ దశలలో... ప్రాంతీయ శక్తులతో పొత్తు కలవాలా లేక ఒంటరిగా బరిలోకి దిగాలా? అనే చర్చ ఆ పార్టీలో అంతర్గతంగా జరుగు తుండేది. నేడు ప్రాంతీయ పార్టీలతో కలిసినా, విడిపోయినా దానికి పరా భవం తప్పకపోవడం ఈ క్షీణత ఎంత వేగంగా సాగుతోందో తెలుపు తుంది. అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఆల్ ఇండియా యునెటైడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌తో తెగతెంపులు చేసుకున్నా అది ఓడిపోయింది. బెంగాల్‌లో వామపక్షాలతో చేయికలిపి వాటి కంటే ఎక్కువ సీట్లను సంపాదించగలిగినా... ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీకి లభిం చిన ఓట్ల శాతంతో పోలిస్తే దాని ఓట్ల శాతం స్వల్పంగానే ఎక్కువ.
అవిభక్త భారత కమ్యూనిస్టు పార్టీ ఒకప్పుడు దేశంలోని రెండవ అతి ముఖ్య జాతీయ పార్టీగా ఉండేది. కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. కానీ, పశ్చిమబెంగాల్‌లో వామపక్షాలు తుడిచిపెట్టుకుపోయాయి. దాన్ని నివారించాలనే అవి అక్కడ కాంగ్రెస్‌తో సమస్యాత్మకమైన పొత్తుకు సిద్ధపడ్డా, అది జరగక తప్పలేదు. కేరళ గెలుపులోని సంతోషాన్ని అది హరించేసింది.
విస్తరిస్తున్న కమలం
ప్రధానంగా అమిత్ షా, ఆయన సలహాదారుల సముచితం కాని, విభజన వాద ప్రచారం వల్ల బీజేపీ ఢిల్లీ, బిహార్‌లలో పెద్ద ఎదురు దెబ్బలు తిన్నది. అయినాగానీ దేశంలోని నిజమైన ఏకైక జాతీయ పార్టీగా దాని స్వభా వాన్ని నిరాకరించలేం. అసోం గణపరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ వంటి ముఖ్య ప్రాంతీయ శక్తులతో కలసే అయినా... అసోంలో బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్‌తో పోల్చ దగిన స్థాయి ఓట్ల వాటాను తనకు తాను సాధించగలిగింది. పశ్చిమ బెంగాల్‌లో అది తన ఓట్ల వాటాను 2011తో పోలిస్తే రెట్టింపునకు పెంచు కోగలిగింది. చూడబోతే కాంగ్రెస్ ఓట్ల వాటా కంటే దానికి దాదాపు ఒక్క శాతం మాత్రమే తక్కువగా లభించినట్టుంది.
ఈ ఎన్నికల్లో అది బెంగా ల్‌లో రెండు సీట్లను, కేరళలో ఒక్క సీటును మాత్రమే గెల్చుకున్నా... ఆ రెండు శాసనసభలలో బీజేపీ ప్రవేశం చెప్పుకోదగినదే. కేరళలో ఈసారి పోలైన ఓట్లలో దాదాపు 10.7% బీజేపీకి లభించాయి. ఇది, 2011తో పోలిస్తే ఎక్కువ కావడమే కాదు, 2014 ‘మోదీ గాలి’ కంటే కూడా ఎక్కువ. బీజేపీ ఆ రాష్ట్రంలో పై నుంచి రుద్దినదిగా కాక, స్థానిక నిర్మాణంతో అభివృద్ధి చెందుతున్న పార్టీగా ఆవిర్భవిస్తోందని ఇది సూచిస్తుంది. అయితే తమిళనాడు నేటికీ బీజేపీకి అననుకూలమైనదే. గత నాలుగు దశాబ్దాలుగా ఆ రాష్ట్రాన్ని రెండు ద్రవిడ పార్టీలు ఎంత సమర్థవంతంగా పంచేసుకున్నాయంటే... ‘జాతీయ’ పార్టీలు అక్కడ వాటికి తోకలుగా ఉండటానికి మించి చేయగలిగింది పెద్దగా ఏమీలేదు.
జాతీయ పర్యవసానాలు
నేటి ఏకైక ‘జాతీయ’ పార్టీగా బీజేపీ హోదా నిర్వివాదమైనదే. అయితే ఈ హోదాతో ఆ పార్టీ నాయకత్వం ఏం చేయాలనుకుంటుందనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఇక ఇప్పటికైనా అది తమ నేతలు వాగ్దానం చేస్తున్న ‘అభివృద్ధి’ని ఆచరణలో చూపడం కోసం ప్రయత్నిస్తుందా? లేకపోతే విభ జనాత్మక, ప్రతీఘాతక అజెండాతో దేశాన్ని పునర్నిర్వచించాలని ఇప్పుడు చేస్తున్న కృషిలో ముందుకు సాగుతుందా? సంఘ్ పరివార్ ఈ రెండు రంగాలలోనూ ముందడుగు వేయాలని కోరుకునే అవకాశం ఎక్కువ. ఉత్తమ పాలననిచ్చేదిగా బీజేపీని ఉపయోగిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు తమ మౌలిక హిందుత్వ అజెండాను, ప్రత్యేకించి కేరళ, పశ్చిమ బెంగాల్, అసోంలలో ముందుకు నెట్టే కృషి చేయవచ్చు.
బీజేపీ దురహంకారాన్ని, అసహనాన్ని పెంపొందింపజేసే పార్టీ అనే ఆరోపణను ‘ప్రజలు’ తిరస్కరించారని ప్రకటించడానికి ఈ ఎన్నికల ఫలి తాలను సహజంగానే అది జాతీయస్థాయిలో వాడుకుంటుంది. అసోం, పశ్చిమ బెంగాల్‌లలో ఏదో ఒక రూపంలో గోమాంసాన్ని తినే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల బీజేపీ ఆ రాష్ట్రాల ఎన్నికల ప్రచారాన్ని ‘గో సంరక్షణ’కు దూరంగా ఉంచింది. అలా అని బీజేపీ తమకు లబ్ధి చేకూరు తుందనుకున్నచోట మతతత్వ పాచికను ప్రయోగించకుండా తగ్గుతుం దనేం కాదు. కేరళ, బెంగాల్‌లలో వచ్చే రెండు దశాబ్దాల కాలంలో బీజేపీ అధికారం కోసం పోటీ పడే ప్రధాన శక్తులలో ఒకటిగా ఆవిర్భవించగలదని ఆర్‌ఎస్‌ఎస్ విశ్వసిస్తోంది.
ఈ ఎన్నికల్లో అది కాంగ్రెస్ ఓట్లను రాబట్టు కున్నదని విశ్వసించడానికి తగ్గ కారణాలున్నాయి. అయితే దీర్ఘకాలంలో వామ పక్షాల ఓట్ల వాటాను కూడా లాక్కోవాలని అది ఆశిస్తుంది. బహుముఖ వైవిధ్యంగలవేగాక, పౌర (అధికారిక ఆదేశాలతో సంబంధం లేని) లౌకికవాద సంప్రదాయం దీర్ఘకాలంగా బలంగా ఉన్న రాష్ట్రాల్లో సంఘ్ బ్రాండు కఠోర దురంహంకారం పనిచేస్తుందా? అనేది వేచి చూడాలి. అసోం కొత్త ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌కు ఏ మాత్రం స్వేచ్ఛ లభిస్తుందనేది కూడా అనూహ్యమైనదే. అస్సాం విద్యార్థి ఉద్యమం నుంచి పుట్టిన ఆ నేత బీజేపీలోకి ‘పక్క దారి’ గుండా (ఏజీపీ నుంచి) వచ్చి చేరినవారు. ‘బంగ్లాదేశీయుల’ పట్ల ఆయన ఎప్పుడూ కఠిన వైఖరిని తీసుకునేవారు. సోనోనాల్ తన అసోమీ జాతీయవాదం లౌకిక స్వభావాన్ని పదేపదే నొక్కి చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్, అసోంలో కొత్తగా సమకూరిన పలుకుబడిని ఎప్పుడు అణచివేత అజెండాను ముందుకు నెట్టడానికి వాడుకోవాలని ప్రయత్నిస్తే అప్పుడు అది కొత్త ముఖ్యమంత్రి రాజకీయ సత్తాకు నిజమైన పరీక్ష అవుతుంది.
హిందుత్వ పాచిక పారినా పారకున్నా...
కాంగ్రెస్, వామపక్షాలు రెండూ ఈ ఎన్నికల్లో దెబ్బతిన్నాయనే వాస్తవం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు జాతీయ స్థాయిలో మరింత తెగువను చూపడానికి సాహసించేలా చేస్తాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల దిశకు సాగుతుండగా మధ్యలోని కీలక మజిలీ అయిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందటి రానున్న నెలల్లో పార్లమెంటులోనూ, బయటా సంఘర్షణాత్మక రాజకీ యాలు తీవ్రం కావచ్చు. అక్కడి శాసనసభ ఎన్నికలకు ఇంకా చాలా నెలల గడువుంది. రాష్ట్రంలోని విభిన్న వ్యూహాత్మక ప్రాంతాల్లో హిందుత్వ పాచికను ప్రయోగిస్తుందనడానికి క్షేత్ర స్థాయి సూచనలు ఇప్పటికే కనిపి స్తున్నాయి. ఢిల్లీ, బిహార్ లలో హిందుత్వ బీజేపీకి ఉపయోగపడక పోయినా... ఉత్తరప్రదేశ్ భిన్నమైనదని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తోంది. ఆ పార్టీ ప్రత్యర్థులు బిహార్‌లోలాగా కలసి కట్టుగా బరిలోకి దిగే అవకాశాలుగానీ, వాటిలో ఒకటి ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీలా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా అవత రించే అవకాశాలుగానీ అతి స్వల్పం.
ప్రధాని నరేంద్రమోదీ శాశ్వత ఎన్నికల ప్రచార పంథాలో పనిచేస్తుం డటం వల్ల ఆయన తన ‘బాధా-ముక్త్ భారత్’ (బాధల నుంచి విముక్తి చెందిన భారతం) అనే లక్ష్యానికి హామీ ఉండేలా ‘యుద్ధ ఖైదీలను పట్టుకునేది లేద’నే వైఖరిని అవలంబిస్తున్నారు. ఇది బీజేపీ తన ఇష్టానుసారం చేయడానికి అనువైన రాజకీయ, సంస్థాగత వాతావర ణాన్ని సృష్టిస్తుంది. తాజా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ఇక ఎంత మాత్రమూ దానికి అటంకం కాదనడానికి రుజువు.
ఇక మిగిలినవి ప్రాంతీయ పార్టీలు, అ హోదాకు అర్హత సంపాదించనున్న వామపక్షాలే. దీర్ఘకాలంలో బీజేపీ ప్రాంతీయ పార్టీలతో కూడా తలపడుతుంది. జాతీయ పార్టీ హోదా తనకు మాత్రమే ఉన్నదని దానికి తెలుసు. కాబట్టి ఒకటి, రెండు రాష్ట్రాల్లో ఓడినాగానీ లేదా ఉత్తరప్రదేశ్‌లో విజయం సాధించడంలో విఫలమైనాగానీ ఆ హోదా దానికి 2019 ఎన్నికలకు కచ్చితమైన అనుకూలత అవుతుంది.
thewire.in సౌజన్యంతో
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
- సిద్ధార్థ వరదరాజన్