
రాజశేఖరుడు'ప్రజా శేఖరు'డైన వేళ
"మంచి వాడికి మరణం సాక్షి" అని మన పెద్దలు చెబుతుంటారు. ఈ సామెత అనుపమానమైన తన ఆరేళ్ల పాలనలో అక్షర సత్యంగా నిరూపించుకుని మంచి పాలకునిగా కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో శాశ్వత స్థాన్నాన్ని పొందిన ముఖ్య మంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డికి (ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి) వర్తించినంతగా బహుశా కడచిన యాభై నాలుగేళ్ళ రాష్ట్ర చరిత్రలో మరెవరికీ వర్తించదంటే అతిశయోక్తి కాదు! భారతీయుల సగటు ఆయుః ప్రమాణం 70 ఏళ్ళకు మించబోతున్న ఈ రోజుల్లో 60 ఏళ్ళ వయస్సు అనేది క్రియాశీలుడైన నాయకునిలో ఎదిగి వచ్చిన పరిణతికి నిదర్శనమేగానీ అతని వయస్సు మీరిపోవడానికి ఆనవాలు కాదు. జ్ఞాన దీక్షతో, వివేచనతో అనేక ఢక్కామొక్కీలు తింటూనే స్వయంశక్తితో, స్వయంప్రకాశంతో అంచెలంచెలుగా దూసుకు వచ్చినవాడు, రాష్ట్ర శాసనసభ సభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయక స్థానం నుంచి జాతీయ స్థాయిని అందుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి హోదాకు అర్హత పొందినవాడు డాక్టర్ వై.ఎస్.
ఇలా అమితమైన తెగువతో తన ప్రత్యేక వ్యక్తిత్వ ముద్రతో ముందుకు సాగుతూ వచ్చిన రాజశేఖరుడి జీవితమూ, రాజకీయ జీవితమూ అకస్మాత్తుగా అత్యంత విషాదకరంగా (హెలీకాఫ్టర్ దుర్ఘటన కారణంగా) అంతిమ యాత్రకు చేరుకోవడం - ప్రజల దృష్టిలో దుర్భరం, దుస్సహం! రాష్ట్ర చరిత్రలోని అయిదు దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వివిధ ముఖ్యమంత్రుల పాలనలో వివిధ రంగాలలో చవిచూసిన ప్రగతి ఒక ఎత్తు కాగా, అతి స్వల్పకాలంలోనే "ప్రజాశేఖరుడి"గా రూపమెత్తిన రాజశేఖరుడి పాలనలో కళ్లారాచూసి, ఆచరణలో, పరిమిత స్థాయిలోనే అయినా ప్రజలు అనుభవించిన అభ్యుదయం మరొక ఎత్తు. ఆయన తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఆయన అనుకున్నట్లుగానే, పరిపూర్తిగా ప్రజల అనుభవంలోకి యింకా రావలసి ఉన్నప్పటికీ - ఒక ముఖ్యమంత్రిగా ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఆయనలోని చిగురు తొడిగిన తపననూ, చిత్త శుద్ధినీ ప్రజాబాహుళ్యం గుర్తించింది. ఆయన పాలన పట్ల విశ్వసం పెంచుకుంది. రేపు తమ భవిష్యత్తు మరింత మెరుగుకానున్నదన్న ఆత్మవిశ్వాసాన్ని రాజశేఖరుడు కల్గించగలిగాడు.
రాజశేఖరుడిది ఆహార్యంలో తెలుగుదనం, ఆచరణలో సేవాతత్పరత, రాజనీతికి సరికొత్త నిర్వచనం. మనస్సు ప్రణాళికాబద్ధం, ప్రవర్తన సుశిక్షితం, మడమ తిప్పని నడత, మాట తప్పని నిబద్ధత, నిండైన వ్యక్తిత్వం, మెండైన ఆత్మీయత, కడుపునిండించే దరహాసం, పలకరింపులో ఆదరణ, పనిలో పట్టుదల, పట్టుదలలో తిరుగు లేని కార్యదీక్ష - ఇన్ని లక్షణాల సమాహారమే సందింటి రాజశేఖరరెడ్డి! ప్రజాసేవకు అతణ్ణి పురిగొల్పిన ఈ తపనే 2004 ఎన్నికల్లో సుమారు 1500 కిలోమీటర్ల మేర రాష్ట్రం ఆ కొసనుంచి ఈ కొసదాకా విడుపు లేని పాదయాత్ర చేయించింది. సరిగ్గా అదే తపన రాష్ట్రాధినేతగా పదవీ స్వీకారం చేసిన వెంటనే బహుముఖీనంగా - కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు కేసిన పలు వాగ్దానాలకు తోడుగా, ఇవ్వని హామీలను కూడా అతని చేత రూపకల్పన చేయించింది, చాలావరకూ ఆచరణలో పెట్టించింది! రాజశేఖరుడిలో పెల్లుబికిన ఈ తపనే తాను తలపెట్టిన పథకాలు, కార్యక్రమాలూ సచివాలయ స్థాయికి మాత్రమే కుదించుకుపోకుండా సామన్య ప్రజల జీవనానికి అద్దం పట్టే గ్రామాల స్థాయిలో ఆచరణలో, ఏ మేరకు అమలుకు నోచుకుంటున్నాయో తెలుసుకోవడానికి "పల్లెబాట" పట్టాడు, "రచ్చబండ" వద్దకు చేరాడు.
నేరుగా ప్రజలనుంచి, ప్రజల నోళ్ళ ద్వారా తెలుసుకోవాలన్న ఆబకొద్దీ ఆయన చేత ఈముందడుగు వేయించింది. చివరికి అదే తపన, అదే నిబద్ధత ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా లెక్కచేయకుండా అతణ్ణి మొండిగా ముందుకునెట్టి, అతని జీవితాన్ని అర్థాంతరంగా విషాదాంతంగా మార్చింది. అలా ప్రజా సేవాతత్పరతలోముందుకు సాగిపోతూ, తలపెట్టిన కొన్ని పథకాలు అంచనాలకు మించి విజయపరంపర సాగిస్తూ, ఆ పథకాలు ప్రజాయత్తం కాబోతున్న శుభఘడియలలో ఈ విషాదం రాష్ట్ర ప్రజల్ని దుఃఖసాగరంలో ముంచెత్తింది.
రాజశేఖరుడు తన ఆరేళ్ళ పాలనా వ్యవధిలో తలపెట్టిన పనులు ఒకటీ అరా కాదు, ఎన్నో! నిష్కామంగానేకాదు, నిశ్చలబుద్ధితో, అతను ఒక వర్గానికి కాదు, సేవలందుకోవలసిన ప్రజాబాహుళ్యం లోని పేద, మధ్య తరగతి వర్గాలకు, బడుగు వర్గాలకు, రైతాంగానికీ, వృత్తిదారులకూ, మహిళలకూ, విద్యార్థులకూ, ఉపాధ్యాయులకు, కిందస్థాయిలోని ఉద్యోగవర్గాలకు రకరకాల పథకాలు ప్రకటించాడు. ఈ ప్రకటించడంలో, అమలు జరిపించడంలో పెట్టుబడిదారీ వ్యవస్థ పెంచిపోషిస్తున్న ధనికవర్గ సమాజం అనుమతించిన పరిధులనూ, పరిమితులనూ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొనక తప్పలేదు. ఆ పరిమితుల్లోనే పేదవర్గాల అనుభవంలోకి కొన్ని నిర్దిష్టమైన పథకాలనయినా తేవాలని కృషి చేశాడు. "స్వాతివానకు ముచ్చెపు చిప్ప ఎదురుచూసి"నట్టుగా, పెక్కేండ్లుగా అనావృష్టికి గురవుతూ రైతాంగ ప్రజల నడ్డివిరుస్తున్న పరిస్థితులకు పరిష్కారంగా, గతంలో రాష్ట్రం అనుభవించిన వర్షాభావ పరిస్థితుల్ని కూడా దృష్టిలో ఉంచుకుని స్వల్పకాలిక, దీర్ఘకాలిక సాగునీటి పథకాలను రాజశేఖరుడు తలపెట్టాడు.
తన పాలనా వ్యవధికి ఉన్న పరిమితుల దృష్ట్యా కూడా ముందస్తు చర్యగా ఆయన 70 సేద్యపునీటి(ఇరిగేషన్) ప్రాజెక్టులకు రూపకల్పన చేయించాడు. కాగా అందులో 17-20 ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతిని కేంద్రంతో మాట్లాడి, పోట్లాడి మరీ సాధించాడు. తన తపనకు కార్యరూపంలో 9-10 ప్రాజెక్టుల్ని రైతాంగం అనుభవంలోకి అక్షరాలా నిర్మించి కూర్చున్నాడు! పెరిగి పోతున్న ధరల మధ్య పేదవాడికి కేజీ బియ్యం రూ.2లకే అందించే పథకాన్ని "రాజర్షి"గా రాజశేఖరరెడ్డి తన హయాములో కొసకంటా అమలు జరుపుతూ వచ్చాడు. తెల్లకార్డుల మీద ఏడాదికి దాదాపు రూ.2,000 కోట్ల మేర ఇందుకయ్యే సబ్సిడీని రాజశేఖర్ ప్రభుత్వం భరించింది. అంతేగాదు, పేదవాడికి బియ్యం ఇస్తే చాలదు, వంటావార్పులకు నెలవారీ సరుకులు(రూ.103 కిమ్మతుగలవి) కూడా సరఫరా చేయించాడు. ఈ తపన వెనక ఆయనకున్న ప్రత్యేక లక్షణం, ఇతరులలో మనం చాలా చాలా అరుదుగా మాత్రమే చూడగల్గిన ఆ గుణం - సమస్యల్ని నాన్చకుండా తక్షణ నిర్ణయాలు చేయగలగడం!
పనిమంతుడైన డాక్టర్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన పెక్కు పథకాలలో ఒకటి మహిళలకు ఆచరణలో సాధికారత కల్పించడం. స్వయం సహాయక సంస్థలలో సుమారు 1 కోటి 25లక్షల మందికి పింఛను సౌకర్యం కల్పించాడు. ఈ సంస్థల సభ్యులలో 60 సంవత్సరాలు నిండిన మహిళలకు రూ.500 - 2000 దాకా పింఛను ఏర్పాట్లు చేశాడు. విద్యారంగంలో బడుగుస్థితిలో ఉన్న పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్య వరకూ స్వయం సహాయ సంస్థల సభ్యుల బిడ్డలకు ఏటా ఉపకారవేతనాలు అందించే ఏర్పాట్లు చేశాడు.
ఇంజనీరింగ్ విద్యాదశకు చేరిన పేద(ఎస్.సి., ఎస్.టి., బి.సి)విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే భరించే ఏర్పాట్లు చేశాడు. అసలు 2004 మే 14 తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘడియలలోనే ప్రజల కిచ్చిన మాటకు నిలబడి రైతాంగానికి "ఉచిత విద్యుత్" అందించాలన్న ఆదేశపత్రంపై సంతకం చేశాడు. రూ.1,300 కోట్ల మేరకు పాత విద్యుత్ బకాయిలను ఒక్క కలంపోటుతో రద్దు చేసి రైతాంగం తలపై బరువును దించి, రైతాంగ ప్రజల అభినందనలు అందుకున్నాడు.
దీనికి తోడుగా పేద, నిరుపేద కుటుంబాల అనుభవంలోకి రాని సంస్కరణలను, ప్రభుత్వాల విధానాలలోని లొసుగులు ఆధారంగా న్యాయస్థానాలలో మూలుగుతున్న భూ పంపిణీ వివాదాలను పక్కన పెట్టి, నాలుగు విడతల్లో దాదాపు 6లక్షల ఎకరాలు, అయిదవ విడతలో మరో లక్ష ఎకరాలు(2010 ఏప్రిల్ లో) పంపిణీ చేసింది కూడా వై.ఎస్ ప్రభుత్వమే. అయిదవసారి భూపంపిణీ కార్యక్రమంలో విశేషం - రాజశేఖర్ ఏ కారణం చేతనైనా లేదా ఏ సాకు పైనయినా మహిళలకు అన్యాయం జరగకుండా ఉండేందుకుగాను మహిళల పేరనే భూస్వాధీన పట్టాలు యివ్వాలని ఆదేశించడం. ఆ ఆదేశం ప్రకారమే అయిదవసారి భూపంపిణీ జరిగింది.
కాగా, అన్ని సంక్షేమ పథకాలకి తలమానికమైన అంశం - ప్రజారోగ్య రక్షణలో ప్రథమస్థానం పేద, బడుగు వర్గాల ప్రయోజనాలకు యిచ్చే "ఆరోగ్య శ్రీ" పథకం. అపర "ధన్వంతరి"గా మారిన రాజశేఖరుడు తలపెట్టిన ఈ"రాజ"వైద్యం, ఉచిత వైద్యం, ఆపరేషన్లతో సహా, 942 రకాల వ్యాధులకు వర్తింపచేయాలన్న సంకల్పంతో "ఆరోగ్య శ్రీ" కింద కేవలం మూడేళ్ల వ్యవధిలోనే రెండున్నర లక్షల మంది పేదలకు, కొందరు మధ్యతరగతి వ్యాధిగ్రస్తులకు చికిత్స సమకూడింది. ఈ బృహత్ కార్యక్రమానికి సైదోడుగా కీలక పాత్ర వహించిన ప్రభుత్వ సేవావ్యవస్థలు పట్టణాలలో "108" , గ్రామీణకేంద్రాలలో "104" సంఖ్యలతో సంచార ఆరోగ్య కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ఈ పథకం దాదాపు అరడజనుకు పైగా పరాయి రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా రూపొందింది! ఇదే తపనతో డ్వాక్రా మహిళలకు అంతకు ముందు యిచ్చే12శాతం వడ్డీ స్థానే"పావల వడ్డీ "కే రుణాలు అందేలా చూశాడు. అలా డ్వాక్రా సామాన్య మహిళలకు బ్యాంకులిచ్చిన రుణాలలో దాదాపు 99శాతం రుణాలు సకాలంలో తీరుమానమయ్యాయి.
రాజశేఖర్ ప్రభుత్వం, ఆచరణలో పంపిణీకి అనుకూలమైన భూమి యింకా ఎంత ఉందో సర్వేజరిపి, లెక్కలు తీసేందుకు, అవి ఆధారంగా భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కోనేరు రంగారావు కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫారసులను ఆధారం చేసుకుని రాజశేఖర్ తన కుటుంబానికి సంబంధించి సీలింగ్ చట్ట పరిమితులకు లోబడి యింకా మిగిలిన 310 ఎకరాలను (ఎసైన్డ్ ల్యాండ్) ప్రభుత్వానికి దఖలు పరచడమే గాక, సుమారు మరో వెయ్యి ఎకరాలను కూడా పంపిణీకి సుకరం చేసి ఆదర్శంగా నిలిచాడు. అందుకే, సుప్రసిద్ధ రచయితలు, కళాకారులు బెస్ స్టీన్, సాల్ బెల్లో, సాల్వడార్ డాలీలు విభిన్న కోణాల నుంచి యిలా అని ఉంటారు: "ఈ జీవితాన్ని నీవనుకున్న సన్మార్గంలోకి మరల్చడానికి నీవు తిరుగులేని నిర్ణయం తీసుకోవాలి. ఆ మార్పును సాధ్యం చేయడానికి నీవు అసలు ఏం చేయాలనుకుంటున్నావో అందుకు తగిన స్పష్టత, లక్ష్యశుద్ది అవసరం"అని బెన్ స్టీన్ అంటే, "అనుకున్న సుదోర లక్ష్యాన్ని చేరుకోవాలంటే, ముందు చిన్న చిన్న పనులతోనే ప్రారంభించి జయప్రదం కావాలి"అని సాల్ బెల్లో అనగా- "ఆబ, తపన లేని మేధ, తెలివీ రెక్కలు లేని పక్షిలాంటిద"ని సాల్వడార్ డాలీ అన్నాడు!
డాక్టర్ రాజశేఖర్ రెడ్డికి తపన ఉంది, దానికి మించిన పట్టుదల ఉంది, మేధ ఉంది, దానికి ఆకాశమే హద్దుగా ఉంది, వీటన్నింటికీ మించిన ప్రజలంటే ప్రేమ ఉంది. ఆయన చిరంజీవి! చేసిన పనులతో ధన్యజీవి!
చైతన్యవంతమైన ఆరేళ్ళ పాలనా వ్యవధిలో రాజశేఖర్ పదవీ స్వీకార శుభఘడియల నుంచి తన అకస్మిక మరణం వరకూ అవిశ్రాంతంగా, అనితర సాధ్యంగా వివిధ సందర్భాలలో ప్రజల మధ్య కదలాడుతూ, కార్యవాదిగా చేసిన పనులకు సాక్షీభూతంగా, సుప్రసిద్ధ చిరంజీవి రవీందర్ రెడ్డి తన కెమెరాలో ఎన్నో ఘట్టాలను బంధించాడు. వీటిలోతన చిత్రాలతో పాటు ఇతర సోదర ఛాయాగ్రాహకులు తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని మిత్రుడు రవీందర్ సంకలన పరిచాడు. అతను కెమెరాతో సంధించిన అంగుళీ విన్యాసాలతో రాజశేఖర్ రెడ్డి వైవిధ్యభరితమైన జీవన సమర చిత్రచయనిక ఒక విశిష్ట నివాళి.
- డాక్టర్ ఏబీకే ప్రసాద్