
అవలక్షణాలను సీపీఐ అధిగమించగలదా?
తన సామాజిక వ్యవస్థను నెలకొల్పే సుదీర్ఘ మహాప్రస్థానంలో కమ్యూనిస్టు పార్టీకి ఇప్పటికి 90 ఏళ్లు వచ్చాయి. దశాబ్దాలు గడుస్తున్నా ఎక్కడా ప్రభావం చూపని నిస్సహాయస్థితిలో కమ్యూనిస్టులు ఉంటుంటే ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు నెలల్లోపే అధికారానికి ఎగబాకుతున్నాయి. లోపం ఎక్కడుందో కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికైనా ఆత్మశోధన చేసుకోవాలి.
త్యాగాల పునాదుల మీద పుట్టింది కమ్యూనిస్టు పార్టీ. సామాజిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి నూతన వ్యవస్థను నెలకొల్పడం పార్టీ లక్ష్యం. సుదీర్ఘమైన ఈ మహా ప్రస్థానంలో కమ్యూనిస్టు పార్టీకి ఇప్పటికి 90 ఏళ్లు వచ్చాయి. దేశంలో 1925 డిసెంబర్ 26న కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటైతే ఆ తర్వాత పదేళ్లకు ఆంధ్రాలో పురుడు పోసుకుంది. ఆ నాడు పార్టీ సభ్యుల సంఖ్య 40 మాత్ర మే. 1936 జనవరి 29న తూర్పు గోదావరి జిల్లా కాకినా డలో తొలి మహాసభను జరుపుకున్న సీపీఐకి పుచ్చల పల్లి సుందరయ్య కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మద్దు కూరి చంద్రశేఖరరావు, పోలేపెద్ది నరసింహమూర్తి, చలసాని వాసుదేవరావు, తనికెళ్ల వెంకటచలపతి, కొస రాజు శేషయ్య, అల్లూరి సత్యనారాయణ కార్యవర్గ సభ్యు లుగా ఉన్నారు. అనేక అవాంతరాలు, బ్రిటీష్ ప్రభుత్వ ఆంక్షల మధ్యే పార్టీని విస్తరింపజేసేందుకు అవిరళ కృషి, అపార త్యాగం చేశారు. విజయవాడలో 1943లో జరిగి న మూడో మహాసభల నాటికి చండ్ర రాజేశ్వరరావు లాంటి ఉద్దండులు తోడవడంతో కమ్యూనిస్టు పార్టీకి తిరుగులేకుండా పోయింది. కార్మికులు, కర్షకులు, కష్ట జీవుల పార్టీగా అవతరించింది. అణగారిన వర్గాలకు అరుణ పతాకం అండగా మారింది.
కులాల అంతరాన్ని తరిమి కొట్టడానికి, సమాజాభివృద్ధికి, సాహిత్య వికాసా నికి అవిరళ కృషి చేసింది. యువతకు కొత్త ప్రేరణ ఇచ్చింది. దోపిడీ, పీడనకు మారు పేరుగా నిలిచిన నైజాం సర్కార్ వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటానికి అండగా నిలిచింది. బందూకులు పట్టింది. ఊళ్లకు ఊళ్ల ను విముక్తం చేసింది. పేదలకు లక్షలాది ఎకరాల భూమి పంచింది. ఈ సాయుధ పోరాటంలో అశ్రుతర్పణలు చేసింది. అదేసమయంలో పార్లమెంటరీ వ్యవస్థలోనూ పైచేయి చాటింది. 1955 మధ్యంతర ఎన్నికల్లో అధికా రం అంచుల దాకా వెళ్లింది. వ్యతిరేకశక్తుల దుష్ర్పచారం, ఎన్నికల ఎత్తుగడల్లో వైఫల్యంతో ప్రతిపక్ష హోదాకు పరిమితమైంది. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో విలీనమైన తర్వాత 1956 జూలైలో హైదరాబాద్‌లో ఏడో మహా సభను ఉమ్మడిగా నిర్వహించుకున్న తెలంగాణ, ఆంధ్రా కమ్యూ నిస్టులు 9వ మహాసభ నాటికి అంటే 1960 నాటికి తీవ్ర కుదుపునకు లోనయ్యారు. 9వ మహాస భను ఓ వర్గం అనంతపురంలో నిర్వహించుకుంటే మరో వర్గం రాజమండ్రిలో నిర్వహించుకుంది.
అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన విభేదాలు, ఇతరత్రా విధానపరమైన కారణాలతో కమ్యూనిస్టు పార్టీ రెండు ముక్కలైంది. ఎర్రజెండాపై ఆంధ్రా ప్రజలు పెట్టుకున్న ఆశలు వమ్మయ్యాయి. పార్టీ చీలిక నేపథ్యంలో పదో మహాసభ 1964 నవంబర్‌లో గుంటూరులో జరిగింది. చీలిక తర్వాత జరిగిన ఆ తొలి మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నీలం రాజశేఖరరెడ్డి పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు అహరహం కృషి చేసినా ఫలితం లేకపోయింది. పరస్ప ర హననానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు (సీపీఐ, సీపీఎం) పాల్పడడంతో రెండు పార్టీలూ పుట్టేవాళ్లకు అన్నలా, పెరిగే వాళ్లకు తమ్ముడిలా మారాయి. వరంగల్ లో 1998లో జరిగిన సీపీఐ రాష్ట్ర 20వ మహాసభ ప్రత్యేక తెలంగాణకు జై కొడితే సీపీఎం సమైక్యాంధ్రకు కట్టుబడింది.
2015 మార్చి 3 నుంచి విజయవాడలో జరగనున్న మహాసభ పరిశేష ఆంధ్రప్రదేశ్‌కు తొలి మహాసభ అయితే పాత లెక్కల ప్రకారం 25వ మహాసభ. రాష్ట్ర విభజన, సమైక్య ఉద్యమంలో కకావికలైన పార్టీలలో సీపీఐ ఒకటి. ప్రజా పునాదులు కోల్పోయింది. 1955 ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీకి 2014 ఎన్నికల్లో చట్టస భల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఆనాడు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి సుమారు 30 శాతానికి పైగా ఓట్లు వస్తే నేడు రెండు శాతానికి (ఉభయ కమ్యూని స్టులకు కలిపి) పరిమితమైంది. తొలినాళ్లలో ఏ వర్గాలైతే అండగా ఉన్నాయో అవి పాలకవర్గ పార్టీలకు వెళ్లిపోయా యి. సీట్లు, ఓట్ల మోజులో పడిన పార్టీకి- కొందరైతే సభ్యులున్నారేమో గానీ పాలక పార్టీల అవలక్షణాలకు ఏమాత్రం తీసిపోరని చెప్పవచ్చు. దేశంలో ప్రవేశించిన ఉదార విధానాలతో పాటే పార్టీలోనూ ఉదారవాదం పెరిగిపోయింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండ డం, ఉద్యమాలను తేలిగ్గా చూడడం, సాహిత్య కృషి క్షీణించడం, బాధ్యతా రాహిత్యం, అవినీతి, జవాబుదారీ తనం లేమి వంటి సవాలక్ష అవలక్షణాలు అబ్బాయి. పార్టీలో ముఠాతత్వం, కులతత్వం పెరిగింది. ఆడంబ రాలు, విలాసాలు పెరిగాయి. చెప్పేదొకటి చేసే దొకటి షరా మామూలైంది. పదవులపై లాలస పెరిగింది.
ఏళ్ల తరబడి ఒకే వ్యక్తి పదవుల్లో కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టమని పార్టీ కురువృద్ధుడు ఏబీ బర్దన్ పదేపదే చెబుతుంటారు. కానీ సీపీఐలో ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. పార్టీకి నూతన జవసత్వాలను అందిం చే విద్యా, యువజన విభాగాలు నామమాత్రమయ్యా యి. వచ్చే వాళ్ల పట్ల ఆదరణ తగ్గుతోంది. కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం అలంకార భూషణం కాదంటూనే దాన్ని కాపాడుకోవడానికి నానా కుట్రలు, కుతంత్రాలు పన్ను కోవడం షరామామూలైంది. విశాల దృక్పథంతో వ్యవహరించడానికి బదులు చాలా సంకుచితంగా వ్యవ హరిస్తున్నారు. ఫలితంగా పార్టీ అంటే ఏ కొన్ని వర్గాలకో పరిమితమన్న భావన కలుగుతోంది. దశాబ్దాలు గడుస్తు న్నా ఎక్కడా ప్రభావం చూపని నిస్సహాయస్థితిలో కమ్యూనిస్టులుంటుంటే ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు ఆరేడు నెలల్లో అధికారానికి ఎగబాకుతున్నాయి.
లోపం ఎక్కడుందో కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికైనా ఆత్మ శోధన చేసుకోవాలి. కమ్యూనిస్టు పార్టీ ఆదిలో ఏమి చేసిందో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే చేసింది. పేదలుండే బస్తీల్లో తిష్ట వేసింది. వారితో మమేకమైంది. గుడిశ మీటింగులు పెట్టింది. జనాన్ని ఆకట్టుకుంది. ఫలితం-ఎక్కడైతే అధికారాన్ని పొగొట్టుకున్నారో అక్కడే గెలవడం. నిస్వార్ధం, త్యాగం, పారదర్శకత, జవాబు దారీ తనం, కాలానుగుణంగా మారడం వంటివి రాజకీ య కార్యకలాపాల నివేదికలకే పరిమితం చేయకుండా కసితో అమలు చేసే దిశగా కదలాలి. ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న వారిని ఏరిపారేయండి, కొత్త శక్తులకు ఊతమివ్వండి. పూర్వవైభవానికి నడుంకట్టండి. ఈ మహాసభలు అందుకు ఉపయోగపడాలని, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చెబుతున్న వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యతకు చిత్తశుద్ధితో క్రియాశీల పోరాటాలతో ముందుకు సాగాలన్నది ఆకాంక్ష.
(సీపీఐ 25వ రాష్ట్ర మహాసభలు రేపటి నుంచి విజయవాడలో జరుగుతున్న సందర్భంగా)
ఎ.అమరయ్య మొబైల్ : 9912199494